*"పంచక్రోసి కాశీయాత్ర -
ధ్యానం చేసుకునే వారందరికీ, యోగం గురించి తెలుసుకునే మార్గం ఈ పంచకోశ తత్వాన్ని తెలుసుకోవడం. *'కోశము' అంటే అర అని అర్ధం. మానవుని జీవనంలో ఐదు అరలు కలిగిన తత్వాన్ని తెలుసుకోవడమే ధ్యానం... అదే కాశీ యాత్రలోని పంచక్రోసి కాశీ యాత్రగా అభివర్ణిస్తారు.*
*మనలో ఉండే ఐదు అరల పేర్లు:-*
1. అన్నమయ కోశము
2. ప్రాణమయ కోశము
3. మనోమయ కోశము
4. విజ్ఞానమయ కోశము
5. ఆనందమయ కోశము... అని ఐదురకాలుగా ఉంటుంది. ఇదేవిధంగా కాశీలోని ఐదు మహా శివలింగాలు పంచకోశములుగా ఉండి అవి మనలోని పంచకోశములతో అనుసంధానించుకుంటూ ఈ యాత్ర ఐదురోజుల పాటు చేస్తాము. ఇది ఇప్పుడు మొదలైనది కాదు. యుగయుగాలుగా ఎంతో మంది, ఎన్నో అనుభవాలతో చేసిన యాత్ర.
*త్రేతాయుగంలో రాముడు* అరణ్యవాసం సమయంలో, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి, దశరథుడు చనిపోయిన తరువాత ఈ యాత్ర చేసాడు. రెండవసారి రావణాసురుడు చనిపోయాక మరొకసారి ఈ యాత్ర చేసినట్లు అక్కడి సత్రములో కలిసిన వారు, అర్చకులు కూడా చెబుతుంటారు. అలాగే *ద్వాపరంలో ద్రౌపదితో కలిసి పంచపాండవులు* ఈ యాత్ర చేసుకున్నారని, ద్రౌపదీకుండ్ గా గంగానదికి అక్కడ ఆ పేరుతో ఉంటుంది. ఈ యాత్రను ఫాల్గుణ మాసంలో, చైత్రమాసంలో, అధికామాసాల్లో, అమావాస్యకు, శివరాత్రి రోజు, కుంభమేళాకు, అర్ధకుంభమేళాకు భక్తులు అత్యథిక సంఖ్యలో ఈ యాత్ర చేస్తారు.
*ఈ యాత్రలో మనకు మొత్తం 11 వినాయకుడి విగ్రహాలు, 108 శివలింగాలు, 56 దేవాలయాలు, 4 విష్ణువు ఆలయాలు, 2 భైరవాలయాలు, 15 ఇతరములైన దైవాల ఆలయాలు కనిపిస్తాయి.* ఇవి కాకుండా, కర్థమేశ్వర్ (అన్నమయ), భీంచండీ మందిర్ (ప్రాణమయ), రామేశ్వర్ (మనోమయ), శివపురి మందిర్ (విజ్ఞానమయ), గంగావినాయకుడి గుడి (ఆనందమయ) మొదలైన గుడులన్నీ చూడవచ్చును.
మొత్తం ఈ యాత్ర *5 నిద్రలతో 6 పగళ్ళు చేసే యాత్ర.*
మొదట విశ్వనాథ ఆలయంలోని జ్ఞానవాపి దగ్గర సంకల్పం చెప్పుకుని, పంచకోశ వినాయకుడిని దర్శించుకుని,
*"పంచక్రోశాత్మకాయ, మహాలింగాయా! జ్యోతిర్లింగ స్వరూపాయ, కాశీవిశ్వేశ్వరాయ, శ్రీ శివాయనమః"* అంటూ, ఆయన అనుమతితో ఈ పంచకోశ యాత్ర మొదలు పెట్టాలి. విశ్వనాథ, అన్నపూర్ణమ్మా ఇతర ఉపాలయాలలోని దేవతలందరి అనుమతితో పాటు, మిగిలిన ఉపాలయాల్లో యాత్ర నిర్విఘ్నంగా సాగాలని అనుమతి తీసుకుంటూ అందరిని ప్రార్థించుకుని యాత్ర మొదలు పెట్టాలి.
విశ్వనాథ దేవాలయం నుండి మణికర్ణికా ఘాట్ కొచ్చి, కుండంలో స్నానం చేసి, సంకల్పం చెప్పుకుని, కాళ్లకు చెప్పులు లేకుండా, కొంచెం సామాను, ఐదు రోజులకు సరిపడా బట్టలు, తినడానికి కొంచెం ఆహారం, నీళ్ళ బాటిల్, కొంచెం పూజా సామగ్రి తీసుకుని బయలుదేరాలి.
మణికర్ణికలో వినాయకుడిని, మణికర్ణికేశ్వరుడిని, మిగిలిన ఉపాలయాల్లోనూ మొక్కుకుని యాత్ర మొదలు పెట్టాలి. ఎటునుంచి ఎక్కడివరకు తిరగాలో ఎవరినడిగినా చెబుతారు. మొత్తం ఐదు చోట్ల ఆగాలి.
*1. ఒకటవ మజిలీ (అన్నమయ కోశం):* మొదటి మజిలీ చౌరాశీ ఘాట్లో ఉన్న ధర్మశాలలో ఆగుతాము. అక్కడ కర్ధమేశ్వరాలయంలో ధూళీపాద దర్శనం అయ్యాక, బిందుసరోవర్ ఘాట్ లోని కర్థమేశ్వర్ కుండ్ లో స్నానం చేసి దర్శనం చేసుకుని ఆరాత్రి విశ్రాంతి తీసుకుని, ఉదయం మళ్లీ అదే కుండంలో స్నానం చేసి, జపం చేసుకుని తిరిగి యాత్ర కొనసాగించాలి.
*2.రెండవ మజిలీ (ప్రాణమయ కోశం) :* రెండవరోజు రాత్రి గంధర్వసాగర్ ఘాట్లోని ధర్మశాలలో విశ్రాంతి తీసుకుని, రెండవరోజు ఉదయం గంధర్వ సాగర్లో స్నానం చేసి, అక్కడి 'భీంచండీ' ఆలయంలో వినాయకుడు, చండీశ్వరుడు, మిగిలిన ఉపాలయాల్లోనూ దర్శనం, జపము చేసుకుని యాత్ర కొనసాగించాలి.
*3.మూడవరోజు మజిలీ (మనోమయ కోశం) :* వరుణానదీ సమీపంలో ఉన్న ధర్మ సత్రాల్లో బసచేసి విశ్రాంతి తీసుకుని, వరుణానదిలో స్నానంచేసి రామలింగేశ్వరుని దర్శనం చేసుకుని జపం చేసుకుని, ఉపాలయాల్లో దర్శించుకుని తిరిగి యాత్ర మొదలుపెట్టాలి.
*4.నాలుగవరోజు మజిలీ (విజ్ఞానమయ కోశం) :* ఈ రోజు యాత్ర మొత్తం ద్వాపరాయుగానికి సంబంధించిన విశేషాలు ఎక్కువగా తెలుస్తాయి. పాండవులు ద్రౌపదితో కలిసి చేసిన అరణ్యవాసం సమయంలో ఇక్కడికి వచ్చి, ఈ పంచక్రోశ యాత్ర చేసినట్లు అక్కడి విగ్రహాల ద్వారా, చుట్టుప్రక్కల మనతో పాటు యాత్ర చేస్తున్న అనేకమంది చెప్పే కథల వలన తెలుసుకోవచ్చు. ఉత్తర భారతీయ గ్రామస్థులు ఎక్కువగా ఈ యాత్ర చేస్తూ కనిపిస్తారు. కోందరు నాలా యాత్ర చేసేవారికి భోజనం (కిచిడీ) చేసి ఇస్తుంటారు. నాలుగవరోజు 'ద్రౌపదీకుండ్' లో స్నానం చేసి, 'శివపురిమందిర్' లోని వినాయకమందిర్ నుండి అన్ని దేవలయాల్లోనూ దర్శనం చేసుకుని, జపం చేసుకుని తిరిగి యాత్ర ప్రారంభించాలి.
*5.ఐదవరోజు మజిలీ (ఆనందమయ కోశం) :*
'కపిల్దారా' లోనీ గంగావినాయకుడి గుడితో మన యాత్ర ముగుస్తుంది. ఇక్కడికి దగ్గరలోని ధర్మశాలలో విశ్రాంతి తీసుకుని, ఉదయం కపిలధారాలో స్నానం చేసి, వినాయక దర్శనం జపం చేసుకుని విశ్వనాథ దర్శనానికి బయలుదేరి విశ్వనాథ ఆలయంలో ధూళిపాద దర్శనం చేసుకుని, మన నివాసానికి వచ్చి రెండురోజులు విశ్రాంతి తీసుకుని అలౌకికమైన ఆ తాధ్యాత్మికతనుండి తిరిగి యధాస్థాన ప్రవేశయామి అనుకుంటూ మన మన భవసాగరాలకు తిరుగుప్రయాణం చేయాల్సిందే కదా!
ప్రతీ చోటా అమ్మవార్లకు జాకెట్టు ముక్క, పసుపు కుంకుమ, అయ్యవార్లకు దావళీలు సమర్పించవచ్చు. అవన్నీ పట్టుకుని తిరగలేము అనుకునే వారు శక్తి కొలది దక్షిణ సమర్పించుకోవచ్చు.
శారీరక అనారోగ్యాలున్నవారు చేయలేని యాత్ర ఇది.
ఆహారాన్ని రోజుకు ఒకసారి, అదికూడా సూర్యాస్తమయం తరువాత తీసుకునే నియమంతో చేస్తే యాత్ర సజావుగా సాగుతుంది. పండ్లు, డ్రై ఫ్రూట్స్, అప్పుడప్పుడు తాగడానికి ఏమైనా దొరుకుతుంటాయి. వాటితో సరిపెట్టుకుంటూ యాత్ర చెయ్యాలి.
ఈ యాత్ర మొత్తం. *మొత్తం సుమారు 100 కిలోమీటర్లు నడవాలి ఐదురోజుల్లో.*
ఒళ్లునొప్పులు, తలనొప్పి, జ్వరం కోసం మందులు తీసుకెళ్లాలి. లగేజీ చివరకు వచ్చేసరికి మోయలేము.
*హిందువులమై పుట్టిన ప్రతివారు ఒక్కసారి తప్పనిసరిగా చేయవలసిన యాత్ర ఇది..*🙏🙏
సిహెచ్ వి ఆర్ కె మూర్తి
ఈ యాత్ర నడుస్తూ చేయటం వయసు మీరిన వారికి సాథ్యం కాదు. కానీ, అలాంటివారు ఏదైనా వెహికిల్ లో వెళ్లి ఉదయం నుంచి రాత్రి లోపల ఈపంచకోశ యాత్ర సంపూర్ణం చేసుకోవడం సాథ్యం.
No comments:
Post a Comment