1️⃣0️⃣5️⃣
*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*4. జ్ఞాన యోగము.*
(నాలుగవ అధ్యాయము)
*19. యస్య సర్వే సమారమ్భాః కామసంకల్ప వర్జితాఃll*
*జ్ఞానాగ్ని దగ్ధకర్మాణాం తమాహుః పణ్డితం బుదాఃll*
ఎవరైతే కోరికలతో కూడిన సంకల్పములు లేకుండా ఆసక్తి లేకుండా, నిష్కామంగా, కర్తృత్వభావన లేకుండా కర్మలు చేస్తాడో, అటువంటి వారి యొక్క కర్మలు, ఆ కర్మల ఫలములు, కోరికలు జ్ఞానము అనే అగ్నిలో దగ్ధము అయిపోతాయి. అటువంటి సాధకుడు, పండితుడు అని పెద్దలు, విజ్ఞానవంతుల చేత చెప్పబడతాడు.
కిందటి శ్లోకంలో మనం పండితుడు వివేకి బుద్ధిమంతుడు గురించి ప్రస్తావించు కున్నాము. ఆ పండితుడు ఎలా ఉంటాడు అతని లక్షణములు ఏమిటి అనే విషయం ఇక్కడ వివరించాడు పరమాత్మ. పాండిత్యము అంటే కేవలము ప్రాపంచిక విద్యలు అధ్యయనం చేయడం కాదు. అవి ధన సంపాదన కొరకు, ప్రాపంచిక సుఖాలు అనుభవించడానికి పనికివస్తాయి కాని అసలైన ఆత్మజ్ఞానమును, ఆనందాన్ని ప్రశాంతతను ఇవ్వలేవు. ఇవ్వవు. నిజమైన పండితుడు ఎవరంటే ఆత్మజ్ఞానము గురించి తెలుసుకున్నవాడు. హృదయము నిర్మలంగా ఉన్నవాడు. కామ సంబంధమైన కోరికలు లేని వాడు. ప్రతిఫలాపేక్ష లేనివాడు. అటువంటి వాడిని పండితుడు అంటారు. అతను ఏ కర్మచేయడానికి సంకల్పించినా, ఏ కర్మ చేసినా, దాని వలన వచ్చే ఎటువంటి ఫలితమైనా ఆ పండితుడు సంపాదించుకున్న జ్ఞానము అనే అగ్నిలో దగ్ధమైపోతుంది. ఏ ఫలితము అతనిని అంటదు.
ఈ శ్లోకంలో సమారమ్భాః అనే పదం వాడారు. ఆరంభం అంటే పనులు చేయడం మొదలుపెట్టడం. సమారమం అంటే సమ్యక్ ఆరంభః అంటే మంచి పనులు చేయడం అని అర్థం. ఏ పని అయినా ఆరంభిస్తేనే అది పని అవుతుంది. అంతకు ముందు అది సంకల్ప రూపంలో ఉంటుంది. ఆరంభించిన తరువాత దానిని పని, కర్మ అంటారు. అందుకే సమారమ్భః అంటే చక్కగా, ధర్మయుక్తంగా ఆరంభింపబడిన కర్మ అని అర్థం. వెంటనే మరొక మాట కూడా అన్నారు. కామ సంకల్ప వర్జితాః కామము అంటే కోరికలు. సంకల్పం అంటే ఆ కోరికలు తీరడానికి కర్మలు చేయాలని, ఈ పని నేనే చేస్తాను అనే అహంకారంతో, మనసులో సంకల్పించడం. పూనుకోవడం. మొదట సంకల్పం లేనిదే ఎవరూ ఏ పనీ మొదలు పెట్టలేరు. ఏ పనీ చేయలేరు. కాబట్టి సంకల్పం ముఖ్యం. కాబట్టి ఎవరైతే తాము చేసే కర్మల యందు ఏదో ఒక కోరిక గురించిన సంకల్పము కానీ కర్తృత్వము గానీ, అహంకారము కానీ, ఫలాపేక్ష కానీ కలిగి ఉండరో వారికి ఆత్మజ్ఞానము తప్పక లభిస్తుంది. వారు చేసిన కర్మల యొక్క మంచి చెడులు అన్నీ వారు ఆర్జించిన జ్ఞానము అనే అగ్నిలో పడి మాడి పోతాయి. వారు ఎప్పటికీ పవిత్రంగానే ఉంటారు. అటువంటి వారిని జీవన్ముక్తులు అని అంటారు. అటువంటి వారిని మాత్రమే పండితులు అని పిలుస్తారు.
మానవులకు ఈ ఒక్క జన్మ కాదు కదా. ఎన్నో జన్మలు ఎత్తి ఉంటారు. ఆ జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలు వారిని అంటిపెట్టుకొని దూది కుప్ప లాగా పేరుకుపోయి ఉంటాయి. పైగా ఈ జన్మలో కూడా కొన్ని కర్మలు చేస్తుంటారు. ఈ కర్మల తాలూకు వాసనలు అన్నీ, దూది కుప్పలో ఒక్క అగ్ని కణం వేస్తే దూది కుప్ప మొత్తం మాడి మసి అయిపోయినట్టు, జన్మజన్మల వాసనలు అన్నీ కూడా జ్ఞానము అనే అగ్ని కణంతో మాడిపోతాయి. ఆ మానవులు పునీతులవుతారు. మోక్షమునకు అర్హులు అవుతారు. ఈ జ్ఞానం రావడానికి ముఖ్య కారణం నిష్కామ కర్మ. అంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం. ఈ చిన్ని ప్రయత్నం చేస్తే మనం అనంతమైన లాభమును పొందుతాము.
ఇక్కడ మరొక మాట కూడా అన్నాడు పరమాత్మ. సర్వే సమారమ్భాః. అంటే ఏదో ఒక మంచి పని చేసి ఊరుకోవడం కాదు. మనం చేసే పనులు అన్నీ పనులు కూడా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవి, స్వార్ధము లేనివి, నిష్కామంగా ఉండేవి అయి ఉండాలి. అందుకే సర్వే అనే పదం ఉపయోగించబడింది. మనలో కొంత మంది నేను ఏ నాడు చేసిన పాపమో ఈ నాడు అనుభవిస్తున్నాను. నా ఖర్మ ఇంతే నా బతుకు ఇంతే అనే నిరాశతో ఉంటుంటారు. భగవానుడు ఆ నిరాశను దూరం చేసుకోమంటున్నాడు. పాత సంగతి మరిచిపో. ఈ జన్మలో అయిన నిష్కామ కర్మలు ఆచరించు. పది మందికి ఉపయోగపడే కర్మలు చెయ్యి. అప్పుడు నీ పాత కర్మల వాసనలు నశించిపోతాయి అని అభయం ఇస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పనీ కూడా అహంకారం లేకుండా, కర్తృత్వభావన లేకుండా, నిష్కామంగా, సమాజ శ్రేయస్సు కోరి చేస్తే, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ ఆత్మజ్ఞానము ఇది వరకు జన్మలలో చేసిన కర్మల యొక్క వాసనలను నాశనం చేస్తుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.
ఈ శ్లోకం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాము. ఇది వరకు శ్లోకంలో కృత్స్న కర్మకృత్ అంటే అన్ని కర్మలను ఆచరించిన వాడు. అంటే ఇంక ఆయనకు కోరతగ్గ కోరికలు ఆ కోరికలు తీరడానికి చేయతగ్గ కర్మలు ఏమీ లేవు. ఆయన పరిపూర్ణుడు. తృప్తిపొందినవాడు అని అర్థం. కాని ఈ శ్లోకంలో కామ సంకల్పములు, ఆరంభింపబడిన కర్మలు, అన్నీ కూడా జ్ఞానము అనే అగ్నిలో పడి దగ్ధం అయిపోతాయి అని అంటున్నారు. పరిపూర్ణత్వము సాధించిన వాడికి కోరికలు, సంకల్పములు, కర్మలు ఏముంటాయి? అని మనకు ఒక చిన్ని సందేహము రావచ్చు. సాధారణంగా మానవులు తమ స్వార్థం కొరకు కర్మలు చేస్తారు. వాటి ఫలితాలు అనుభవిస్తారు. కాని జ్ఞాని పరిపూర్ణుడు తన కోసం ఏమీ చేయడు. చేసుకోడు. సమాజం కోసం చేస్తాడు. సమాజం బాగుపడడానికి కర్మలు చేస్తాడు. సాటి మానవుల మీద దయతో, కరుణతో, ప్రేమతో, వారంతా బాగుపడాలి అనే సత్సంకల్పంతో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు చేయడానికి తగిన సంకల్పం చేస్తాడు.
ఈ నాడు మనం ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నాము. కాని వాటిని ఆవిష్కరించిన వారు ఎటువంటి స్వార్థ బుద్ధితో చేయలేదు. లోకోపకారం కొరకు చేసారు. వ్యాసుడు, భారత, భాగవతాలు, పురాణాలు సమాజం బాగుపడాలని రాసి పెట్టాడు. ఆయుర్వేద శాస్త్రం మన ఆరోగ్యం కోసం చరకుడు రాసి పెట్టాడు. అచ్చు యంత్రము, రైలు, విమానము, ఆటోమోటివ్సు అన్నీ ఎవరో మహానుభావులు ఆవిష్కరిస్తే, వాటిని మనం ఈనాడు అనుభవిస్తున్నాము. ఈ పనులన్నీ ఆ మహానుభావులు తమ కోరికలు తీర్చుకోడానికి వారి స్వార్థానికి వినియోగించుకోడానికి చేయలేదు. అటువంటి వారికి సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం లేదు.
జ్ఞానులు తాము చేసే పనిలో ఆనందం పొందుతారు. అజ్ఞానులు తమ ఆనందం కోసమే పనిచేస్తారు. తమకు లాభం లేకపోతే ఏ పనీ చేయరు. కాబట్టి జ్ఞానులు నిష్కామంగా చేసే సంకల్పములు, కోరికలు, కర్మలు, వాటి వలన వచ్చే ఫలములు ఆ జ్ఞానిని బంధించలేవు. ఆ కర్మ ఫలములు, వాటి వలన కలిగే పుణ్యము, పాపము అన్నీ ఆయన ఆర్జించిన జ్ఞానము అనే అగ్నిలో పడి దగ్ధం అయి పోతాయి. ఆ జ్ఞానికి ఎటువంటి బంధనములు, వాసనలు కలిగించవు. అటువంటి వారిని పండితులు అని అంటారు. రెండవ అధ్యాయం 11వ శ్లోకంలో "గతాసూన గతాసూంశ్చ నానుశోచన్తి పన్డితాః."అని అన్నారు. అంటే మరణించిన వారి గురించి మరణించబోయే వారి గురించి పండితులు శోకించరు అని అర్థం. ఆ పండితులు ఎవరంటే ఈ శ్లోకంలో వివరించారు. స్వార్ధాన్ని వదిలిపెట్టి పరార్థం కోసం పాటుపడేవాడే పండితుడు.
కాబట్టి అర్జునా! నీవు నీ కోసం నీ స్వార్ధం కోసం ఆలోచించకుండా, ధర్మం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు యుద్ధం చెయ్యి అని బోధించాడు కృష్ణుడు.
(సమాజం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు కొత్త విషయాలను ఆవిష్కరించిన వారిని సమాజం మొదట ఎన్నో బాధలు పెట్టింది. వారు చెప్పిన విషయాలను ఎవరూ నమ్మలేదు. తరువాత ఆ విషయాలు లోకము చేత కీర్తింపబడ్డాయి. ఉదాహరణకు సోక్రటీసు, న్యూటన్, గెలీలియో, ఏసుక్రీస్తు మొదలగు మహానుభావులు మొదట ఎన్నో కష్టాలు అనుభవించారు. నేడు ప్రపంచం అంతా ముక్తకంఠంతో వారిని కీర్తిస్తున్నారు.)
(సశేషం)
*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P248
No comments:
Post a Comment