దివ్య సంపద
*సంపదలన్నీ సుఖ సౌఖ్య సంతోషాలకేనన్న బలమైన అపోహ ప్రజల్లో ఉంది.*
*ప్రాపంచిక సంపదలన్నీ చేతులు మారుతున్నవే తప్ప స్వయంసృష్టిగా చెప్పదగ్గవి తక్కువ. వంశానుగతంగా సంక్రమించే పూర్వీకుల ఆస్తులన్నీ ఇలా లభిస్తున్నవే.*
*అర్థశాస్త్ర గ్రంథకర్త* *చాణక్యుడు సంపదను కూడబెట్టడాన్ని వ్యతిరేకించాడు. ఏ రోజు* *ఆదాయం ఆ రోజుకు సరిపోతే చాలన్నాడు. అప్పుడు మనిషి స్వార్థమనే బోనులో బందీ కాడు.*
*రాజ్య నిర్వహణ కోసం పాలకుడు పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలని ‘శుక్రనీతి’ చెబుతుంది. కష్టార్జితమే న్యాయార్జితమని విదురనీతి శాస్త్రం బోధిస్తుంది.*
*ప్రపంచంలో అన్యాయార్జన కోసం ఆరాటపడేవాళ్లే* *ఎక్కువగా కనిపిస్తారు.* *మాయాద్యూతంలో పాండవుల సంపదను దోచుకున్న దుర్యోధనుడు, సూది మోపిన స్థలాన్ని కూడా తిరిగి ఇవ్వనన్నాడు. అలా ఉంటుంది* *సంపద మీద వ్యామోహం. కానీ, వ్యామోహాల పర్యవసానాలన్నీ దుఃఖాంతంగానే ఉంటాయి.* *దుఃఖం తప్పదని తెలిసినా వ్యామోహాన్ని వదులుకోరు. ధృతరాష్ట్రుడి విపరీత పుత్రవ్యామోహం లోకప్రసిద్ధం.*
*మహాకవి భారవి తండ్రి తన* *పుత్రప్రేమను గుప్తంగా* *ఉంచుకుని, అందుకు కారణం* *కుమారుడి క్షేమమేనని చెప్పడం గుర్తుంచుకోదగిన* *చారిత్రకాంశం. సంతానం సాధించిన విజయాలను తండ్రి అభినందించి ప్రోత్సహించాలి.*
*అతిగా పొగడకూడదు.*
*సంపద అంటే కేవలం ధనధాన్య వస్తువాహనాలు కావు. సరస్వతీ ప్రసాదాలుగా చెప్పుకొనే కళా సాహిత్య స్వరూపాలు కూడా. అక్షర సంపదలన్నీ అక్షయమే.* *కోటీశ్వరులు, మహారాజులు కూడా కవులకు, కళాకారులకు చేతులు జోడించక తప్పదు. లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతీ కటాక్షమే గొప్పదని రుజువైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.*
*శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని వారికి గండపెండేరం తొడిగినా, తన శ్రోత్రియత్వాన్ని పక్కనపెట్టి* *విశ్వనాథవారు కవికోకిల జాషువాను గండపెండేరంతో సత్కరించినా- అందుకు వారి అక్షర సంపదే కారణం.*
*తరతరాల సంపద ఆర్జించి వారసులకివ్వడంతో తమ కర్తవ్యం*
*ముగిసిపోయిందనుకునేవారే ఎక్కువ. వారసులకు సంస్కారం, సంప్రదాయాలను కూడా ఇవ్వకపోతే, కొండంత సంపదైనా కళ్లముందే కరిగిపోతుంది. ఉత్తమ గుణాలు కలిగి ఉన్నవారికి ప్రాపంచిక సంపదల పట్ల ఆసక్తి ఉండదు. వారు అంతర్ముఖులై అంతర్యామిని ఆరాధించడంలో నిమగ్నులై ఉంటారు. దేహాన్ని కేవలం జీవన వాహనంగా భావిస్తారు. ఆత్మభావనతో జీవిస్తారు.*
*చూసేవారికి వారు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారనిపిస్తుంది. కానీ వారు జీవితానికి అర్థం చేకూర్చుకుంటున్నారని తెలియదు.*
*వాల్మీకి పుట్టలో కూచుని కాలం వ్యర్థం చేశాడా? శ్రీరమణులు,* *అరవిందులు, శ్రీరామకృష్ణులు ఏమీ సాధించలేదా? వారంతా దివ్య సంపదలు ఆర్జించారు.* *వాటిని ఆశ్రితులకు, జిజ్ఞాసువులకు ఉదారంగా పంచిపెట్టారు.*
*భారతదేశం దివ్యమైన ఆధ్యాత్మిక సంపదలకు నెలవు. ఎందరో మహానుభావులు తరతరాలకు సరిపడా దివ్య సంపదను వారసత్వంగా ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తించని వారంతా ప్రాపంచిక సంపదలకు*
*ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని తరాలకు సరిపడా కూడబెట్టి వారసులకు ఇచ్చామని ఘనంగా భావిస్తున్నారు. కానీ, దివ్య సంపదను కోల్పోయామన్న గ్రహింపు లేకపోవడం ఒక జీవితకాలపు నష్టం.*
No comments:
Post a Comment