Monday, September 23, 2024

 🪷🙏🏻🪷🙏🏻🪷
              
 *శ్రీ గురుభ్యోనమః*

      *కృష్ణుడు  గీతలో ...  పుష్పాలలోని  సువాసనను  గాలి  ఎలా  మోసుకొస్తోందో,  అలాగే  నీ ఏ ఇంద్రియానికి  ఏ వాసన  ఉందో,  ఆ వాసనని   నీ శరీరం  పోయిన  తరువాత  జీవుడు  మోసుకుపోతాడు.  ఇది  నిశ్చయం !*  అని  చెప్పాడు. 

మనం  భక్తిలో అభివృద్ధిలోకి  వెళ్ళాలంటే ...  మనకి  చేతనైతే  మంచి  చేయటం,  మంచి  చేసే  ఓపిక  లేకపోతే  మౌనంగా  ఊరుకోవటం.  ఊరకుండటం  ఉత్తమం !  గీతలో  ఉన్న  ప్రమాణం  ఏమిటంటే ...  జ్ఞానికి  చెయ్యటానికి  పనంటూ  ఏమీ  లేదు.  అలాగని  ఆయన   ద్వారా  పని  జరగదని  కాదు.  ఆయన  ఉపాధి ద్వారా  ఏ పని  అయితే  జరగవలసి  ఉందో ...  అది  జరుగుతూ  ఉంటుంది.  ఆయన  ఉపాధి  ద్వారా  మహా  సామ్రాజ్యం  ఏర్పడవచ్చు,  అది  చెప్పలేము.  జ్ఞాని  మాట్లాడకపోయినా,  ఆయనని  చూసి  లక్షలాది  మంది,  కోట్లాదిమంది  తరించవచ్చు.  అదంతా  ఈశ్వరుని  లీల !  అక్కడ  చెయ్యడానికి  ఎవడూ  లేడు.  భగవాన్  అదే  చెప్పారు ...  మీరు  ఎరిగిన  వెంకట్రామన్  ఇక్కడ  లేడు.  ఇక్కడ  ఉన్నవాడు  ఎవడో  మీకు  తెలియదు.  ఒకవేళ  నేను  చెప్పినా  మీకు  అర్థం  కాదు.

నాలో  ఏమీ  మంచితనం  లేదనుకోండి...  మీలో  మంచితనం  ఉన్నా  అది  నాకు  అర్థం  కాదు,  నా కళ్ళకు  అది  కనబడదు.  *నాలో  లేనిది  మీలో  కనపడదు.*   నాలో మంచితనం  ఉండి,  మీలో  కూడా  మంచితనం  ఉందనుకోండి ... అప్పుడు  మీలో  ఉన్న  మంచితనం  నాకు  కనపడుతుంది.  

చెవులుండి  కూడా  భగవంతుని  గురించి  శ్రవణం  చేయకపోతే,  వారంతా  చెవిటి  వాళ్ళతో  సమానమని  పెద్దలు  చెపుతారు.  అందుచేత,  మీ శరీరాలు  ఎక్కడ  ఉన్నా ...  పోడూరులో  ఉన్నా,  అరుణాచలంలో  ఉన్నా,  అమెరికాలో  ఉన్నా,  ఈశ్వరునితో  మానసిక  సంపర్కం  అవసరం.  నీ శరీరం  ఏ గ్రామంలో  ఉందనేది  ముఖ్యం  కాదు  మానసికంగా  ఈశ్వరునితో  అనుబంధం  ముఖ్యం.  నీ శరీరం  ఎక్కడ  ఉన్నా  నీ మనసు  చల్లబడితే,  నీ మనసు  అణిగిపోతే  ఎక్కడ  చూసినా  శాంతే !  నీ మనస్సు శాంతిని  అనుభవిస్తుంటే ...  నీ మనస్సు  ఆనందాన్ని  అనుభవిస్తుంటే ...  ప్రకృతిని  కౌగిలించుకోవానిపిస్తుంది,  సృష్టిని  అంతా  కౌగిలించుకోవాలనిపిస్తుంది.  ఈ సృష్టితో  నీకు  సన్నిహిత  సంబంధం  ఏర్పడుతుంది. 

*నీ బిడ్డతో  నీకు  ఎటువంటి  అనుబంధం  ఉంటుందో,  నీ హృదయంలో శాంతి  కుదిరితే ...  యావత్  సృష్టితో  అటువంటి  అనుబంధం  నీకు  ఏర్పడుతుంది.* 

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*పోడూరు :*  2000 / 08 / 10
  
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment