@ సాహచర్యం @
యధాలాపంగానే
తీసుకుంటాం చేతుల్లోకి
ఓ పుస్తకాన్ని
నిరాసక్తంగానే
తిరగేస్తాం వేలి కొసలతో
ఆ పుటలని
అన్యమనస్కంగానే
చదువుతు పోతుంటాం
అక్షరాలూ పదాలూ పంక్తులను
********
ఇదిగో...
సరిగ్గా ఇక్కడే జరుగుతుంది
ఓ మార్మికమైన ఇంద్రజాలం
క్రమ క్రమంగా
ఆవహించేస్తుంది మనని
ఓ తాదాత్మ్యం
అనివార్యంగానే
వశం చేసేసుకుంటుంది మనని
ఆ పుస్తకం
********
పాత్రలు
రక్తమాంసాలనే కాదు
సమస్త భావోద్వేగాలనూ సంతరించుకుని
సన్నిహితమైపోతాయి మనకు
వాటితో పాటూ
మనమూ పయనిస్తాం
అప్రయత్నంగానే వాటితో స్నేహం చేస్తాం
అనివార్యంగానే ప్రేమలో పడిపోతాం వాటితో
నవ్వుతాం ... అవి నవ్వితే
ఏడ్చేస్తాం....తెలియకుండానే అవి ఏడిస్తే
చిరాకు పడిపోతుంటాం ఒక్కోసారి వాటి అమాయకత్వానికి
భుజం తట్టో...
గుండెలకు హత్తుకునో......
ఊరడించేయాలని చూస్తాం
అవి కల్పితాలని మరచి
**********
చివరి పుట
చదవడం ముగించి
పుస్తకం మూసేయగానే
ఓ గాఢమైన
నిట్టూర్పు వెలువడుతుంది
మన హృదయపు లోలోతుల్లోంచి
పుస్తకం మూతపడినా
మన మస్తకం తెరుచుకుంది
అన్న సంకేతమది
*********
కొన్ని ....
పుస్తకాలు మాత్రమే
కలిగిస్తాయి మనలో ఇంతటి
గాఢమైన భావోద్వేగాన్ని
కొన్ని
పుస్తకాలు మాత్రమే
కలిగిస్తాయి మనలో ఇంతటి
తీవ్రమైన సంచలనాన్ని
ఆ భావోద్వేగమూ
ఆ పెనుసంచలనమూ
చిట్ట చివరి నిఛ్వాశ వరకూ
వదలి పోనేపోదు మనని
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment