Monday, November 3, 2025

 *నలభైలు*

*ఇప్పటివరకూ ఏ మానసిక రోగం రాకపోతే ఇక దాదాపు రావు.*

*ఇప్పటి వరకూ ఏ వ్యసనం అబ్బకపోతే ఇక దాదాపు అబ్బవు.*

*ఇప్పటి వరకూ పెళ్లి కాకపోతే ఇక, ఇది చెప్పను.*

*ఇప్పటి వరకూ జుట్టుంటే ఇక తెల్ల వెంట్రుకలు పీకెయ్యడం ఆపొచ్చు.*

*షుగరు, బీపీలు రాడానికి ఇంకా సమయం ఉంది.*

*ఈపాటికి మీ భర్తకో, భార్యకో ఏది నచ్చుద్దో, ఏది నచ్చదో బాగా అవగాహన వచ్చేస్తుంది. ఈలోపు విడాకులు కాకపోతే ఇక కాటివరకూ వాళ్ళతోనే.*

*పిల్లలు వాళ్ల సంచులు వాళ్ళు సర్దుకుని బడికి, కాలేజీకి పోతుంటారు, నీకు ఫీజు కట్టడం తప్ప పెద్ద పనిలేదు.*

*మీ అమ్మానాన్నలు ఉంటే ప్రతిరోజూ పలకరించవచ్చు, లేదంటే ఏడాదికి ఒకసారి తద్దినం చెయ్యవచ్చు.*

*ఈపాటికి ఏదో ఇల్లో పొల్లో, అప్పులోనో, ఆస్తిగానో ఉంటుంది. దానికి ఇక వాయిదాలు అలవాటవుతాయి, భారం అనిపించదు.*

*కొత్త స్నేహాలు, పరిచయాలు, ఇక అక్కడ్నుంచి అక్రమ సంబంధాలు అవ్వడం తగ్గుముఖం పడతాయి.* 

*ఇక ప్రెగ్నెన్సీ వస్తుందని, పెర్ఫార్మన్స్ చెయ్యాలన్న గాభరా లేకుండా సుఖంగా సంసారం చేసుకోవచ్చు.*

*అసూయ, ఈర్ష్య మొదలైనవన్నీ ముసుగేసి పడుకుంటాయి. అలాగే ఉత్తేజం, ఉత్సుకత కూడా. మహా అయితే చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్న చిన్న సంగీతమో, సంకలనమో నేర్చుకుంటావు.*

*ఇప్పటివరకూ జీవితంలో చేస్తున్నదానిపట్ల ఒక అవగాహన వచ్చి, అది నచ్చినా నచ్చకపోయినా అదొక బలం అని విశ్వసించి ఇక వచ్చే పదేళ్లు దానిని సానపెట్టడం కర్తవ్యంగా పెట్టుకుంటావు.*

*ఈలోగా నీతోటివాళ్లకి  పాపం ఆరోగ్యం బాగాలేకో, వ్యాపారంలో నష్టం వచ్చో, సంసారంలో చిక్కులు వచ్చో ఇలా ఏదో ఒకటి జరిగి,  హమ్మయ్య భగవంతుడు నాకు ఆ కష్టాన్ని ఇవ్వలేదు అని కృతజ్ఞత చూపిస్తావు.*

*ఎవరికి ఓటెయ్యాలి, ఏ రాజకీయ నాయకుడు ఎలాంటివాడు, ఏ చుట్టం ఎలాంటివాడు, ఎవడు ఆప్తుడు, ఎవడు స్నేహితుడు, ఎవడు శత్రువు అన్న స్పష్టత తన్నుకుని వచ్చేస్తుంది.*

*నీకంటే వెనక పుట్టినవాళ్ళు నీకంటే ఎక్కువ సతమతం అవడం చూసి ఊపిరి పీల్చుకుంటావు.*

*నీ తోబుట్టువులు వాళ్ల బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఇంకా ప్రతీసారి నీ సాయం వాళ్ళు పొందుతుంటే వాళ్ళకి ఇక బాగుపడే లక్షణం లేదని లేదా నీకు లోకజ్ఞానం తెలీదని.*

*అప్పులివ్వడానికి నీ దగ్గర డబ్బులుండవు. తీసుకోడానికి తీరుస్తామన్న ధైర్యం ఉండదు.* 

*ఇకనుంచీ నీవంటూ ఏ గమ్యాలు ఉండవు. అవి నీ భాగస్వామితోనో లేక నీ కుటుంబంతోనో ఉంటాయి. విజయం అయినా, వైఫల్యం అయినా సమిష్టి బాధ్యత అది.*

*డాక్టర్లకి ఇవ్వడానికి నెలకి ఇంత అని కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లులా పెట్టుకోవాలి. అది ఖర్చు అనుకోకూడదు. దానం అనుకోవాలి. దానివలన పుణ్యం వస్తుంది.*

No comments:

Post a Comment