Wednesday, September 18, 2024

 ముగ్గురు స్నేహితులు - ఎనిమిది రొట్టెలు 

[ కర్మ అనేది ఎంత సరిగ్గా పనిచేస్తుందో చెప్పే కథ. దీన్ని జాగ్రత్తగా అర్థంచేసుకొంటే మనకు జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు , సమస్యలకు కొంత జవాబు దొరుకుతుంది ]

'కర్మ ' ను ఇంగ్లీషులో Fate , Destiny  అని కూడా పిలుస్తారు. 

మహేష్ , రమేష్ అనే ఇద్దరు స్నేహితులు పట్టణంలో ఏదైనా చిన్న పని వెతుక్కొందామని వాళ్ళ పల్లె నుండి బయలుదేరారు. [చాలా ఏళ్ళ క్రిందటి కథ , కానీ ఎప్పటికైనా పనికొచ్చే కథ.] సాయంత్రం అయ్యింది. ఒక దేవాలయపు మెట్ల మీద కూర్చొన్నారు. ఆరాత్రి అక్కడే పడుకొని , ఉదయం పట్టణం వెళ్లాలనుకొని , వాళ్ళు తెచ్చుకొన్న తిండి తినబోతుంటే అక్కడికి గణేష్ అనే మరో వ్యక్తి వచ్చాడు. [ కథ సులభంగా అర్థం కావడానికి పేర్లు పెట్టాను అంతే] '' చీకటి అయ్యింది. దుకాణాలు మూసేసారు, పళ్ళు కూడా దొరకలేదు. మీదగ్గర తినడానికి ఏమైనా వుంటే కాస్త ఇవ్వండి '' అని అడిగాడు.

మహేష్ దగ్గర 3 రొట్టెలు , రమేష్ దగ్గర 5 రొట్టెలు వున్నాయి. మొత్తం 8 రొట్టెలు. ఒక వేళ 6 వుండినా , లేదా 9 వుండినా సమానంగా పంచుకొనివుండవచ్చు కానీ 8 వున్నాయి. ఎలా పంచుకోవాలి అని ఇబ్బంది వచ్చినప్పుడు మహేష్ ఇలా సలహా ఇచ్చాడు : '' నా దగ్గర వున్న 3 రొట్టెలను ఒక్కోదాన్ని 3 భాగాలుగా 9 భాగాలు చేస్తాను[3X3]   , అలా నువ్వు [ రమేష్] కూడా నీ దగ్గరున్న 5 రొట్టెలను 5X3 గా 15 భాగాలు చేయి. అపుడు మొత్తం 24 భాగాలు అవుతాయి. 24 రొట్టె ముక్కలను మనం ముగ్గురం తలా 8 ముక్కలుగా సులభంగా పంచుకొని తినవచ్చు [ 3X8=24]. '' అలానే చేసారు. 

ఉదయం గణేష్ వెళ్ళిపోతూ , నా దగ్గర 8 వెండి నాణాలు వున్నాయి. నిన్న మీరు నా ఆకలి తీర్చినందుకు కృతఙ్ఞతగా నేను ఇవి మీకిస్తున్నాను అని 8 నాణాలు వారికిచ్చి వెళ్ళిపొయాడు.మహేష్ మరియు రమేష్ సంతోషించారు. తలా 4 నాణాలు పంచుకొందామని అనుకొన్నారు కానీ , రమేష్ అన్నాడు : "నీవు 3 రొట్టెలు ఇచ్చావు కానీ  నేను 5 రొట్టెలు ఇచ్చాను కదా నాకు 5 నాణాలు , నీకు 3 నాణాలు అన్నాడు." రమేష్ అభిప్రాయం సరిగానే వున్నా , మహేష్ అందుకు ఒప్పుకోలేదు. అపుడు వారిద్దరూ ఆ 8 నాణాలు తీసుకొని ఆ దేవాలయపు పూజారి దగ్గరికెళ్ళి , వారి కథను చెప్పుకొని '' మీరే వీటిని మా ఇద్దరికీ న్యాయంగా పంచండి '' అంటే ఆయన '' నాకూ ఇది ఇబ్బందిగానే వుంది , నా మాటలు ఒకరికి సంతోషం , మరొకరికి బాధ కలిగిస్తాయి.కాబట్టి నేను ఆ దేవుడినే అడుగుతాను. మీరు ఈరాత్రికి ఇక్కడే వుండండి. ఈ నాణాలను దేవుడి విగ్రహం ముందు పెడతాను. రేపు ఉదయం నాకు ఏదైనా ఆలోచన వస్తే చెపుతాను ,''  అన్నాడు. మహేష్ , రమేష్ ఒప్పుకొన్నారు. రాత్రి గడిచింది. పూజారి వచ్చి ఇలా అన్నాడు : '' నాకు రాత్రి కలలో ఎవరో ' మహేష్ కు 1 నాణెం , రమేష్ కు 7 నాణాలు ఇవ్వమని ' చెప్పారు, ". మహేష్ కు కోపం వచ్చింది. '' ఇది అన్యాయం , ఈలెక్క సరిగా లేదు, నేను ఒప్పుకోను '' అన్నాడు. అపుడు పూజారి ఇలా వివరించాడు : '' మహేష్ , నిజమే ఇది గణితశాస్త్రం ఒప్పుకొనే తీర్పు కాదు. కానీ దైవ న్యాయం అన్నిటికంటే గొప్పది.ఆ న్యాయం '' కర్మ '' ఆధారంగా నడుస్తుంది. మన అంగీకారం , అభ్యంతరం ఆధారంగా అది నడవదు. ఎలాగో తెలుసా ? నీవు  [మహేష్] నీ 3 రొట్టెలను 9 ముక్కలు చేసావు కానీ నీవు 8 ముక్కలను తిండిగా తిన్నావు. ఇచ్చింది 9 భాగాలు , పొందింది , తినింది 8 భాగాలు. అంటే  ఇతరులకు ఇచ్చింది 1 భాగమే కదా , అందుకే నీకు 1 నాణెం. కానీ రమేష్ తన 5 రొట్టెలను 15 ముక్కలు చేసాడు కానీ పొందింది , తినింది 8 భాగాలే. అంటే ఆయన  ఇతరులకు ఇచ్చింది 7 భాగాలు. అందుకే అతనికి 7 నాణాలు.''

కర్మ లెక్క ఇంత కచ్చితంగా వుంటుంది. మనమేమి చేసామో దానికి తగ్గట్టుగానే మనకు వచ్చే ఫలితం వుంటుంది. వేయి అవులు ఒక చోట వున్నా , వాటి దూడలను దూరంగా తీసుకెళ్ళి తిరిగి వాటిని వదలిపెడితే , వేయి ఆవులున్నా  ప్రతి దూడ కూడా కచ్చితంగా  తన తల్లి దగ్గరికే వెళుతుంది. అలాగే ' కర్మ ' కూడా. ఎక్కడున్నా , ఎలా వున్నా మనం చేసిన పాప పుణ్యాలు  కర్మ రూపంలో  సరిగ్గా మనల్ని వెతుక్కొంటూ వస్తాయి. కర్మ కు ఙ్ఞాపకశక్తి ఎక్కువ. మన సుఖ దుఖాలన్నీ మన కర్మ ఫలితాలే. Karma is ruthless but it is flawless too.

No comments:

Post a Comment