Thursday, November 20, 2025

*భగవాన్ స్మృతులు- 10*
🪷
​రచన: గుడిపాటి వెంకట చలం

*​సాధుని శాంతమ్మ అనుభవాలు -7*


*తద్వి జిజ్ఞాసస్వ*

ఒకరోజు భగవాన్ హాలులో ధ్యానంలో కూర్చుని యుండగా స్వామి తలలోనుంచి ఒక వెలుతురు బయలుదేరి హాలంతా ఆవరించినట్లు అయింది. ఆ వెలుతురులో హాలూ, నేనూ, భగవాన్ అన్నీ కరిగిపోయి నాము. నేను అనేది మాత్రం వుత్త ఆకాశంలో తేలుతున్నట్లయింది. 'ఇదేమిటి? భగవాన్ కనపడ్డంలేదు?' అనే ఆలోచన వచ్చేటప్పటికి మళ్ళీ లోకం నా ముందు ప్రత్యక్షమయింది.

ఆ సంగతి భగవాన్ తో చెప్పితే, "తమో రజో గుణాలు అణిగి, సత్వగుణం ప్రధానమవు తున్నప్పుడు ఇట్లాంటి అనుభవాలు వస్తూంటాయి. మొహం ఎట్లా వున్నదో తెలుసుకోడానికి అద్దంలో చూసుకుంటాము. అంతేకాని, అద్దంలో కనపడేది ప్రతిబింబమే కాని, మన సొంత ముఖం కాదు కద! అట్లానే నీ ఇంద్రియాలకీ, మనసుకీ తెలిసేది ఏదీ వాస్తవం కాదు. ఎంత గొప్ప దృశ్యాలు కనబడినా, అవేవో నీ ఆత్మదర్శనమనుకు న్నా లేక, నాకే కదా యింత గొప్ప అనుభవం వచ్చిందనుకున్నా అంతటితో నీ అభివృద్ధి ఆఖరు. ఎవరికి కనిపిస్తుందో ఇదంతా అని తర్కించుకొని, వీటి నన్నిటిని తెలుసుకునేది ఏదో - ఆ తెలివిని పట్టుకోడానికి చూడు. నీ దృష్టి పని చెయ్యకుండా, ఏ ఆలోచనా లేకుండా ఏది వుందో, అదే నువ్వు. దాని నుంచి కదలకు” అని చెప్పారు.

ఎప్పుడైనా, ఏ పనిలోనైనా, ఏ దృశ్యంలోనై నేను గొప్పవాడిని ' అనే అహంకారము కనపడ్డనా, స్వామితో నీ తలమీద మొట్టికాయ తగిలిందన్నమాటే!
📖

*అసలు – వడ్డీ*

విలక్షణానంద స్వామి అనే యోగి శిష్యులు - భార్యాభర్తలు చిదంబరం నుంచి వచ్చారు, భగవానుని చూడడానికి, ఆమె నాతో చెప్పింది: ఆ యోగి, వాళ్ళని రోజుకి రెండు వేల రామనామ జపంచేసి, ఆ ఫలితాన్ని అంతా గురువుకే ఆర్పించమన్నారని. వాళ్ళకి భగవాన్ తో యీ సంగతి   చెప్పడం బెరుకై నన్ను చెప్పమన్నారు. నాకు అప్పటికి బాగా చనువు భగవాన్ దగ్గర. చెప్పాను.

కులాసాగా భగవాన్ అన్నారు: "రెండు వేల నామాల ఫలితమూ గురువుకే అర్పిస్తే వీళ్ళకేం మిగులుతుంది? అయినా, ఆయన తీసుకునేది వడ్డియే కదా” అని.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"అంటే జపంచేసే మనసు వీళ్ళకి మిగిలే వుంటుంది కదా. పై జపమే కదా గురువుకి" అని అక్కడ ఉన్న మురుగనారు అన్నారు.

"అవును. ఆ స్వామి వడ్డీ తీసికొని తన భక్తులకి అసలు అయినా వదులుతారు. ఇక్కడ ఈపెద్దస్వామి వున్నారే వీరు అసలూ వడ్డీ అన్నీ మింగేస్తారు. తీరా చూసుకుంటే మనది అనేది ఏమి మిగలదు" అని అంటూన్నప్పుడు మురుగనారు కళ్ళనుండి చంపలమీద ధారలుగా ఆనంద బాష్పాలు దొర్లాయి.
📖

*మాటలతో పండితులు*

ఇంకొక్కప్పుడు కుంభకోణం నుండి యిద్దరు స్త్రీలు వచ్చారు, వాళ్ళిలో ఒకామె గురువు, ఇంకో ఆమె చేలా. వాళ్ళే భోజనం వండుకొని దాంటో సగం భగవాన్ కి ప్రసాదం కింద అర్పించారు. ఆ సాయంత్రమే రైలుకి వెళ్ళా లన్నారు. గురువును భగవాన్ హాలులోకి తీసుకొని వచ్చి ఓచోట భక్తిగా కూర్చోపెట్టింది శిష్యురాలు. తానూ కూర్చుంది. ఉండుండి శిష్యురాలు భగవాన్ తో "ఆమె ఉందే అంతా మీ రకమే" అనీ, ఇంకోసారి "ఆమెదీ అంతా మీ స్థితే” అనీ ఇట్లా అంటూ వుంది, "తమ ఆశీర్వచనం కావాలి మాకు” అంది మళ్ళీ. “శీఘ్రంగా మోక్షం అందుకోగలిగేట్టు, ఏదన్నా ఉపదేశించండి” అంది ఒకసారి.

"ఆ మాటలకి దేనికీ భగవాన్ పలకలేదు. "ఏదో అంటారు. మమకారం అంటారు. మాయ పోవాలంటారు కానీ భగవాన్ మాకేమన్నా ఉపదేశిస్తే బాగుంటుంది" అంది.

మధ్యాహ్నం దాటుతోంది. ఆమెకి తొందర పుట్టింది "ఊ, కానీయండి మరి టైమౌతోంది” అని, మళ్ళీ కానీండి, ఉపదేశించండి. మేము రైలుకి వెళ్లాలి” అంది.

"మేము రైలుకి వెళ్లాలి, కానీండి” అని ఇట్లా హెచ్చరిక చేస్తోంది; స్వామి మాట్లాడలేదు. చివరికి కొంచెం తగ్గి "స్వామి! ఆమెకి ఏదన్నా చెప్పండి. అజ్ఞానం అదీ అంటారు-అదేమిటో కొంచెం ఉపదేశించండి. ఆ అజ్ఞానం అదీ ఏమిటో కొంచెం వివరించండి. మేము వెళ్ళాలి, రైలు టైమయింది” అంది.

కరుణామూర్తి భగవాన్ ఏమీ కోపించకుండా  మురగనార్ తో "అజ్ఞానం ఎవరికో అది తెలిసికోమనండి” అన్నారు.

"మీకు కావలసిన ఉపదేశం అయింది. ఇంక మీరు రైలుకి వెళ్ళవచ్చును” అన్నారు మురుగనార్.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
వాళ్ళు వెళ్లాక భగవాన్ అన్నారు: “తొందర. ఆలస్యమవుతూంది రైలుకి వెళ్ళి తీరాలి. వీలైతే ఆ కాసేపట్లో శీఘ్రంగా మోక్షమూ వెంట తీసికొని వెళ్ళాలి స్వామినుండి" మోక్షమేమన్నా అంగట్లో దొరుకుతుందా? అవీ, ఇవీ పుస్తకాల్లో అర్థంకానివన్నీ చదివి, ఆ మాటలతో పండితుల మైనామనుకుంటు న్నారు” అన్నారు.

నేను ఆశ్రమానికి వచ్చిన తరువాత నా దేవి పూజలు, మంత్ర జపాలు అన్ని కట్టుబడి పోయినాయి. నా సేవే నా సాధన. నా పూజ. సాక్షాత్త భగవంతుడే నా పక్కన నాతో కలిసి పనిచేస్తోఉంటే, దినమంతా ఆయన సేవ లోనూ, ఆయన భక్తుల సేవలోనూ గడుపుతూ ఉంటే, వేరే పూజలూ, దీపాలతో నా కనసరమేముంది?
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment