Wednesday, November 5, 2025

 8️⃣7️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  

41.*తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభl* 
 *పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశనమ్ll*

ఓ అర్జునా! అత్యంత పాపభూయిష్టమైనదీ, మానవునిలో ఉన్న జ్ఞానమును విజ్ఞానమును నాశనం చేసేదీ అయిన ఈ కామాన్ని జయించాలంటే, ముందు నీ ఇంద్రియములను, వాటి విషయగ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో. తరువాత కామాన్ని జయించు.

మనం ఇంత వరకు కామం అంటే కోరికల గురించి మాట్లాడుకున్నాము. మరి కామాన్ని జయించడానికి మార్గం ఏమిటి అనే విషయం చర్చిద్దాము. కామమునకు ఆశ్రయం ఇంద్రియములు, కాబట్టి ముందు ఇంద్రియములను కట్టడి చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు కామమునకు మూలము మనస్సు బుద్ధి ఇంద్రియములు అని చెప్పుకున్నాము. మనకు కనపడేవి ఇంద్రియములు. ముందు ఇంద్రియ నిగ్రహం అలవరచు కుంటే, కామానికి ఒక ఆసరా తొలగిపోతుంది. తరువాతది మనస్సు. మనస్సును నిగ్రహిస్తే, ఇంక కామము ఏమీ చేయలేదు. ఇంద్రియములు మనస్సు మన వశంలో ఉంటే బుద్ధి కూడా మన వశంలో ఉంటుంది. అప్పుడు కామము ఒంటరిదై పోతుంది. ఏమీ చేయలేక నశించి పోతుంది. కాబట్టి పరమాత్మ ముందుగా ఇంద్రియములను వశంలో ఉంచుకోమని మనకు చెప్పాడు. ఇంద్రియములను వశంలో ఉంచుకోవడం మామూలు మానవులకే కాదు ముముక్షువులతో సహా అందరికీ అవసరమే. ఎందుకంటే ఏ క్షణంలో అయినా కామము ఇంద్రియములను ఆకర్షించి, వశపరచుకుంటుంది. కాబట్టి ఇంద్రియముల విషయంలో అనుక్షణం అప్రత్తతతో ఉండాలి. ఇంద్రియములను అభ్యాసము చేతా, వైరాగ్యము చేతా, మనం చేయబోయే పని మంచిదా కాదా అనే విచారణ చేతా ఇంద్రియములను కట్టడి చేయవచ్చును.

భగవానుడు పాప్మానమ్ అనే పదం వాడాడు. అంటే కామము పాపభూయిష్టమైనది. మానవులను పాపకూపంలో పడవేస్తుంది అని పరమాత్మ భావన. అందుకే మనలను హెచ్చరిస్తున్నాడు. ఇటీవలి కాలంలో కామానికి బానిస అయిన వాళ్లు ఎన్నెన్ని ఘోరాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. కామము మనిషిలోని జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. పతితుడిని చేస్తుంది. ఎంతో మంది పండితులు, జ్ఞానులు, అనుభవజ్ఞులు కూడా ఈ కామం బారిన పడిపోతున్నారు. కాబట్టి ఈ కామాన్ని అరికట్టడం ప్రతివాడి కర్తవ్యము. దానికి వివేకము, వైరాగ్యము, ముఖ్యమైన ఆయుధములు అని ముందే చెప్పుకున్నాము. కాబట్టి అర్జునా నువ్వు కూడా వీళ్లందరిమాదిరి కామానికి లోనుకాకుండా దాని మోహంలో పడిపోకుండా, నిశ్చయాత్మకబుద్దితో యుద్ధం చెయ్యి అని పరమాత్మ బోధించాడు.

ఈ కామమునకు మూడు ఆశ్రయాలు అంటే మూడుస్థావరాలు అని చెప్పుకున్నాము కదా. ఆ స్థావరాలను ముందునాశనం చేయాలి. మొట్టమొదటి స్థావరము శరీరము, అంటే ఇంద్రియములు. ఇంద్రియములు అంటే వాటి శక్తులు చూచే శక్తి తాకే శక్తి, వినే శక్తి, రుచి చూచే శక్తి. ఇవే కొంప ముంచేవి. స్త్రీలోలత్వం, స్త్రీసుఖం, చూచే శక్తి, తాకే శక్తి వలననే కలుగుతుంది. శరీరాన్ని నిగ్రహించడం అంటే ఇంద్రియ నిగ్రహం పాటించడం. తరువాత ఈ ఇంద్రియముల ద్వారా లోపలకు వెళ్లి మనసు రికార్డుచేసిన విషయాలను తొలగించడం, అటువంటి విషయాలు లోపలకు వెళ్లకుండా నిరోధించడం. దానినే మనోనిగ్రహం అంటారు. ఈ రెండూ నిగ్రహించగలిగితే బుద్ధి దానంతట అదే నిగ్రహింపబడుతుంది. ఇవన్నీ ఎందుకు నిగ్రహించాలి అంటే ఇవి కామానికి స్థావరాలు. ఈ కామము మనలో ఉన్న జ్ఞానమును, విజ్ఞానమును నాశనం చేస్తుంది కాబట్టి.

కామాన్ని నిరోధించే ప్రక్రియలో దాని స్థావరాలను నాశనం చేయాలి. ఆ ప్రక్రియలో మొదటగా ఇంద్రియములను నిగ్రహించాలి అని బోధించాడు పరమాత్మ.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

 (రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P211

No comments:

Post a Comment