*రమణ మహర్షి భగవాన్ స్మృతులు-18*
రచన: గుడిపాటి వెంకట చలం
*వారణాసి సుబ్బలక్ష్మమ్మ -6*
*చేతిలో చారు*
భగవాన్ కి భోజనం వడ్డించేటప్పుడు చారు చేతిలో పోసేదాన్ని. ఆయన ఆ చారు తాగిన తరువాత మళ్లీ చారు చేతులో పోసేదాన్ని. వారు తాగినంతసేపూ అట్లానే - పోస్తాను. ఒక రోజు ఇంక చారు పొయ్యవద్దు పొమ్మన్నారు. మరునాటినుంచీ అన్నం - గుంటచేసి, ఎంత చారు పడితే అంత చారే పోసుకుంటున్నారు. నావల్ల ఏమి తప్పు జరిగిందా అని నేను బాధపడ్డాను.
చివరికి వారు వంటింట్లోకి వచ్చినప్పుడు ఓ రోజు నాకు భయమై శాంతమ్మ చేత అడిగించాను. "ఏం తప్పు జరిగింది? చారు చేతులో పోసుకోరేం?" అని.
“నాకు ఒక్కడికే చారు పోస్తూ కూచుంటే, తక్కిన వాళ్ళందరూ చారు కోసం కాచుకుని కూచుంటున్నారు. కనపట్టంలేదా? వాళ్ళకీ పోసివచ్చి నాకు పోస్తూవుంటే సరిపోతుంది" అన్నారు.
వారికి ఎక్కడ ఆలస్యమౌతుందోనని మా భయం.
"తప్పయిపోయింది స్వామీ! మళ్ళీ ఎప్పటి మల్లే మీరు చారు పోయించుకుంటేనేగాని
మా మనస్సుకు ఆరాటం ఆగదు. దయ చేయండి" అన్నాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"ఎందుకు అంత చారు? నాకు అక్కర్లేదు. అన్నంలో పోస్తే చాలు" అన్నారు.
అంతకన్న వారితో తర్కించడం మాకు భయం.
"సరే, తమ దయ" అన్నాను.
"దయకేం, చారు తాగితే దయ ఉన్నట్లూ, లేకపోతే లేనట్టూనా? చారు తాగితేనే దయా?" అన్నారు.
ఆనాటి నుంచీ తాను చారు చేతిలో పోయించుకోనే లేదు. తనకి ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం ఆయనకి ఏ మాత్రమూ గిట్టదు. అందరూ ఏకమేననీ, అందర్నీ తనవలెనే మేము చూడాలనీ, సమత్వం మాలోకి తీసుకురావాలనీ ఆయన మాకు ఎన్నేళ్ళు ఎంత శిక్షణ నిచ్చారో! ఆ శిక్షణ మా మనసులకి లోతునా దిగి, మేము మరవకుండేందుకు ఆ చిన్న ఏర్పాట్లని గూడా తాము మానుకొనేవారు.
📖
*కామెర్లు*
ఓసారి వారికి కామెర్లు వచ్చాయి. పళ్ళు తప్ప ఏమీ తినకూడదు. తెచ్చిన కాసిని పళ్ళూ అందరికీ పంచి పెడితేనేగాని ఆయన తినరు. ఎన్ని పళ్ళు తేగలరు? కాని, ఆయన మానుకొంటారుగానీ, అందరికీ పంచనిదే తినరు. అప్పుడు ఆశ్రమం పెరగలేదు. అన్నీ తెచ్చి పెట్టేందుకు ధనికులు లేరు. అప్పటికీ మా శక్తికి మించేటట్లు పరిస్థితులు కల్పించి తప్పు పట్టేవారు. భోజనాల చివర, పళ్ళు పంచడం అయిపోయిన తరువాత, ఒకాయన వచ్చి భోజనం చేశారు.
ఆయన్ని "నీకు పళ్లు ఇచ్చారా?" అని అడుగుతున్నారు భగవాన్!
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఏ మందులకీ కామెర్లు తగ్గలేదు. తిరుక్కోయిలూరు నుంచి ఒక ముసలాయన రెండు నిమ్మకాయలు పట్టుకొని వచ్చారు భగవాన్ దగ్గరికి.
"మీకు నిమ్మపళ్ళ రసంతో తేనెగాని, చక్కెరగాని వేసి ఇమ్మని నాకు కల వచ్చింది" అన్నారు ఆయన. "సరే ఇమ్మన్నారు” భగవాన్. నిమ్మపళ్ళ రసంతో చక్కెర కలిపి ఇచ్చారు. దాంతో కామెర్లు నయమైనాయి.
📖
*ఉంగరం చేయించాను*
ఒక మధ్యాహ్నం భగవాన్ పప్పు రుబ్బుతున్నారు. వారు శ్రమపడి ఏమన్నా చేస్తోవుంటే చూడలేం. ఆపనిని మేం తీసుకున్నామా - వారికి కోపం వస్తుంది. ఇంక వంటింట్లోకే రావడం మానేస్తారు. రాకపోయినారా- మా సంతోషమంతా చచ్చిపోతుంది. హాలులో భగవాన్ అందరివారు. వంటింట్లో... ప్రత్యేకం మా సొంత భగవాన్! శ్రీవారు తెల్లారకట్ట మూడింటికే లేచి కూరలు తరుగుతున్నారని, కుంజుస్వామి, తక్కినవారు రాత్రే కూరలు తరిగితే, ఇంక కూరలవైపు రావడమే మానారు భగవాన్.
ఆ మధ్యాహ్నం భయపడుతూ వెళ్ళాను. “నీకోసమే చూస్తున్నాను. పప్పు రుబ్బుతావా? ఇంద" అని చప్పున నా కిచ్చి లేచి వెళ్ళారు. పప్పు పూర్తిగా రుబ్బి, పిండి లోపలకి తీసుకుని వెళ్ళాను. స్వామి పొయ్యి దగ్గర కూచుని గుమ్మడికాయ కుతకుత వుడుకుతూవుంటే కలియపెడు తున్నారు. ఆవిర్లు పొయ్యి వేడి, వారి ఒళ్ళంతా చమటలు. "దీనికా, నాకు అంత సులభంగా పప్పు రుబ్బేపని అప్పజెప్పారు?' అనుకున్నాను. ఆయన పడుతున్న శ్రమ చూస్తే నిలవలేకపోయినాను. ఆ కూర ముక్కలు చింది, కాలివేలు బొబ్బ ఎక్కింది. కాని, అడ్డం వెళ్ళే ధైర్యం మాకు లేదు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మర్నాడు లోకమ్మ వచ్చి చూసి "స్వామీ, మీ వేలు మీద అదేమిటీ?" అన్నది. దానికి స్వామి, "నీకు తెలియదా. నేను ఉంగరం చేయించుకున్నాను!" అన్నారు. గోచీ తప్ప ఏమీలేని ఆ యోగికి ఉంగరమట!!
📖
*కాఫీ అలవాటులేదు*
భగవాన్ కి కాఫీ తాగడం ఇష్టం వుండేది కాదు. కాని ఆయన చుట్టూ వుండే భక్తులకి కాఫీ యిష్టం. పైగా ఎవరో వొకరు తెచ్చి యిచ్చేవారు కాఫీకి కావలసిన సామగ్రి. ఆయన తాగకపోతే తక్కిన వారికి తాగడం కష్టంగా వుండేది. తక్కినవారికోసం, భగవాన్ - నాలుగు రోజులు కాఫీ తాగేదీ, ఏదో వంకతో పదిరోజులు మానేదీ; మళ్ళీ అందరు బలవంతం చేస్తే నాలుగు రోజులు తాగేదీ- ఇట్లాగే గడిచేది. అట్లాగే ఒకసారి పట్టుపట్టి చాలా కాలం కాఫీ తాగడం మానేశారు.
ఓ రోజు అప్పుశాస్త్రిగారి భార్య వూళ్ళోంచి, కాఫీ చేసుకుని, ప్లాస్కులో పోసి తీసుకొచ్చింది. భగవాన్ని కాఫీ తాగమని అడిగింది. “నేను కాఫీ తాగడంలేదే- మానివేశాను. నేను తాగను" అన్నారు భగవాన్.
దానికి ఆమె "నేను మాత్రం ఏం చెయ్యను? నిన్న రాత్రి కలలో నాకు దేవాలయం పక్కన ఒక ముత్తయిదువు కనపడ్డది, ఆమె పార్వతి. ఆమె నాతో “నా బిడ్డ కాఫీ తాగడం లేదు. నువ్వయినా కొంచెం కాఫీ కాచి యివ్వకూడదా?" అని అడిగింది. అందుకని తీసుకుని వచ్చాను. మీరు తాగక తప్పదు" అంది.
దానికి భగవాన్ కొంత విసుగుతో "ఆమె మునుపు కొండ మీదా యిట్లాగే కలలో చెప్పింది. అట్లా చెప్పి నా నియమాలు తీసేస్తూ వుంటుంది" అని కాఫీ తాగారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment