*రమణ మహర్షి భగవాన్ స్మృతులు-15*
🪷
రచన: గుడిపాటి వెంకట చలం
*వారణాసి సుబ్బలక్ష్మమ్మ -3*
*పులిసిన మజ్జిగ*
ఆ రోజుల్లోనే ఒక విశేషం జరిగింది. భగవాన్ ఎండాకాలంలో తప్ప మజ్జిగ అన్నంలో పోసుకోరు. అదీ తియ్యని మజ్జిగే. పెరుగుని కాని, పాలను కాని ఉపయోగించరు. చారూ అన్నం లోనే ఒక్క గరిటెడు తియ్యని మజ్జిగ పోసుకుంటారు. ఆ తియ్యని మజ్జిగని ఆశ్రమంలో అందరికీ పొయ్యాలి. అందరికీ చాలకపోతే తానూ తీసుకోరు.
ఓ రోజు రాత్రి మజ్జిగ పులిసింది. “సరే, పులిసింది యెందువల్లనో? ఎవరిని అనేదేముంది? పోసుకోకుండా వుంటే సరిపోతుంది" అని వారు మజ్జిగ పోసుకోలేదు. ఎంత జాగర్త తీసుకున్నా మర్నాటి రాత్రికీ పులిసింది మజ్జిగ, ఏమి చెయ్యడానికి తోచలేదు. ఆ మర్నాటికీ అంతే అయింది.
ఆ మధ్యాహ్నం ఆశ్రమంలో పనిచేసే మనిషి అర పడి పాలు ఎక్కడినుంచో తెచ్చిచ్చాడు. దాన్ని తోడుపెట్టి వుంచిన సంగతి నాకు జ్ఞాపకము వచ్చింది. అది తియ్యని పెరుగు గా వుంది. ఆ పెరుగు తియ్యమజ్జిగ చేసి అందరికీ పోయాలంటే అది అందరికీ సరిపోదు. అందరికీ పోస్తేనేకాని స్వామి తీసుకోరు. తక్కిన వాళ్లంతా సంవత్సరం పొడుగునా పాలూ పెరుగూ తాగుతారు గదా, ఈ రాత్రికి వాళ్ళకి తేకపోతేనేం? స్వామి ఎప్పుడూ పాలూ, పెరుగూ, మజ్జిగా తాకరే ఈ కాస్త తియ్యని మజ్జిగ తప్ప! అదీ ఈ నాలుగు నెలలే. పులిసి పోయిందని ఈ రెండు రోజుల నుంచీ మజ్జిగే పోసుకోలేదు. తక్కినవారు తాగుతూనే వున్నారు. కనక స్వామివారికి తెలీకుండా అయినా సరే ఆయనకి తియ్యని మజ్జిగ వెయ్యాలని నిశ్చయించుకున్నాను.
ఆయన అన్నంలో చారు కలుపుకుని తింటున్నారు. నేను కుడిచేత్తో ఒక గరిటలో ఆ తియ్యని పెరుగు తీసుకుని, ముందుగా ఆ గరిటెడు పెరుగూ స్వామివారి చారూ అన్నంలో పోశాను. పోసి నేను తడిక పక్కగా నుంచుని ఆయనవంకే చూస్తూన్నాను. ఆయన నోట్లో అన్నం పెట్టుకుని కళ్ళెత్తి నా వంక చూశారు. ఆ చూపు ఈశ్వరుడు మన్మధుణ్ణి చూసిన చూపుమల్లే మండిపోయింది! నా వొళ్ళు గడగడ వొణికింది. భరించలేక లోపలికి వెళ్ళిపోయినాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
భగవాన్ లోకమ్మను పిలిచి మజ్జిగ పోయించుకుని "అందరూ యిక్కడికి అంత దూరంనించి సమత్వం నేర్చుకోడానికి వచ్చారు. నా దగ్గిరికి వస్తే, అందరూ ఒకే మాదిరి” అంటూ అందర్ని కలిపి కోప్పడి సోఫామీద కూచున్నారు. మేము మా పని కాగానే ఆయనకు నమస్కరించి వూళ్ళోకి వెళ్ళడానికి భగవాన్ దగ్గిరకి వచ్చినప్పుడు, ఆయన నన్ను చూడగానే మొహం అటు వైపు తిప్పుకున్నారు. అప్పుడు నేనేమై పోయినానో ఆయనకే తెలియాలి.
📖
*పాదాల మీద పడ్డాను*
మరునాడు వుదయం, భగవాన్ తేనమ్మతో "నేను ఇంక భోజనములో మజ్జిగ పోసుకోను" అన్నారు.
"అదేమిటి స్వామీ?" అంటే -
"నాకు గాను మజ్జిగపైన గడ్డగా పేరుకుంటోంది. అందుకని" అన్నారు. ఆ మధ్యాహ్నం మజ్జిగ పోసుకోలేదు. అది చూసి, నేనూ మజ్జిగ పోసుకోడం మానేశాను, నాకు మజ్జిగ ముఖ్యం భోజనంలో, అన్ని కాలాలలో, అందులో ఎండాకాలం మజ్జిగ లేనిదే నిలవలేను. కాని, స్వామి మజ్జిగ పోసుకోకపోతే, నేనెట్లా పోసుకుంటాను? అందులోనూ నా అపరాధంవల్ల కద!
మామూలుగా పనులు చేస్తున్నాం. భగవాన్ నవ్వుతూ నాతో మామూలుగా ఎప్పటిలా మాట్లాడుతున్నారు. నా తప్పు క్షమించమని ఆయన్ని అడగడానికి నాకు సమయం దొరకలేదు. నాలుగో రోజున అవియల్ చేస్తున్నాం భోజనానికి, భగవాన్ నుంచుని ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నారు. అవియల్లో పెరుగు పోయమన్నారు నన్ను.
ఆ సమయంలోనే వారి పాదాలమీద పడి, "స్వామీ! నేను తప్పు చేశాను, అందరమూ పెరుగూ, పాలూ బాగా తాగుతున్నాం. భగవాన్లు చారులో ఒక్క గరిటెడే గదా పోసుకుంటారని, పుల్ల మజ్జిగ పోయ చేతులు రాక, తియ్య, పెరుగు పోసినాను. అందులో అది మన వీరడు తెచ్చిన పాలు. ఇకమీద నాకు అటువంటి బుద్ధి పుట్టకుండా చేసి, భగవాన్లు ఇవాళ నుంచీ మజ్జిగ పోసుకోవలసింది. భగవాన్లు మజ్జిగ పోసుకోవడం లేదని నాకు కడుపులో వేదనగా వుంది" అని చెప్పాను.
"నేను మజ్జిగ పోసుకోవడం అందువల్ల మానలేదు. నాకు జలుబుగా వుంటోంది. అందుకని మానా"నన్నారు.
"వీలులేదు, మీరు మజ్జిగ పోసుకు తీరాలి" అని పట్టుపట్టా నేను. ఆరోజు మధ్యాహ్నం భోజనంలోకి ఎచ్చెమ్మ భగవాన్ కి పెరుగన్నం తెచ్చింది. ఆ అన్నం తింటూ భగవాన్ "ఇదుగో, నేను పెరుగన్నం తింటున్నాను. నేను మజ్జిగ పోసుకోవడం లేదని ఆ అమ్మకు వేదనగా వున్నదట" అని చుట్టూ వున్న వారితో అన్నారు. నాకు సంతోషమయింది. అప్పటినుంచి భగవాన్ మళ్ళీ మజ్జిగ వాడుతున్నారు.
ఒకనాడు శ్రీవారితో "నేను కావిడి కట్టుకుని భిక్షకుపోయి సన్యాసంగా వుంటాను" అన్నాను.
దానికి వారు, "భిక్షం ఎత్తిన వారందరూ సన్యాసులా? అంతటిలో జ్ఞానులైనారా? సన్యాసమంటే దాని అర్ధం ఏమిటో ముందు తెలుసుకో" అన్నారు..
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*వంకాయకూర రుచి*
ఒకసారి గిద్దలూరి నారాయణరావుకు వొళ్ళు జబ్బుగా వుండి ఆశ్రమానికివచ్చి విశ్రాంతిగా ఉంటున్నారు. వారికి వుప్పుడు బియ్యం గంజిచేసి ఇమ్మని భగవాన్ చెప్పారు. నేను ఆ గంజి తయారు చేస్తూ వుండగా భగవాన్ వంట ఇంట్లోకి వచ్చి చూసి గాడిపొయ్యి దగ్గిర నేలమీద కూచున్నారు. పొయ్యిమీద వున్న వంకాయ కూరని కొంచెంగా తీసి ఆకులో పెట్టి శ్రీవారిముందు పెట్టింది సంపూర్ణమ్మ. వారు రుచి చూస్తున్నారు. దాని పుణ్యమేమో, శ్రీవారికి కూర స్వయంగా పెట్టగలిగింది అనుకుని, మళ్ళీ 'నేనైనా వారి భక్తులకేగదా గంజి చేస్తున్నాను? ఆయనకి చేసినా, భక్తులకు చేసినా ఒకటే కదూ?' అని సమాధానం చెప్పుకున్నాను.
వెంటనే ఆ కరుణామూర్తి నావంక చూసి "ఇదుగో, కొంచెం మంచినీళ్ళు ఇయ్యి" అన్నారు. ఇచ్చాను. ఆయనకి అలా నీళ్ళు ఇవ్వగలగటం నాకెంతో తృప్తినిచ్చింది. భగవాన్ తనకి ఆకలి, భోజనం కావాలని గాని, దాహం నీళ్ళు కావాలని గాని ఎన్నడూ అడగరని అందరూ ఆశ్రమంలో చెప్పుకునే వారు. నాకది జ్ఞాపకం వచ్చి "నన్ను తృప్తి పరచడానికే కదా దాహమనీ, మంచినీళ్ళి మ్మనీ అడిగారు? ఎంత భక్తవత్సలులు!" అని కరిగిపోయినాను.
📖
*ఆరునెలల బిడ్డ మనస్సు*
ఒకనాడు హాలులో అయిదారుమంది బ్రాహ్మణులు వచ్చి అనేక గురు స్తోత్రాలు చేసి, చాలా శ్లోకాలు చదువుతున్నారు. నేను అక్కడే వున్నాను.
"ఎన్ని చదివినా గురువీక్షణము లేక, జ్ఞానము గలుగదు" అంటూ భగవాన్ లేచి వెళ్ళిపోయినారు. నాకు సంతోషమైనది. నాకు ఎన్నిసార్లు భగవాన్ కృపావీక్షణము కలిగిందో! ధ్యానంలో చూపులు, అనుగ్రహం గా చూపులు, ఆగ్రహంతో చూపులు - యెన్ని నా భాగ్యంకొద్ది దొరికాయో!
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కాని ఇంకోరోజు “జ్ఞాని మనసు ఆరుమాసాల బిడ్డ మనసు మాదిరిగా ఉండాలని చెప్పారు. అప్పుడు నాకు చాలా విచారమయింది. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే ప్రత్యక్షంగా వచ్చి వున్న ఇటువంటి స్వామివద్ద వారి పాదధూళికి పాత్రురాలినై కూడా ఇంకా నా మనసు ఆవిధంగా కాలేదే, ఈ మాయా చిత్రమేమో అని చింతించాను.
ఒకనాడు శ్రీవారు భక్తవిజయంలోని భక్తుల చరిత్రల్ని గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు నేను "ఆ భక్తుడికి భగవంతుడు కనపడ్డారు, ఈ భక్తుడికి అనుగ్రహం చూపారు అని భక్తవిజయంలో వుంటుంది. ఆ సంగతులు నిజమేనా?" అని అడిగాను.
దానికి వారు “అట్లా సందేహపడకూడదు. భక్తి చెడిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నది ఎంత నిజమో, అదీ అంత నిజం" అన్నారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment