Wednesday, November 26, 2025

 *రమణ మహర్షి భగవాన్ స్మృతులు-12*
🪷

​రచన: గుడిపాటి వెంకట చలం

*​సాధుని శాంతమ్మ అనుభవాలు -9*

*కరక్కాయలు*

భగవాన్ నేను రాకముందు కొండమీద ఉండగా వారి తల్లి కళ్ళకి పట్టేసుకోడానికి కరక్కాయ కావాలన్నదట. ఆ యెండలో వూళ్లోకి కొండ దిగి యెవరు పోతారు? కరక్కాయ కొనడానికి డబ్బు యెవరికున్నది ఆ రోజుల్లో? ఊరుకున్నారు స్వామి.

మధ్యాహ్నానికి యెవరో ఆ దారిని పోతూ ఓ మూటెడు కరక్కాయలు పడేశారు. స్వామి తల్లిని పిలిచి "కరక్కాయలు కావాలన్నావు గా, ఇవిగో వచ్చాయి. తీసుకో” అన్నారుట.

మూటెడు యెట్లా వచ్చాయంటే తెచ్చిన అతనికే తెలీదు. ఎక్కడనుంచో బస్తాలతో కరక్కాయల బండి తిరువన్నామలై రోడ్డు మీద వెళ్ళుతోంది. బస్తాలతో కరక్కాయలు రెండెడ్లబండి నిండ! వాటిలో ఓ బస్తాకి చిల్లి ఉండి రోడ్డు వెంబడి ధారగా కరక్కాయలు పడ్డాయి. బండి అతను గమనించలేదు. ఈ మనిషి రోడ్డు మీద పడ్డ కరక్కాయలు పై పంచలోకి తీసుకున్నాడు. కానీ అన్ని కరక్కాయలని ఏం చేసుకోవాలో అతనికే తెలీదు. ఎందుకో తోచిందట - కొండ మీద ఆశ్రమంలో ఈ కరక్కాయలతో ఏదన్నా ఉపయోగం వుండవచ్చని తెచ్చి పడేశాడు.

ఓసారి నా చేతులో కానీ కూడా లేదు. “ఎట్లా రమణా! నాకెక్కడనుంచి వస్తుంది?" అని వూరుకున్నాను. అంతే. నాలుగు రోజుల్లో మనియార్డరు వచ్చింది ఐదు రూపాయలు, డాక్టర్ శ్రీనివాసరావు అనేవారినుంచి. ఆయన రమణ చరిత్ర చదువుచున్నారు.
దాంట్లో శాంతమ్మ అనే పేరు వచ్చింది. ఆ పేరు వినగానే అమెకేమైనా పంపాలని బుద్ధి కలిగిందట.

ఇట్లాంటివి ఎన్ని వందలో!
📖

*బోధ*

ఓసారి నేనూ, భగవాన్ కలిసి పొట్లకాయ కూరని నూనెలో వేయిస్తున్నాం. పొట్లకాయ లోని నీళ్ళు పిండకూడదు. ఆశ్రమానికి వచ్చింది ఏదీ వృధా కాకూడదు. అందుకని పొట్లకాయల్ని తరిగి అట్లానే వేసి నీరు పోయిందాకా వేయించాలి. చాలా పెద్ద బాణలి. పొయ్యికి ఒకవైపు స్వామి, ఇంకొక వైపు నేను కూచుని పెద్ద గరిటెలతో కూరని మాడకుండ తిప్పుతున్నాం. చాలా వరకు వేగింది.

అప్పుడు ఎందుకో స్వామి చప్పున గరిటను అట్లానే వదిలి చలనం లేకుండా కూర్చుని ఆగిపోయినారు. తలెత్తి ఆయన్నీ, చలనం లేని ఆయన చూపుల్నీ చూసి నేనూ భయం తో అప్రయత్నముగా ఆగిపోయాను. మనసు ఆగిపోయింది. చుట్టూ ఎవరూ కనబడలేదు.

కొంచెంసేపట్లో భగవాన్ కదిలి "కూరలోంచి శబ్దం ఆగిపోయింది. ఇదీ సమయం పొడి వెయ్యడానికి" అన్నారు. పొడి అంటే కూర పైన చల్లడానికి సిద్ధంగా కొట్టి వుంచుకున్న కూరపొడి.

అక్షరమణమాలలో అన్నారు భగవాన్:

"పొడిచే మైకపరచి

నా బోధ హరియించి

నీ బోధ గనిపించితి

అరుణాచలా," అని.

అట్లాగే "కూర శబ్దం అగిపోయినప్పుడు పొడి చల్లడానికి సమయం" అన్నారు. స్వామి. అంటే, మనసులోని శబ్దం ఆగి నిశ్చలమై పోయిన స్థితి మనిషికి వచ్చినపుడు గురువు ఉపదేశం చెయ్యవలసిన సమయం అని అర్ధం.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
శంకరమ్మ అని ఆశ్రమం వంటింటిలో సహాయం చేసే భక్తురాలు, భగవాన్ ఇడ్లీ తీసికొని అందరిమధ్య భోజనాల హాలులో కూచున్న సమయంలో వారికి నమస్కరించి అడిగింది: "నాకు ఉపదేశం కావాలి స్వామి!" అని.

భగవాన్ నవ్వుతో హాలులో అందరిని చూసి, "ఈ అమ్మకి ఉపదేశం కావాలట" అన్నారు. అని, శంకరమ్మతో 'కైవల్యం' అనే పుస్తకం లోంచి రెండు పద్యాలు చదివారు. వాటి అర్ధం “తాను పరబ్రహ్మను అని మరచి తాను జీవుడని అనుకోగానే ఈ జీవన్మరణ
పరంపరలలో పడుతున్నావు. 'నే నెవరిని?' అనే ప్రశ్నవల్ల నీవు సత్యాన్ని తెలుసుకుంటే, నీవు జీవుడవనే అజ్ఞానం చెదిరి నీ సత్య స్వరూపం తెలుసుకుంటావు. అప్పుడు నీవు పరబ్రహ్మ కాక వేరు కావనీ స్పష్టమౌతుంది. అదే మోక్షం. నీవు నన్ను అడిగావు కనుక నీకీ ఉపదేశం చేస్తున్నాను" అని.

అంతే. భగవాన్ ఎప్పుడూ ఎవరికీ, ఏ మంత్రాన్నీ ప్రత్యేకంగా వుపదేశించలేదు. ఆయన యిచ్చే దీక్షగాని ఉపదేశం గాని మౌనంలో జరిగేది. ఏదన్నా చెప్పితే 'నే నెవరు?' అనే విచారణే మహామంత్రం అని చెప్పేవారు. వారి నుంచి ఒక్కమాట, ఒక్క చూపు మహామంత్రోపదేశంకన్న పుజ్వలమైన శక్తిగా, జ్ఞానంగా తరింపచేసేది.
📖

*సుంకం*

ఒకసారి భగవాన్ భక్తులు ఒకరు తీర్థయాత్రలు చేసుకొని, సాయిబాబా మఠం మొదలైనవి దర్శించి, సాయిబాబా మహిమ లకు పారవశ్యులై తిరిగి భగవాన్ దగ్గరకు వచ్చి ఆ కబుర్లు చెప్పుతున్నారు. అప్పుడు భగవాన్ అన్నారు :

"ఒక్కసారి ఎవరన్నా ఇక్కడకు వచ్చారా, తరువాత ఎక్కడకు వెళ్ళినా, ఎన్ని దర్శించినా, ఇక్కడ - ఈ గేటులో సుంకం చెల్లించుకుంటేనే గాని లోపలకి పోవడానికి వీలుకలుగదు. ఒక్కసారి ఇక్కడకు వచ్చారా తరువాత ఎక్కడికి పోయినా చివరికి ఇక్కడికి చేరుకోవలసిందే. ఈ ద్వారంలోంచి తప్ప మోక్షానికి ప్రవేశార్హత లేదు."
📖

*కరుణ*

ఒకసారి ఒక భక్తుడు ఆశ్రమంలో భిక్ష చేస్తున్నారు. అప్పుడు భగవాన్ కి గట్టి జలుబుగా వుంది. జలుబుగా వుంటే, కాఫీ తాగరు, మజ్జిగ, పాలును వాడరు - చారు తప్ప. ఆ రోజు పోళీలు చేయించారు. వాటిలోకి బాదంపాలు చేశారు. 'స్వామి తినరే' అని మనసులో విచారంగానే వుంది. కాని చిన్నస్వామి 'ఫరవాలేదు. స్వామికి కూడా వెయ్యండి' అన్నారు.

రాజా అయ్యరు భగవాన్ కి ఓ పోళీ వెయ్యబోయినాడు. భగవాన్ దాంట్లో తీపి వేశారా అని అడిగారు. రాజయ్యరు లేదు అన్నాడు. చక్కెర వేసింది ఆ పోళీ. దాంట్లో కొంచెం చారు పోసుకుని మాట్లాడకుండా తింటున్నారు స్వామి. నాకేమో స్వామి పాలు పోసుకోలేదే అని వున్నది. 

చిన్నస్వామి పోళీ పాలు కూడా భగవాన్ కి వడ్డించవచ్చునని చెప్పారు. నేను బాదం పాలు అందరికీ వడ్డిస్తున్నాను. భగవాన్ కి చారు కావలసివచ్చింది. చేతిలో ఆ గిన్నెతోనే వెళ్ళి కొంచెం పాలు భగవాన్ కి విస్తట్లో పైన పోశాను.

ఆ పాలు పడగానే భగవాన్ తలెత్తి నా వంక చూశారు. కళ్ళు జ్యోతులవలె దివ్యంగా మండిపోతున్నాయి. 

“నేను చారు పొయ్యమంటే ఇంతలో పాలు ఎక్కణ్ణించి వచ్చాయి? అసలు నేను పాలు అడిగానా చారు అడిగానా? వెళ్ళి చారు తీసుకురా" అని రాజయ్యర్ ని పిలిచి ఇంకో పోళీ వేయించుకుని ఇంత చారు పోయించు కున్నారు. చారు, పోళీ, బాదంపాలు అన్నీ పిసికి తింటున్నారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
గుండెలు గబగబ కొట్టుకుంటున్నా నేను తల వంచుకొని అందరికీ వడ్డిస్తున్నాను. నేను అటువైపు వచ్చినప్పుడల్లా భగవాన్ "నేను పాలు అడిగానా? చారు అడిగితే, ఇంతలో పాలు ఎట్లా తెచ్చావు?" అని గద్దిస్తున్నారు. 

"పోళీలో తీపి ఉందా అంటే లేదంటాడు రాజా. చారు పొయ్యమంటే పాలు పోస్తావు. అయితే, మీరేది తినమంటే స్వామి అది తినాలి. స్వామికి యేం కావాలో స్వామి కాదు చెప్పేది, మీరూ నిర్ణయించేది. మీరేది విస్తట్లో వేస్తే అది తినాలి స్వామి" అని కోపంగా మాట్లాడుతున్నారు. 

ఏమి చెప్పటానికి తోచక నేను తల వంచుకున్నాను.

మర్నాడు స్వామి కాఫీ తాగలేదు. నా మూలంగా కాఫీ మానివేశారు. నేనూ ఓ నెల మానివేశాను. ఒక్కపూట కూడా కాఫీ లేకపోతే నిలవలేను. ఓ రోజు ఏడ్చాను భగవాన్ ముందు, "స్వామీ! తప్పు జరిగింది. దానికి ఇంత శిక్షా? మీరు కాఫీ తాగా" లని.

"నే నందుకు మానలేదే? నా వంటికి పడదు. కావలిస్తే డాక్టరుగారిని అడుగు. అడిగి చూడు! .... ఏమండీ డాక్టరుగారూ! కాఫీ నా వంటికి మంచిదికాదని చెప్పారు కాదూ? నా కెప్పుడూ పడదు కాఫీ. కొండమీద అంతే. నేను కాఫీ మానితే వీరందరూ తాగరు. వాళ్ళ మనస్సులు కష్టపడిపోతాయి. స్వామి మూలంగా మనకి కాఫీ పోయిందే అని తిట్టుకుంటారు" అన్నారు. 

కొద్దిరోజుల్లో చెంబెడు కాఫీ తెచ్చింది స్వామి కోసం జానకమ్మ. “చూడు, కాఫీ తెచ్చింది జానకి. ఇప్పుడింకేం చెయ్యను? కాఫీ తాగుతున్నాను" అన్నారు నాతో.

ఆ విధంగా తనకు లేని కోపాన్ని మా కోసం నటించేవారు స్వామి. ఒక్కొక్కప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఏమనరు. 'అమ్మో, స్వామి నించి యెన్ని చివాట్లు!' అనుకుంటూ వుంటే వారినుండి కరుణ తప్ప ఏమీ కురియదు. కాని, ఎప్పుడో ఏ చిన్న తప్పుకో ఒక్కసారిగా విరుచుకుపడతారు. కారణం ఆ నిమిషాన చేసిన చిన్న పొరబాటులో వుండదు. మాలో దాక్కుని వున్న ఏ కలుషాన్నో వెతికి పైకి తీసి మంట పెట్టాలనో, లేక మాలో పెరిగిపోతున్న అహాన్ని అణచాలనో, లేక - లేని ఆగ్రహాన్ని నటించి లోపల్నించి మా స్వభావాన్నంతా కెలికి శుభ్రం చెయ్యాలనో, ఒకసారి మండిపడి తిట్టి వూపి వదలిపెట్టేవారు. ఆయన ఆగ్రహమంతా ఆయన అపార కరుణ అని తెలుసుకున్న భక్తులు, ధన్యులు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment