అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-190.
17d3;3010e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣9️⃣0️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️```
(సరళమైన తెలుగులో)```
*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*13. వ శ్లోకము:*
*త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।*
*మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ॥13॥*
“సత్వరజస్తమోగుణముల యొక్క భావములతో ఈ ప్రపంచం అంతా మోహములో చిక్కుకుపోయి ఉంది. ఈ మూడు గుణముల యొక్క భావముల ప్రభావములో పడ్డ మానవులు మూడు గుణములకు అతీతుడనైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు.
```
ఈ అనంత విశ్వం ఈ విశ్వంలో భాగమైన ఈ భూమి, ఈ ప్రకృతి, ఆ ప్రకృతిలో నుండి పుట్టిన మానవులు అంతా ఈశ్వరమయమైనపుడు, ఈ మానవులకు రకరకాల బాధలు, సుఖదుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి. ఈశ్వరుడు ఆనందస్వరూపుడు అయినపుడు అందరూ సుఖంగానే ఉండాలికదా! మరి చాలా మంది దీనంగా, ఏడుస్తూ, కష్టాలు అనుభవిస్తూ, దుఃఖిస్తూ ఎందుకు కాలం గడుపుతున్నారు. దీనికి కారణం ఏమి? అని ప్రతి వాడిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానమే ఈ శ్లోకము.
వానాకాలం ఆకాశం అంతా మబ్బు పట్టి ఉంది. ముసురు, సూర్యుడు కనపడటం లేదు. అంటే సూర్యుడు లేడా! ఉన్నాడు. కానీ మబ్బులు కప్పినందువలన మనకు కనిపించడం లేదు. అలాగే మనందరిలో ఈ మూడు గుణములు కప్పిన అంతఃకరణ ఉంది. ఈ గుణముల ప్రభావంలో పడిపోయిన మనకు భగవంతుడు కనిపించడు. మబ్బులు విడిపోతే సూర్యుడు కనిపించినట్టు, మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉంటే భగవానుడు స్పష్టంగా కనిపిస్తాడు. ఆ మేఘాలు తొలిగి పోవాలంటే మామూలు గాలి పనికిరాదు. జంఝామారుతం కావాలి. అప్పుడు మనలను ఆవరించిన మాయామేఘాలు చెల్లాచెదరు అయి పోతాయి.
కాబట్టి ప్రతివాడూ తన గురించి తాను తెలుసుకోవాలి. తాను ఎవరు? ఈ మాయ ఏంటి? ఈ మూడు గుణాలు ఏంటి? ఈ మూడు గుణాలకు తను ఎందుకు, ఎలా లోబడి పోతున్నాడు? వీటి నుండి ఎలా విడివడాలి? ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించాలి. అంతే కానీ తాను జైల్లో ఉన్న సంగతే తెలియని వాడు బైలు కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాడు. మనకు కూడా మనలను ఈ మూడుగుణములు అనే మాయ ఆవరించి ఉన్నట్టు తెలియదు. అంతగా వాటిలో కూరుకుపోయాము. అందుకని ఈ బంధిఖానాలో పడికొట్టుకుంటున్నాము. వీళ్లంతా అవివేకులు ఏమీ తెలియని వాళ్లు అని అనుకోకండి, ధనవంతులు, చదువుకున్న వాళ్లు, బలవంతులు, అందగాళ్లు, అందరూ ఉన్నారు. ఎవరి గుణం వారిది.
కాబట్టి ఈ బంధనముల లో నుండి బయటకు రావడానికి ప్రతివారూ ప్రయత్నం చేయాలి. తెర తీస్తేగాని పెళ్లి కూతురు కనపడదు. అలాగే ఈ మూడు గుణములు అనే తెర తీస్తేగానీ, భగవానుడు కనపడడు. దీనికి కావాల్సింది భక్తి, శ్రద్ధ, వైరాగ్యము, నిష్కామకర్మ, సమత్వము, పరోపకారము, ధ్యానము మొదలగునవి. కాబట్టి నాకు భగవంతుడు ఎందుకు కనపడటం లేదు అనే వాళ్ల ప్రశ్నకు ఇదే సమాధానము. ముందు తనలో ఉన్న మూడుగుణముల యొక్క ప్రభావము అనే తెర తొలగించుకోవాలి. ఈ మోహంలో పడి ఉన్నంత వరకు ఆ తెర తొలగదు. దీనికి ఎవరికి వారు ప్రయత్నించాలి. భగవంతుని చూడటానికి ఇదే మార్గము.
ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పరమాత్మ తాను రెండు విధాలుగా ప్రకటింపబడుతున్నాడు. ఒకటి పరా ప్రకృతి. రెండవది అపరా ప్రకృతి. పరా ప్రకృతి మామూలు కంటికి కనపడదు. ఎందుకంటే అది నిరాకారము,నిర్గుణము, నిర్వికల్పము. ఇంక అపరా ప్రకృతి మన ఎదుట కనపడుతూ ఉంటుంది. ఇది మూడు గుణముల సమ్మేళనము. మన కంటికి కనపడుతూ ఉంటుంది. ఈ అపరా ప్రకృతినే సంసారము అని కూడా అంటారు. తెలియని దాన్నిపట్టుకోడం కంటే తెలిసిన దాన్ని పట్టుకోడం సులభం కదా! కనపడని దాని గురించి ఆలోచించేకంటే, కనపడే దానిని అనుభవించడం మంచిది కదా! ఇలా ఆలోచించి, అందరూ అపరా ప్రకృతిలో మునిగిపోతుంటారు. సంసారంలో మునిగి తేలుతుంటారు. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, ధనవంతుడు, పేదవాడు అనే ద్వంద్వాలకు లోనవుతున్నారు. ఎందుకంటే ఈ అపరా ప్రకృతి మానవులను తన మోహంలో, ఆకర్షణలో పడేస్తుంది. ఆ మోహంలో నుండి ఆకర్షణలో నుండి బయట పడటం చాలా కష్టం.
ఈ విషయం అర్ధం కావడానికి మనకు ఒక కథ ఉంది. అదే మోహీని అవతారము. అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగరమధనం చేసారు. అమృతం వచ్చింది. దానవులు దానిని తన్నుకుపోయారు. దేవతలు విష్ణువును శరణు వేడారు. విష్ణువు మోహినీ అవతారంలో దానవులను తన ఆకర్షణలో, మోహములో పడవేసి ఆ అమృత కలశమును దానవుల వద్ద నుండి లాక్కున్నాడు. అమృతాన్ని దేవతలకు దానవులకు సమానంగా పంచుతానని అంతా దేవతలకే ఇచ్చాడు. ఈ కథలో మనకు తెలిసిందేమిటి. దానవులు మోహిని ఆకర్షణలో, మోహంలో పడి మోహిని నిజంగా అందమైన స్త్రీ అనుకున్నారు. కాని దేవతలకు ఆమె నిజస్వరూపము విష్ణువు అని తెలుసు. అందుకని వారు ఆమె మోహంలో పడలేదు.
అలాగే మానవులు కంటికి కనిపించే ఈ అపరా ప్రకృతి నిజము, సత్యము ఎల్లప్పుడు ఉండేది అని నమ్మి దాని మోహంలో, ఆకర్షణలో పడుతున్నారు. దానినే అజ్ఞానము అంటారు. కాని ఈ నిజం తెలిసిన వాళ్లు (జ్ఞానులు, దేవతలు), ఈ అపరా ప్రకృతి మిథ్య, అసత్యము, నిరంతరం మార్పుచెందుతుంది, అసలైనది, సత్యమైనది, మార్పులేనిది పరా ప్రకృతి అని తెలుసుకోగలుగుతారు. ఇలా తెలుసుకోవడమే జ్ఞానము. దానవులకు అమృతము అంటే పరమ సుఖము, అంతము లేని సుఖము దొరకలేదు. అదే దేవతలకు అమృతము దొరికింది. మనం కూడా ఈ అపరా ప్రకృతి మాయలో ఆకర్షణలో మోహంలో పడకుండా, పరా ప్రకృతి వైపుకు అంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి. అప్పుడే అనంతమైన సుఖం లభిస్తుంది.
మరి అపరా ప్రకృతి వైపుకు మానవులు ఎందుకు ఆకర్షితులు, మోహితులు అవుతారు. అంటే అది త్రిగుణాత్మకము అయినది కాబట్టి ఈ మూడు గుణములు మానవులను మోహంలో మాయలో పడవేస్తాయి. ఈ మూడు గుణములతో కూడిన మాయతో కప్పబడినదే ఈ జగత్తు. ఈ సంసారం యొక్క మోహంలో పడ్డ మానవుడు, నాశము లేనిది, గుణములకు అతీతమైనది, పరమమైనది, శాశ్వతమైనది అయిన పరా ప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నాడు. కనీసం ప్రయత్నం కూడా చేయలేక పోతున్నాడు.
మనం ఎటూ జీవిత కాలం అంతా అపరా ప్రకృతిలో అంటే సంసారంలో మునిగి పోయి, ధనం, భార్య, పిల్లలు, ఆస్తులు పదవులు, కోరికలు, అవి తీరడానికి పూజలు, వ్రతాలు, ఆ కోరికలు తీరకపోతే అసంతృప్తి, అశాంతి, కోపము, దుఃఖము, నిర్వేదము ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ... ఉన్న ఆస్తిని, ధనాన్ని కాపాడుకోవడం, లేని దాని కోసం ప్రాకులాడటం... వీటితోనే జీవితంలో సగ భాగం గడిపేసాము కాబట్టి, ఇంకమీదటనైనా నాకు తెలియని, నేను ఆలోచించని, నా ఆలోచనలకు అందని, నాకు లభించని పరా ప్రకృతిని గురించిన జ్ఞానమును నాకు అనుగ్రహించు. ఆ మార్గంలో నన్ను నడిపించు నాకు పరమశాంతిని, పరమ సుఖాన్ని, ప్రసాదించు. అపరాప్రకృతిని ఆశ్రయించిన నాకు ఏ పరమ సుఖం శాంతి దొరకలేదో, దానిని నాకు కలుగజేయ్యి అని భగవంతుని కోరుకోవడమే మన కర్తవ్యము.
అలా కోరుకుంటే ఏమవుతుంది. మనకేం లాభం అని అనుకుంటే దానికి సమాధానం వెంటనే లభిస్తుంది. మనము అపరాప్రకృతి వైపుకు నిరంతరం ఆకర్షింప బడుతున్నాము. అపరా ప్రకృతిలోని విషయాలను అనుభవించడానికి నానా తంటాలు పడుతున్నాము. కాని అలా అనుభవిస్తే బంధనాలు కలుగుతాయని భయపడుతున్నాము. దీనికి ఒకటే మార్గము. హరిద్వార్ గంగానదీ వేగము ఎక్కువగా ఉంటుంది. తెలియకుండా దిగితే నేరుగా మోక్షమే. అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి, గొలుసులు వేలాడదీస్తారు. మనం ఆ గొలుసును పట్టుకొని ఎంత సేపైనా గంగానదిలో స్నానం చేయవచ్చు. ఏమీకాదు. అలాగే మనం, దైనందిన జీవితంలో ఏ పని చేస్తున్నా అంటే ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వృత్తి విద్య ఏ పని చేస్తున్నాసరే, మన మనసును, అంతఃకరణను మాత్రం పరమాత్మ అనే గొలుసుతో లగ్నం చేసి అంటే పట్టుకొని, ఈ అపరా ప్రకృతిలో మనం ఇష్టం వచ్చినట్టు విహరించవచ్చు. పరమాత్మ అనే గొలుసు మాత్రం వదలకూడదు. వదిలితే ఈ అపరాప్రకృతి మోహంలో పడి కొట్టుకుపోతాము అనే విషయం గ్రహించాలి.
అందుకే పరమాత్మ యందు ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ నమ్మకం కలిగి ఉండాలి. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. ఫలితం ఆ పరమాత్మదే అనే భావన కలిగి ఉండాలి. అప్పుడు మనం ఈ అపరాప్రకృతిలో ఎంతసేపు విహరించినా, ఆ కర్మబంధనములు మనకు అంటవు. నిశ్చింతగా ఉంటాము. పరమానందాన్ని పొందుతాము. మరి ఆ పరమాత్మను పొందే స్థితి ఎలా లభిస్తుందో తరువాతి శ్లోకంలో తెలియజేస్తున్నాడు కృష్ణుడు…✍️(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
No comments:
Post a Comment