Wednesday, November 5, 2025

 🎻🌹🙏 అరుణాచల పంచరత్నం..!!


1.శ్లో :కరుణాపూర్ణ సుధాభ్ధే కబళిత ఘన విశ్వరూప కిరణావల్యా |
అరుణాచల పరమాత్మ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ ||

తా - దయచే నిండిన సముద్రమా ! కిరణ పంక్తిచే మ్రింగ బడిన గొప్ప ప్రపంచ రూపం గలవాడవైన అరుణాచల పరమాత్మా ! హృదయపద్మమును మిక్కిలి వికసింప చేయుటకై సూర్యుడవు అగుమా.


2.శ్లో : త్వయ్యరుణాచల సర్మమ్ భూత్వా స్థిత్వా , ప్రలీనమేతచ్చిత్రమ్ |
హృద్యహమిత్యాత్మతయా నృత్యసిభో స్తే వదన్తి హృదయం నామ ||

తా- అరుణాచలుడా ! నీ యందు ఈ చిత్రమంతా పుట్టి నిలిచి, లయం అగుచున్నది. ఆత్మస్వరూపుడవు అగుటచేత హృదయంలో " నేను " అని , ఓయీ ! నాట్యమాడుచున్నావు కదా ! అందుచేత నీకు " హృదయం " అనే పేరు కలిగింది అంటున్నారు.


3. శ్లో: అహమితి కుత ఆయాతీ త్యనిష్యాన్తః ప్రవిష్టయాత్యమలధియా |
అవగమ్య స్వం రూపం శామ్యత్యరుణాచల ! త్వయి నదీవాబ్ధౌ ||

తా- " ఆ ' నేను ' అనేది ఎక్కడనుండి వస్తున్నది ? అని లోపల ప్రవేశించిన నిర్మలమగు బుద్ధిచే వెతికీ , స్వీయ మగు అనగా తనది అగు రూపమును తెలుసుకొని ,
అరుణాచలుడా ! సముద్రంలోని నదివలె , నీ యందే చేరుతున్నారు .


4.శ్లో: త్యక్త్వా విషయం బాహ్యం రుద్ధప్రాణేన రుద్ధమనసాంతస్త్యామ్|
ధ్యాయన్ పశ్యతి యోగీ దీధితి మరుణాచలా త్వయి మహీయన్తే||

తా- ఓయీ అరుణాచలుడా ! బాహ్య విషయమును వదలి , నిరోధించిన ప్రాణంతోను , నిరోధింపబడిన మనస్సుతోను యోగి నిన్ను లోన ధ్యానించుటచేత నీలోని వెలుగును చూస్తున్నాడు. ఈ నీవెలుగు గొప్పది .


5.శ్లో : త్వయ్యర్పిత మనసా త్వాం పశ్యన్ సర్వం తవాకృతితయా సతతమ్|
భజతే ఽ నన్యప్రీతా స జయత్యరుణాచల ! త్వయి సుఖే మగ్నః||

తా- నీయందు అర్పించిన మనస్సుచే సర్వమును నీ ఆకారముగా ఎపుడూ చూస్తున్నవాడై ,అనన్యమగు భక్తిచేత నిన్ను ఎవడు ధ్యానిస్తున్నాడో ; ఓయీ అరుణాచలుడా ! వాడు సుఖ స్వరూపుడు అగు నీయందు మునిగినవాడై విజయం చెందుతున్నాడు .


శ్లో ! శ్రీమద్రమణ మహర్షే ర్దర్శన మరుణాచలస్య దేవగిరా|
పంచక మార్యాగీతౌ రత్నం త్విదమౌపనిషదం హి||

తా- శ్రీమత్ రమణ మహర్షిచే దేవభాషలో , ఆర్యాగీతి నందు రచింపబడిన ఈ ' అరుణాచల పంచకం 'ఉపనిషత్ రత్నం మరియు ఇది వారి దర్శనం !.

No comments:

Post a Comment