💐💐🖋️అభ్యుదయ రచయిత్రి,
విమర్శకురాలు,తెలుగు ఆచార్యులు శ్రీమతి "కేతవరపు కాత్యాయనీ విద్మహే"గారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో......🖋️💐💐
#తెలుగునాట స్త్రీవాద సాహిత్య విమర్శ అనగానే గుర్తుకు వచ్చే అతి కొద్ది విమర్శకుల్లో "కేతవరపు కాత్యాయని విద్మహే" ఒకరు. స్త్రీవాదమంటే విదేశాలనుండి దిగుమతి చేసుకున్న వాదంగానే ఇంకా అనేకమంది వ్యాఖ్యానిస్తుండగా, స్త్రీల జీవితాల్లోని ఆరాట, పోరాటాల చరిత్ర ఈనాటిది కాదు,సంప్రదాయ సాహిత్య కాలం నాటికే వుందని #సహేతుకంగా నిర్ధారించి, సాధికారికంగా చెప్పిన #విమర్శకురాలు విద్మహే. ప్రాచీన సాహిత్యం పవిత్రతని నెత్తిన పెట్టుకోడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారెయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టికోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.ఈవిధంగా చేయడం వల్ల అటు ప్రాచీన సాహిత్యానికి, ఇటు స్త్రీవాద విమర్శకు ఆమె సరైన న్యాయం చేయగలిగారు. కాత్యాయని లాంటి విమర్శకులు చేసిన ఇలాంటి కృషి వల్ల ‘దేశీయ స్త్రీవాదచైతన్యం’ మూలాలు తెలుకునే వీలు కలుగుతోంది.
కాత్యాయనీ విద్మహే ప్రముఖ సాహితీ విమర్శకురాలు. వివిధ సామాజిక, ప్రజాస్వామిక, హక్కుల ఉద్యమాలకు బాసటగా నిలిచారు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని ఆధునిక స్త్రీవాద కోణంలో పరిశీలించారు. తెలుగు సాహిత్య విమర్శలో మార్క్సిస్టు దృక్పథంతో కొత్త దారులు వేశారు. కాకతీయ విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో వివిధ హోదాల్లో పని చేసి రిటైరయ్యారు. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తెలంగాణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజల పక్షం నిలబడి గొంతెత్తేవాళ్లే ప్రజా రచయితలు అంటారు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే.
#బాల్యం-విద్య:
1955 నవంబర్ 3 న ప్రకాశం జిల్లా మైలవరం (అద్దంకి) గ్రామంలో కేతవరపు ఇందిరాదేవి, రామకోటిశాస్త్రి దంపతులకు జన్మించారు.కాత్యాయనీ పుట్టింది మైలవరంలోనైనా పెరిగింది.. విద్యాభ్యాసం అంతా వరంగల్‌లోనే. ఆమె మొగిలిచెర్ల (గీసుకొండ) గ్రామానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లును వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు.12 ఏళ్ల వయసు నుంచే సాహిత్యంపై ఆసక్తి కనబర్చారు. ప్రాథమిక విద్య వరంగల్‌లోని సుజాతరెడ్డి హైస్కూల్‌లో, ఇంటర్ పింగిళి కళాశాల, డిగ్రీ యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కళాశాల, ఎం.ఏ తెలుగు కేయూలో చదువుకున్నారు. ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా మిమర్శ’ అనే అంశంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు.
#ఉద్యోగ జీవితం:
కాకతీయ యూనివర్సిటీలో 1977లో అధ్యాపకురాలుగా ప్రవేశించి 1998 సంవత్సరంలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టారు.1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె మూడున్నర దశాబ్దాలుగా కాకతీయ వర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కాత్యాయని వద్ద 11మంది పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు.
#సాహిత్యం:
కాత్యాయని ఇప్పటి వరకూ 20 పుస్తకాలు రాశారు. వాటిల్లో సాహిత్యాకాశంలో సగం, స్త్రీల కవిత్వం, కథ, అస్తిత్వ చైతన్యం, తదితర పుస్తకాలు అవార్డు పొందడానికి కారణమయ్యాయి.
ఆమె లింగ వివక్షకు వ్యతిరేకిస్తూ రచనలు చేయడం వల్లే అందరినీ ఆకర్షించగలిగారు. కాత్యాయని ఇంకా మహిళా సాధికారత - సవాల్, ఆధునిక తెలుగు సాహిత్యం - స్త్రీల భూమిక, లింగ సమానత్వం దిశగా సమాజ సాహిత్యం, కన్యాశుల్కం - సామాజిక సంబంధాలు, జెండర్ స్పృహ తదితర పుస్తకాలు ఆమె రాశారు.
సొసైటీ ఫర్ ఉమెన్ స్టడీస్ అండ్ డెవలప్ మెంట్, ప్రజాస్వామ్య రచయితల వేదిక (మహిళా రచయిత సంఘం) ఏర్పాటు చేశారు.
"#సాహిత్యాకాశంలో సగం":
కేంద్ర సాహిత్య అకాడమీ గెలుచుకున్న కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’లో 28 వ్యాసాలు ఉన్నాయి. ఇది 2010లో వెలువడింది. ‘రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం’, ‘ప్రాచీన సాహిత్యం- మరోచూపు’ తదితర వ్యాసాలు ఉన్నాయి.ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి బండారు అచ్చమాంబ, తొలి అభ్యుదయ సాహిత్యో ద్యమ రచయిత్రి వట్టికొండ విశాలాక్షి, విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన రంగవల్లికి అంకితం చేశారు.
#ఒక రచనపై మన భావోద్వేగాలే ప్రామాణిక విమర్శగా దబాయింపు సత్యాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లోనూ తనని తాను ఆవల బెట్టుకుని లోచూపుకి సాధనాలు సమకూర్చుకున్నారు. కొ.కు, రావిశాస్త్రిల దృక్పథం గురించీ, కన్యాశుల్కం, రాబందులూ- రామచిలుకలు లాంటి మంచి పుస్తకాల గురించి, అస్తిత్వ సాహిత్యం, ప్రపంచీకరణల సంక్లిష్టతల గురించి విస్తృతాధ్యయనపు ఫలితాలను ప్రకటిస్తూనే ఉన్నారు.*
#స్త్రీ జనాభ్యుదయ #అధ్యయన సంస్థ:
1982లో రూపొందించకున్న స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ ద్వారానూ, జ్యోతీరాణి, శోభ, గిరిజారాణి, బుర్రారాములు వంటి వారితో కలిసి సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడం ద్వారానూ తన కార్యక్షేత్రాన్ని విస్తరింప చేసుకున్నారు. తాను నిత్య విద్యార్థిగా ఉండటం ద్వారా తన విద్యార్థులను ప్రభావితం చేశారు.
#ప‌్రజా రచయితలు:
ప‌్రజా రచయితలు ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవాలి. ప్రజా సమస్యలను పట్టించుకొని, వాటి గురించి రాసేవారే ప్రజా రచయితలు. సమస్యల పరిష్కారానికి ప్రజాపక్షంగా మాట్లాడేవారినే ప్రజా రచయితలుగా భావిస్తారని అంటారు.
#అవార్డులు:
*వట్టికొండ విశాలాక్షి అవార్డు
ఏటుకూరు బలరామమూర్తి అవార్డు.
*పులికంటి కృష్ణారెడ్డి అవార్డు.
*పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం.
*రంగవల్లి స్మారక విశిష్టమహిళా పురస్కారం.
*ఆంధ్రప్రభుత్వ సాంస్కృతికమండలి గురుజాడ స్మారక పురస్కారం
*2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం. (సాహిత్యాకాశంలో సగం పుస్తకానికి).
#రెండు దశాబ్దాల పైబడి తెలుగు సాహిత్య విమర్శలో కాత్యాయని చేస్తున్న కృషి ప్రముఖంగా చెప్పుకో దగ్గది.కేవలం సమీక్షాత్మకంగా కాకుండా, విశ్లేషణ చేయడం ఆమె విమర్శలో ప్రధానమైన లక్షణం.ఈ లక్షణమే ఆమెకు, ఆమె విమర్శకు ఒక విశిష్టత చేకూర్చగలిగింది.
🙏🙏💐💐💐🙏🙏
Collected by
Dt A.Srinivasa Reddy
9912731022
Zphs 75Tyalluru Pedakurapadu mandal, Palnadu district.
No comments:
Post a Comment