Monday, September 23, 2024

 *సూడసక్కని పిళ్ళ* (జానపద సరదా కథ) 
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
***************************
         ఒకూర్లో ఒక పూటకూళ్ళామె వుండేది. ఆమె తన పొలంలో జొన్నిత్తనాలు వేసుకోనింది. విత్తనాలైతే మొలిచినాయి కానీ పూత సరిగ్గా రాలేదు. దాంతో వినాయకుని గుడికి పోయి ''సామీ...సామీ...నా చేనులో పంట బాగా పండేటట్లు చేయి సామీ! అట్లా చేస్తే నీకు గంపెడు వుండ్రాళ్ళు చేసి పెడతా'' అని మొక్కుకోనింది. వుండ్రాళ్ళంటే వినాయకునికి చానా చానా ఇష్టం గదా...దాంతో నోట్లో నీళ్ళూరి ఆమె పంట బాగా పండేటట్లు చేసినాడు. వూర్లో ఎవరికీ పండనంత పంట ఆమెకు పండింది. ఆమె జొన్నలన్నీ అమ్ముకోని హాయిగా కాలు మీద కాలేసుకోని కూచుందే కానీ...దేవునికి మొక్కుకున్నట్లు వుండ్రాళ్ళు మాత్రం చేసిపెట్టలేదు.

వినాయకుడు ''ఈ రోజు చేసి పెడ్తాదిలే...రేపు చేసి పెడ్తాదిలే...'' అనుకుంటా ఆశగా చాన్నాళ్ళు ఎదురు చూసినాడు. కానీ ఆమె అసలు ఆ విషయమే మరిచిపోయింది. దాంతో వినాయకునికి తెగ కోపమొచ్చేసి ''ఓసి...దొంగదానా...నన్నే మోసం చేస్తావా...వుండు నీ పని చెబుతా'' అని ఆమె కడుపులో ఒక ఎలుక పిల్లను వేసినాడు. ఆమెకు లోపలున్నది ఎలుకని తెలీదుగదా...దాంతో ''అబ్బ నా కడుపు పండింది'' అని తెగ సంబరపడింది. ''ఆడపిల్ల పుడ్తాదా...మొగపిల్లోడు పుడ్తాడా'' అని ఎదురు చూస్తా వుంటే తొమ్మిదినెలలు దాట్నాక ఒక ఎలుకపిల్ల పుట్టింది. కడుపున పుట్టిందాన్ని పారేయలేం కదా. అందుకని ఆమె ''సరే...ఏదో ఒకటిలే'' అనుకోని దాన్నే ప్రేమగా పెంచుకోసాగింది.

ఆ రాజ్యానికి దూరంగా వున్న మరొక రాజ్యంలో ఒక రాజున్నాడు. ఆయనకు ఏడుమంది కొడుకులు. ఆరుమందికి పెండ్లయింది కానీ చిన్నోనికి కాలేదు. ఒకరోజు వాళ్ళ నాయన వాన్ని పిలిచి ''ఒరే... నాయనా... నీకెట్లాంటి పిల్ల గావాల్నో చెప్పు. తెచ్చి చేస్తా'' అనడిగినాడు. దానికి వాడు ''నాయనా... నాకట్లాంటిట్లాంటి పిల్లను చేసుకోవడం ఇష్టం లేదు. నా పెండ్లాంలాంటి అందగత్తె ఈ మూడు లోకాల్లోనూ యాడా వుండగూడదు. మెరుపులా మెరిసి పోవాల. చుక్కలా వెలిగిపోవాల. బంగారంలా ధగధగలాడాల, పువ్వులా కళకళలాడాల. అట్లాంటి సూడసక్కని పిల్ల కావాల'' అన్నాడు. ''సరే'' నని వాళ్ళ నాయన దేశదేశాల అందగత్తెల బొమ్మలన్నీ తెప్పించి వానికి సూపిచ్చినాడు. కానీ వానికి ఎవరూ నచ్చలేదు. దాంతో ఒకరోజు వాడు వాళ్ళ నాయన దగ్గరికి పోయి ''నాయనా... నాకు నచ్చేటటువంటి పిల్లను తేవడం నీ వల్లగాదు గానీ...నేనేపోయి బుడుక్కోనొచ్చుకుంటా... నన్నాశీర్వదించు'' అంటూ ఆశీర్వాదం తీసుకోని నచ్చిన పిల్లను పెండ్లాడ్డం కోసం గుర్రమేస్కోని బైలుదేరినాడు.

అట్లా... పోతా పోతా... ఒగటిగాదు రెండు గాదు కనబన్న రాజ్యాలల్లా తెగ వెదికినాడు. కానీ యాడా వానికి వాడు కోరుకున్నంత అందగత్తె దొరకలేదు. అలా ఒక్కొక్క వూరే దాటుకుంటా... దాటుకుంటా... ఆఖరికి పూటకూళ్ళామె ఇంటికి చేరుకున్నాడు. ఆమె వాని మొగం చూసి ''ఏం నాయనా... యాన్నించొస్తా వున్నావు. ఎందుకట్లా విచారంగా వున్నావు'' అనడిగింది. దానికి వాడు నెమ్మదిగా తన కథంతా చెప్పినాడు.

దానికామె వెంటనే ''ఓరినీ... దానికంత బాధెందుకు. నీకు కావలసింది సక్కదనాల సుక్కనే గదా. నాకో కూతురుంది. దానిది అట్లాంటిట్లాంటి అందం గాదు. అసలు ఈ సుట్టుపక్కల యాడా అంత అందమైన పిల్లనే లేదు. కాకపోతే ఇప్పుడు దీక్షలో వుంది. ఉగాది పండగొచ్చేంత వరకూ ఎవరూ సూడగూడదు. నీకు కావాలంటే చెప్పు పెట్టెలో పెట్టిస్తా...తీస్కోని పో'' అనింది. వాడు సరేనన్నాడు.

వెంటనే పూటకూళ్ళామె ఎలుకను తీసునోనొచ్చి మట్టసంగా ఒక పెద్ద పెట్టెలో పెట్టి వానికిస్తా ''జాగ్రత్త నాయనా...పండగ వరకూ పెట్టె తెరవద్దు. మధ్యలో తెరిచినావనుకో ఆమె ఎలుకైపోతాది. ఆపైన నీయిష్టం'' అని చెప్పింది. వాడు ఆనందంగా పెట్టె తీస్కోని ఒకొక్క వూరే దాటుకుంటా తిరిగి వాళ్ళ రాజ్యానికి చేరుకోని పెట్టె తీస్కోనిపోయి జాగ్రత్తగా తన గదిలో దాచిపెట్టుకున్నాడు.

వాళ్ళ నాయన వాన్ని పిలిచి ''ఏరా...లోకంలో యాడా వుండనంతటి సూడసక్కనైన పిల్లని నాకు కోడలిగా తెస్తానంటివి గదా...తెస్తివా''అనడిగినాడు. దానికి వాడు ''తెచ్చినాగానీ...ఇప్పుడు దీక్ష పట్టి వుంది. ఉగాది పండగనాడు మీకందరికీ చూపిస్తా'' అని చెప్పినాడు.

ఒకరోజు వాడు వుండబట్టలేక ''నాక్కాబోయే పెండ్లాం ఎట్లాగుందో ఏమో... ఎన్ని రోజులని చూడకుండా వుండేది. ఒక్కసారన్నా చూద్దాం'' అనుకోని సప్పుడు కాకుండా మూత తెరిచినాడు. అంతే... అందులో నుండి ఎలుకపిల్ల చెంగున ఎగిరి బైటకు దుంకింది. వానికి నిజంగానే పూటకూళ్ళామె పెట్టెలో పెట్టిచ్చినేది ఎలుకపిల్లనే అని తెలీదు గదా... దాంతో ''వారినీ... అనవసరంగా మూత తీసి బంగారుబొమ్మ లాంటి పిల్లను కాస్తా ఎలుకపిల్లను చేసుకుంటిని గదా'' అని తెగ బాధపడినాడు.

అట్లా కొద్దిరోజులు దాటగానే ఉగాది పండుగ దగ్గరకొచ్చింది. ఒకరోజు వాళ్ళమ్మ వాన్ని పిలిచి ''ఒరే...నాయనా...పండుగ దగ్గరకొస్తా వుంది గదా...వడ్లు దంచాల...మీ వదినలందరూ మొత్తమంతా మేమే ఎందుకు దంచాలా...సిన్నమరిది గూడా కాబోయే పెండ్లాన్ని తెచ్చుకున్నాడు గదా...వాళ్ళ వాటాను వాళ్ళే దంచుకోమను అంటావున్నారు. ఎట్లారా...'' అనడిగింది.

వాడు ఏమీ చెప్పలేక మట్టసంగా వచ్చి గదిలో కూచోని ''ఏమి చేయాలబ్బా'' అని బాధపడతా వుంటే ఎలుకొచ్చి ''ఏమైంది...ఎందుకట్లా ఒక్కనివే కూచోని తెగ బాధపడ్తా వున్నావ్‌'' అనడిగింది. వాడు జరిగిందంతా చెప్పినాడు. దానికా ఎలుక ''ఓస్‌... అంతేనా... దానికంత బాధెందుకు... రాత్రికి వడ్లమూటలు గదిలో ఏపిచ్చి బైటకు పో... రేప్పొద్దునకల్లా ఏమైతాదో నువ్వే సూద్దువు గానీ'' అనింది. ''సరే''నని వాడు రాత్రి వడ్ల మూటలు లోపల పెట్టి తలుపులేసేసినాడు.

వెంటనే ఆ ఎలుక వూళ్ళో వున్న ఎక్కడెక్కడి ఎలుకలనంతా పిలుచుకోనొచ్చింది. అంతే...అవి రాత్రికి రాత్రి ఒక్క వడ్లగింజ కూడా మిగలకుండా అన్నిట్నీ శుభ్రంగా వొలిచి కుప్ప చేసి వెళ్ళిపోయినాయి. పొద్దున్నే అందరూ వచ్చి చూస్తే ఇంగేముంది పెద్ద బియ్యం కుప్పుంది. అది చూసిన రాజు, రాణి, అన్నా, వదినలు ''అబ్బ...ఏమో అనుకొంటిమి గానీ నీక్కాబోయే పెండ్లాం ఇంత పనిమంతురాలా?'' అంటూ తెగ మెచ్చుకున్నారు.

అట్లా ఒక నాలుగు రోజులు గడిచేసరికి ఇండ్లంతా సున్నం వేయడం మొదలు పెట్నారు. వాళ్ళమ్మ వాన్ని పిలిచి ''''ఒరే...నాయనా...పండుగ ముందు ఇళ్ళంతా సున్నం కొట్టుకోవాల గదా...మీ వదినలందరూ మొత్తమంతా మేమే ఎందుకు కొట్టాల...సిన్నమరిది గూడా కాబోయే పెండ్లాన్ని తెచ్చుకున్నాడు గదా...వాళ్ళ గదిని వాళ్ళే కొట్టుకోమను అంటావున్నారు. ఎట్లారా...'' అనడిగింది.

వాడు ఏమీ చెప్పలేక మట్టసంగా వచ్చి గదిలో కూచోని ''ఏమి చేయాలబ్బా'' అని బాధపడతా వుంటే ఎలుకొచ్చి ''ఏమైంది...ఎందుకట్లా ఒక్కనివే కూచోని తెగ బాధపడ్తా వున్నావ్‌'' అనడిగింది. వాడు జరిగిందంతా చెప్పినాడు. దానికా ఎలుక ''ఓస్‌... అంతేనా... దానికంత బాదెందుకు... రాత్రికి సున్నం కుండలు తెప్పించి పెట్టిపో... రేప్పొద్దునకల్లా ఏమైతాదో నువ్వే సూద్దువు గానీ'' అనింది. కుండలన్నీ లోపల పెట్టి తలుపులేసేసినాడు.

వెంటనే ఆ ఎలుక వూళ్ళో ఎక్కడెక్కడి ఎలుకలనంతా పిలుచుకోనొచ్చింది. అంతే...అవి రాత్రికి రాత్రి తోకలు సున్నంలో అద్ది గదంతా శుభ్రంగా సున్నం కొట్టి బండలు అద్దం లెక్క తుడిచి వెళ్ళిపోయినాయి. పొద్దున్నే అందరూ వచ్చి చూస్తే ఇంగేముంది గదంతా ఒక్క మరక గూడా లేకుండా తళతళా మెరిసిపోతా కనబడింది. అది చూసి అందరూ ''అబ్బ నీక్కాబోయే పెండ్లాం ఎంత పనిమంతురాలురా... ఏ పని చెప్పినా ఇట్టే చిటికెలో చిన్న వంకర కూడా లేకుండా చేస్తా వుంది. పనులే ఇంత చక్కగా చేస్తా వుంటే ఆమె ఇంకెంత సక్కగా వుంటాదో'' అని తెగ మెచ్చేసుకున్నారు.

వాడు ''ఉగాది పండగనాడు నా పెండ్లాన్ని అందరికీ చూపిస్తా'' అని చెప్పినాడు గదా...పండగ దగ్గరకొచ్చేసింది. ముందురోజు రాత్రి మిద్దెపైన కూచోని ''రేప్పొద్దున నీ పెండ్లాన్ని చూపియ్యరా అంటే నేనేం చేయాల'' అంటూ తెగ బాధపడిపోసాగినాడు. ఎలుకొచ్చి ''ఏమైంది...ఎందుకట్లా ఒక్కనివే కూచోని బాధపడ్తా వున్నావ్‌'' అని అడిగింది..

దానికి వాడు విచారంగా ''పండుగ నాడు నాక్కాబోయే పెండ్లాన్ని చూపిస్తానని అందరికీ చెప్పినాను గదా...రేపే పండుగ....నిన్ను చూపిస్తే అందరూ నవ్వరా'' అన్నాడు. ఎలుకకు ఏం చెప్పాల్నో అర్థంగాక అది కూడా ఏడుస్తా... వూరిబైటున్న వినాయకుడి గుడికి పోయింది. వినాయకుడు అది ఏడుస్తా వుంటే చూసి ''ఏందబ్బా... పాపం.... ఎలుక ఇట్లా ఏడుస్తా వుంది. దానికేం కష్టమొచ్చిందో... ఏమో'' అనుకోని ప్రత్యక్షమై ''ఎలుకా...ఎలుకా...ఎందుకే అట్లా ఏడుస్తా వున్నావ్‌'' అనడిగినాడు.

ఎలుక కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా ''ఎందుకు స్వామీ...నన్ను అందరిలెక్క పుట్టియ్యక...ఇట్లా ఎలుకలెక్క పుట్టిచ్చినావు...నేనేం పాపం చేసినాను'' అంటూ జరిగిందంతా చెప్పింది. దానికి వినాయకుడు ''సర్లే...ఐపోయిందేదో ఐపోయింది. ఇంక నువ్వేమీ దిగులు పడొద్దు. దీనికంతా కారణం నేనే కాబట్టి నేనే చక్కదిద్దుతా'' అంటూ ఆ ఎలుకపిల్లను కాస్తా అందమైన పదహారేళ్ళ పిల్లగా మార్చేసినాడు. ఆమె సంబరంగా వురుక్కుంటా పోయి యువరాజుకు జరిగిందంతా చెప్పింది.

తరువాత రోజు పొద్దున్నే వాడు కాబోయే పెండ్లాన్ని తీసుకోని బైటకొచ్చినాడు. ఆమెను చూసినోళ్ళందరూ ''అబ్బ...ఎంతందంగుందీ పిల్ల...అచ్చం ముత్యాల పందిరి లెక్క'' అని తెగ మెచ్చేసుకోని, వాళ్ళిద్ద్దరికీ పెండ్లి చేసి ఆశీర్వదించినారు.
****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
****************************
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

No comments:

Post a Comment