Wednesday, November 26, 2025

 *రమణ మహర్షి భగవాన్ స్మృతులు-17*
🪷

​రచన: గుడిపాటి వెంకట చలం


*వారణాసి సుబ్బలక్ష్మమ్మ -5*


*మూడింటికి హాజరు*

రాత్రి ఊళ్ళో పడుకుని తెల్లారి ఆరుగంటలకి ఆశ్రమానికి వచ్చేవాళ్ళం. ఈలోగా ఇడ్లీ శ్యామయ్య చేసిపెట్టేవారు. ఇడ్లీలోకి ఏవో ఆకులన్నీ కలిపి పులుసు తయారుచేయించే వారు భగవాన్, మేము ఆరింటికి వస్తుంటే, ఈలోగా ఇడ్లీ అవీ చెయ్యడం చూసి మేము తెల్లారకట్ల నాలుగింటికే ఆశ్రమానికి రావడం ప్రారంభించాం. మేము నాలుగు గంటలకు రావడం ఏమాత్రం ఆలశ్యమైనా భగవాన్ తాను ఇంకో బ్రాహ్మడి సహాయం తీసుకుని దోసెలూ, కాఫీ తయారుచేసేవారు. అది చూసి ఈసారి మేము తెల్లవారుఝామున మూడింటికే వచ్చి యిడ్లీ కాఫీ తయారుజేసి, భగవాన్ సన్నిధిలో కూచున్నాం.

"ఇదుగో చూడు, స్వామి పొయ్యి దగ్గిర పనిచేస్తున్నారని, నాలుగు గంటలల్లా పోయి మూడు గంటలకే వచ్చారు వీళ్లు" అని భగవాన్, తను పొయ్యి దగ్గిరికి వెళ్ళడం వల్ల, మేము తొందరగా రావడమవుతోందని తలచి, మాపై కరుణవల్ల ఆనాటినుంచీ కాఫీ పొయ్యిదగ్గరకి రావడం మానుకున్నారు. మేము బద్దకించి ఆరుగంటలదాకా రాకపోయినా, మాకోసం ఎదురు చూస్తూ కూచునేవారు స్వామి. అంత దయామూర్తి ఆయన!
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఎవరికి కష్టం కలగచెయ్యడమన్నా ఆయనకే మాత్రం ఇష్టం వుండదు. చాలా స్వల్ప విషయాలనించి పెద్ద విషయాల వరకు అంతే. ఎన్ని తప్పులు చేసినా, 'దానికేమిలే' అని సమాధానం చెప్పి దయ చూపించే వారు. కాని, ఎంతో కోపం చూపి కూడా తన ఆజ్ఞల్ని నెరవేర్చేటట్లు చూసేవారు. ఆయనకి ఏంకావాలి? ఎవరు చేసేదేముంది ఆయనకి? కాని, వారి వారి సంస్కార క్షయానికే, వారిని ఒక మార్గంలోకి తీసుకువచ్చేందుకే కోపమూ కఠినత్వమూ నటించేవారు భగవాన్. 

చాలా పప్పు రుబ్బవలసిన పనివస్తే, ఎవరికి భారమౌతుందోనని తామూ వచ్చి కూచుని పప్పు రుబ్బుతారు. "అదేమిటి స్వామీ, తమకీ శ్రమ?" అంటే మామీద వారు కోపం చూపేవారు. అందరూ సమంగా పని చేయాలని, ఒక్కరు ఎక్కువ అని, తక్కిన వారు ఆయన్ని కూచోపెట్టి పనిచేయడము అంటే వారికి ఏమాత్రమూ గిట్టదు.

ఇట్లా మాతో వంటా, పనులూ చేసే మా సహచారి వెళ్ళి సోఫా పైన కూర్చున్నారా: పరమశివుడు కైలాసంపైన కూచుని దర్శనం యిచ్చినట్లు కనిపించేది.
📖

*తెలుగు పద్యం రాశారు*

ఒకరోజు భగవాన్ వశిష్ట రామాయణంలోని ఒక శ్లోకాన్ని తెలుగు పద్యంగా రాశారు. మధ్యాహ్నం భోజనమైనాక సోఫా మీద కూచుని వుండగా, నేను హాలుకి ప్రదక్షిణంగా వెడుతున్నాను. దగ్గర వున్న అనంతాచారిని చూసి భగవాన్ "అందమ్మ (ఆ అమ్మ) పోయినదా?" అని అడిగారు. నేను వెనక్కు వెళ్ళి, వారికి ఎదురుగా నుంచున్నాను.

నన్ను చూసి, వారు "ఇదుగో, తెనుగు పద్యం. ఇది తీసుకుని చదువు" అన్నారు. దానికి నేను "నా దగ్గిర కళ్ళజోడు లేదు, సరిగా చదవనూ లేను" అన్నాను. అప్పుడు ఆ పద్యాన్ని అనంతాచారిచేత చదివించి అర్ధం చెప్పారు..

ఆ పద్యం యిది :

బహువిధ దశలన్ని పరిశీలనముచేసి సత్వరం పదమేది తత్పదమును హృత్తునగాని భువినెన్నడు గ్రీడింపు భావమ్ములో నెల్ల భావమదియ, 
ఎరిగితివా దృష్టి యెప్పుడూ విడువక 
యిల యందు వర్తిలు మిచ్చపగిది 
సంభ్రమ సంతోష సంతాప కోప న 
మారంభ ప్రారంభ వ్యాజముగ విహరించు లోవిమలుడగుచు
ఆశాపాశ విముక్తుడై అన్ని వృత్తులందు సమభావముంగల్గి అవనియందు
వేషయుక్తుడై వెలియాడు వీరరామ!

దానికి నేను "మాకీ పద్యాలూ, వాటి అర్థమూ - ఇదంతా ఎందుకు? సర్వ పద్యాలలో అర్థమూ, వేదాంతమూ అన్నీ మీలో ఒప్పి వున్నాయి. మిమ్మల్ని నమ్ముకుంటే మాకు చాలు. ఇవన్నీ మాకేం అవసరం?" అన్నాను.

దానికి స్వామివారు "నాకేమి తెలుసు? నాకు శాస్త్రాలు తెలుసునా? నాకేమీ తెలియదే? నా దగ్గిర ఏముంది? నాలో ఒప్పి వున్నాయట! ఏమి వున్నాయి?" అన్నారు.
📖

*ఇవన్నీ ఎందుకు?*

భగవాన్ వాకిట్లోకి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ నేను ఆయనని చూడగానే లేచి నుంచుంటో వుండేదాన్ని. ఆయన చూస్తూనే వుండేవారు. ఆయన మా ఎదురుగా వస్తే చాలు- అందరం కూడా భయభక్తులతో ఒక పక్కకి ఒదిగి వుండేవాళ్ళం.

నేను ఊళ్ళో కాపురం వుండి ఆయన దర్శనార్థం వచ్చే కాలంలో నేను వచ్చినప్పుడల్లా కొంచెం ద్రాక్షపళ్లు కొని తీసుకొని వచ్చి ఆయనకిచ్చే అలవాటు. ఒక సాయంత్రం అదే ప్రకారం తెచ్చిన ద్రాక్షపళ్ళని ఆయనముందు పెట్టాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
దానిని చూసి, “ఇప్పుడెందుకు తెచ్చావు?" అని నవ్వి, "ఎప్పుడు తెచ్చావు యివి? పొద్దున తెచ్చావా, వచ్చేటప్పుడు! అయితే, యివి ఇప్పుడెందుకు పెట్టావు?" అని నన్నూ- అందర్నీ కలిపి. "ఇదంతా యెందుకు? స్వామిని చూసి నుంచునేదీ, చాలా భక్తి వున్నట్టు నటించేదీ, ఈ వేషాలన్నీ ఇక్కడికి వచ్చిన తరువాత యిది నేర్చుకున్నది. ఇవన్నీ యెందుకు? వీటివల్ల ఏం ఫలం? మామూలుగా వుంటే చాలదా? మనసు నిర్మలంగా ఉండాలిగాని ఈ నమస్కారాలూ, మన్ననలూ- యివన్నీ వేషం. స్వామిని కన్ను తుడిచి ఏమార్చాలని చూసే పనులు" అని మురుగనారుతో ఆ సంబంధంగా ఏవేవో కథలు చెప్పారు అరగంటసేపు.

ఇంకా యిలా అన్నారు :"ఈ నమస్కారాలు అన్నీ యేం ప్రయోజనం? అయ్యంగార్లు యిష్టం వుంటే గురువుకి నలుగురూ చూసేటప్పుడు మరియాదచేసి భక్తి చూపేదీ; ఇష్టం లేకపోతే ఒక గుంటతీసి, 'స్వాములవారూ, దయచేసి మీరే ఆ గుంటలో కూచుంటారా? లేకపోతే మిమ్మల్ని ఎత్తికూచో పెట్టమా? అని అడుగుతారు."

ఆ కథలు విని ఆరోజు నమస్కారం పెట్టడానికి గూడా భయపడి వాకిట్లోంచే వెళ్ళిపోయినారు మురుగనారు. ఆ రోజు మురుగనారుతో చాలా మాటలు అన్నారు భగవాన్. “మొదట మనుషులు ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తి వినయాలతో వస్తారు. తరువాత - త్వరలోనే సర్వమూ వారిదే. అంతా వారి ఇష్టమే, అధికారమే. వారు చెప్పినట్లు స్వామి వినాలి. స్వామిది యేదీ లేదు. వారు యెన్ని తప్పులు చేసినా వూరికే నోరుమూసుకు వుండవలసిందే స్వామి. వారు ఒక్క నమస్కారం చేశారా, అర్ధం ఏమిటంటే- మేము నమస్కారం పెట్టాం గదా, మా తప్పులకి ఇక మీరు ఏమీ అనడానికి వీలులేదు అని.” ఇట్లా చాలా కోప్పడ్డారు.

ఆ తరువాత అందరికీ భయమే ఆయనకి నమస్కారం పెట్టడమన్నా, ఆయనికి ఏమన్నా తీసుకొని వెళ్ళడమన్నా. మురుగునారు మొదలైనవారు స్వామివారికి దూరంనించే నమస్కారం పెట్టుకుని వెళ్ళేవారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment