Wednesday, November 26, 2025

 *రమణ మహర్షి భగవాన్ స్మృతులు-16*
🪷

​రచన: గుడిపాటి వెంకట చలం

*వారణాసి సుబ్బలక్ష్మమ్మ -4*

*ఒక కొత్త కాంతి*

ఒకనాడు మధురి అలమేలు అనే ఆమె శ్రీవారి దర్శనానికి వచ్చి వుపదేశం కావాలని అడిగింది. దానికి భగవాన్ సోఫా మీద కూచుని తన పాదాల వద్ద కింద కూచున్న అమె కేసి తిరిగి, అరవంలో తిరుపుఘళ్ నుంచి పాటలు ఎత్తి ఎత్తి చెపుతుంటే, ఏం చెపుతున్నారో భాష అర్థంకాకపోతేనేం, ఆయన ఆకారమే మారిపోయి, ఓ కొత్త కాంతి ఆయనలోంచి ప్రకాశిస్తున్నట్లు అయింది.

నా కళ్ళముందు ఆ బొజ్జ, ఆ మూర్తి నవ్వు, దయ, తమలపాకులు నములుతూ ఆయన మాట్లాడ్డం, ఆ సాన్నిధ్యం, ఆ దర్శనం- ఎన్నేళ్ళకీ కళ్ళకు కట్టినట్లు వుంటుంది. అట్లా మాట్లాడుతూనే లేచి వాకిట్లోకి వెళ్ళి వుమ్మేసుకుని తిరిగి వచ్చి, హాయిగా ఇటూ అటూ పచార్లు చేస్తూ చెపుతూ వుంటే, ఇంతలో ఆయన రూపమే మారింది. ఆయన్ని చూస్తూ వుంటే పెద్ద ఆనందం, ఆయన పాదాల వద్ద కూచునే భాగ్యం దొరికింది కదా నావంటి దానికి కూడా అనే అద్భుతం-ఇట్లా పరిపరి విధాల యోచనల్లో మునిగిపోయినాను.

అప్పుడు కాదు. ఎప్పుడూ అంతే. ఎవరు తన దర్శనానికి వస్తారో వారి అధికారానికి వారి ఆత్మస్థితికి తగినట్టుగా ఆయన రూపమూ, మాటా, వునికీ మారేవి.. చిన్న పిల్లలతో చిన్నవాడు, సంసారులతో సంసారి, వేదాంతులకు గురువు, యోగులకు సాక్షాత్ సర్వేశ్వరుడు, స్త్రీలలో స్త్రీ-ఈ విధంగా అయి, వాళ్ళ స్థితికే తాను వచ్చి వాళ్ళ మనసుల్ని కట్టేసుకునేవారు.

ఎవరు వచ్చినా ఆయన సౌందర్యానికి, దయకి, ఐక్యానికి ముగ్ధులై కట్టుబడి వదలలేక వదలలేక కదలేవారు. ఒక్కొక్కరికి ఎవరికీ తెలియకుండా వారికి మాత్రమే ఒక్కొక్క దర్శనం, ఒక్కొక్క అవతారం ప్రదర్శించేవారు. హాలులో వున్న ప్రతి వారికీ వారి అభిరుచుల్ని, తాహతునుపట్టి ప్రత్యేకమయిన దర్శనమయేది ఒకేసారిగా.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆయన ఫోటోలూ అంతే గద! ఒక ఫోటోకి ఇంకొకదానికీ సంబంధమే లేదు. తెలిసిన వాళ్ళు తప్ప ఇవన్నీ ఒక్కరి ఫోటోలే అని నమ్మలేరు. వారి రూపమే కాక, వాక్కులు, అభిప్రాయాలు, ఆదరం ఎప్పటికప్పుడు అన్నీ ఎన్నో విధాలుగా మారేవి. అన్నీ కనిపెట్టి నిలిచి చూసేవారికి మాత్రం అమితాశ్చర్యంగా వుండేది.
📖

*మోక్షం కావాలి*

ఒకరోజు మధ్యాహ్నం కుంభకోణం నుంచి ఒకామె వచ్చి, "స్వామీ! ఎన్ని రోజులనుంచో మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఆశ. ఇప్పటికి మీ దర్శనము దొరికింది. నాకేమీ వద్దు. ఒక్క మోక్షమిస్తే చాలు" అని నమస్కారం చేసి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళగానే - భగవాన్ సోఫా అంతా కదిలిపోయేటట్టు శరీరం అంతా ఆడుతూ ఒకటే పెద్ద నవ్వు నవ్వారు. అట్టా నవ్వుతూ నే అక్కడవున్న మమ్మల్నందర్నీ చూసి “ఆమెకు ఒక్కటీ వద్దుట. ఒక్క మోక్షమిస్తే చాలునుట" అన్నారు. 

అందుకు నేను “అవును, మేము కూడా అందుకే కదా వచ్చి వున్నాం" అన్నాను.

అందుకు శ్రీవారు “అవును, మోక్షమనేది ఒక మూటా ఇవ్వడానికి! ఆ మూటని నేను నా దగ్గిర దాచుకుని కూచున్నట్లు అడుగుతారు. ఇంక ఏమీ వద్దు అని నిజంగా వదిలివేస్తే, మిగిలేది మోక్షమే. సర్వ త్యాగమే మోక్షం. ఇంక నేను వేరుగా ఇచ్చేదేముంది?" అన్నారు.
📖

*జేగంట బహుమతి*

ఒకనాడు ఎవరో, ఆశ్రమంలో కోవిలలో హారతి సమయంలో వాయించడానికి ఒక జేగంటని తెచ్చి భగవాన్ కి అర్పించారు. వారు ఆ జేగంటని చేతులతో పట్టుకొని చాలాసేపు ఇట్లా వాయించి అట్లా వాయించి ఆ నాదం విని నవ్వుతూ "ఈశ్వరుడు అడిగేది సంచితమనే కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వమని. కాని, వీరు కాలణాకి కర్పూరం కొనితెచ్చి, వెలిగించి హారతి ఇచ్చి ఈశ్వరుణ్ణి ఏమార్చాలని చూస్తారు. ఇదంతా కన్ను తుడిచే వ్యాపారం. వీటికన్నిటికీ ఏమారేవాడు కాడు ఈశ్వరుడు. తాము చావకూడదు, తాము ఈశ్వరుణ్ణి మింగాలని వీరికి, అబ్బా! ఎంత ఆశరా?” అని నవ్వుతున్నారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇంకా అన్నారు యిలా: "కొంతమంది తాము ఈశ్వరుడికి అంతా అర్పణ చేశామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. వారిదేముంది? వారిది అని ఏముంది ఈశ్వరుడికి అర్పణ చేసేందుకు? ఈశ్వరుడిది ఈశ్వరుడికి ఇవ్వడమేగా, బెల్లంతో చేసిన వినాయకుడికి నైవేద్యంగా ఆ వినాయకుడి నించి కొంచెం బెల్లం గిలిపెట్టినట్టు, సర్వమూ ఆ ఈశ్వరుడే అని వూరికే వుండడమే అసలు ఈశ్వరుడికి వీరు చేయగల శ్రేష్టమైన అర్పణ: వూరికే వుండడమంటే ఏ ఆలోచనలూ లేకుండా వుండడం."
📖

*ఇడ్లీ తినని వేణమ్మ*

ఒకనాడు పొద్దున్న భగవాన్ బాదంచెట్టు కింద కూచుని వున్నారు. అప్పుడు వేణమ్మ పడుకుని వుంది. భగవాన్ శాంతమ్మని పిలిచి వేణమ్మకి ఇడ్లీ పెట్టమన్నారు. శాంతమ్మ “అది ఇడ్లీ తినదు" అంది. ఎందుకు తినదని అడిగారు భగవాన్, “ఇడ్లీ వుప్పుడు బియ్యంతో చేస్తామని, ఆచారం గనక తినదు” అన్నది శాంతమ్మ.

దానికి భగవాన్, “అదేమిటి? చేతుల్లో పెట్టినది తినవలసిందే. "అదేమిటి? ఇదేమిటి? అది తినను, ఇది తినను అంటూ ఈ చేష్టలన్నీ పనికిరావు" అని కోపంతో గద్దించారు.

నేనూ అంతే. ఆశ్రమానికి వచ్చి పది నెలలయింది. ఇడ్లీ నేనూ తినడం లేదు. ఉప్పుడు బియ్యంతో చేస్తారనీ, ఆచారానికి లోపమనీ.

నేను శాంతమ్మతో "నేనూ తినడం లేదని భగవాన్ తో చెప్పకేం!" అని లోపలికి వెళ్ళి చప్పున ఇంత ఇడ్లీ తీసుకుని తినేశాను.

ఆశ్రమానికి నేను మొదట వచ్చిన్నప్పుడు కొద్దిమంది మనుషులు మాత్రమే ఉండే వారు. భగవాన్ తమ్ములు శ్రీనిరంజనానంద స్వాములవారే వంట. వంటకు పై పని, చింతపండు పిసికి ఇవ్వడమూ, పప్పులు రుబ్బడమూ ఇదంతా పెద్దస్వాములవారే చేసి, తరువాత హాలులోకి పోయి సోఫామీద కూచునేవారు. నేను వచ్చిన తరువాత కూడా నాతో కలిసి భగవాన్ పప్పు రుబ్బడమూ, కూరలు తరగడమూ, వంటకు అందివ్వడమూ - ఈ పనులన్నీ చేసేవారు. తెల్లవారగట్ల నాలుగింటికే లేచి, తన చుట్టూ వుండే సాధువులతో కలిసి కూరలు ముందు తిరిగి సిద్ధంగా పెట్టేవారు. వంటకి శాంతమ్మా పై పనులకు నేనూ, తేనమ్మా.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment