నేటి తెలుగు వెలుగులో ఉషాకిరణాలు 💛*మాటే బలం.. బలహీనత*💛
'గొడ్డలితో నరికిన చెట్టు మళ్లీ చిగురిస్తుంది కానీ, మాటలతో ముక్కలైన మనసు ఎప్పటికీ అతుక్కోదు' అన్నది అనుభవజ్ఞుల మాట. అమృతం బయటికి వచ్చినా లోపలికి వెళ్లినా ఆనందమే! విషం బయటికి వచ్చినా లోపలికి వెళ్లినా ఉపద్రవమే! మనం అమృతం తాగుతున్నామా, విషం తాగుతున్నామా? అమృతం పంచుతు న్నామా, విషం కక్కుతున్నామా అనేది వాక్కుమీద ఆధారపడి ఉంది. మనసును ఖాళీగా ఉంచడమే ధ్యానం. ఆలోచనలన్నింటినీ మాటల రూపంలో పెడుతూ పోతే అవి జీవన గతినే మార్చేస్తాయి.
నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నిండు కుండ తొణకదు. ఇలాంటి ఉపమానాలెన్ని చెప్పినా మాట్లాడటం మానడు మనిషి. భావ వ్యక్తీకరణ కోసం భగవంతుడు అతడికిచ్చిన మహ త్తరమైన శక్తి- మాట. సృష్టిలో మరే జీవికీ అది లేదు. అందుకే దాన్ని ఆచి తూచి వాడాలి. మనసులోంచి వచ్చిన ట్లుండాలి. మంచి మాట అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి.
మహామంత్రి తిమ్మరుసును తప్పిస్తే తప్ప విజయనగర సామ్రాజ్యం పడిపో దని తీర్మానించుకున్న శత్రువులు ఆయన మీద రాయలవారికి లేనిపోనివన్నీ చెప్పారు. రాయలు తిమ్మరుసు కళ్లు పొడి పించేస్తాడు. అప్పటికీ రామరాయల వల్ల సామ్రాజ్యం నిలబడినా ఆయనను కూడా రాజ్యం పడిపోయింది. చివరకు శిథిలాలు మిగిలాయి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హరి శ్చంద్రుడితో 'నువ్వు నాకు కలలో వాగ్దానం చేశావు. దాన్ని తీర్చమ'ని అడు గుతాడు. 'బ్రహ్మర్షివర్యా! మీరు చెప్పారంటే అది కలైనా నిజమే అవుతుంది. మీ మాటకు నేను బద్ధుణ్ని' అని తన జీవితాన్నే పణంగా పెడతాడు ఆ సత్యవాక్పరి పాలకుడు. తండ్రి మాట నిలబెట్టడం కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేస్తాడు శ్రీరా మచంద్రుడు. మాటను కాపాడుకోవడానికి మనం అంత గొప్ప త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు కానీ మాట విలువ గుర్తుంచుకుని వ్యవహరించాలి.
వాగ్భూషణం భూషణం... అంటుంది భర్తృహరి శ్లోకం. వాక్కు మాత్రమే మనిషికి నిజమైన అలంకారమని, ఎన్నటికీ వన్నె తరగనిదనీ ఆ శ్లోకానికి అర్థం. ధర్మరాజు, శ్రీకృష్ణుడు గొప్ప శ్రోతలు. బాగా వింటేనే బాగా మాట్లాడగలం. మంచి నిర్ణయాలు తీసుకోగలం. స్నేహం, వైరం, నిర్మలత్వం, కళంకం, పుణ్యం, పాపం, శాంతి, అశాంతి, మంచి, చెడు... అన్నీ మాటలనుబట్టే వస్తాయి. మాట మనసును నొప్పించనూ గలదు, ఒప్పించనూ గలదు. మన చేతలే కాదు, మాటలు కూడా ఇతరులకు బాధ కలిగించకూడదు. అంతెందుకు... కష్టాల్లో ఉన్నవారికి నేనున్నా'నన్న మాట సాయం చాలు, వాళ్లకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. మాటకి ఆ శక్తి ఉంది. మాటలో సత్యం ప్రతిఫలించాలి... వాస్తవం ప్రతిబింబించాలి. అప్పుడే జ్ఞానం పరిఢవిల్లుతుంది.
తరిగొప్పుల మూర్తి గారి సౌజన్యంతో
No comments:
Post a Comment