Tuesday, March 31, 2020

మౌన మంత్రం

మౌన మంత్రం
🕉🌞🌎🌙🌟🚩
-{మౌనం’ అంటే మనతో మనం సంభాషించుకోవడం !}-


ప్రపంచం ఇప్పుడు స్వీయ నిర్బంధంలో ఉంది. ఇల్లే ఒక లోకంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో మానసికమైన ఆసరా కోసం వెతకడం సర్వసాధారణం. అలాంటి ఆసరా ఆధ్యాత్మిక చింతన ద్వారా సాధ్యమవుతుంది. దైవం అండగా ఉన్నాడనే భావన ఎనలేని శక్తిని ఇస్తుంది. వ్యతిరేక భావాల్లోకి జారిపోకుండా చేయూతనందిస్తుంది. ఆ చేతిని అందుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకొనే మార్గాలు ఎన్నో ! వాటిలో ఎంతో శక్తిమంతమైనది మౌనం.


మౌనం ఒక శక్తిమంతమైన ఆయుధం. మనలోని వ్యతిరేక భావనలను తొలగించే శక్తి దానికి ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దాన్ని ఆశ్రయిస్తే అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.


మౌనం’ అంటే మనతో మనం సంభాషించుకోవడం ! ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావడానికో, మానసికంగా తగిలిన గాయాలను మాన్పుకోవడానికో మౌనాన్ని మనం ఆశ్రయిస్తూనే ఉంటాం.


మౌనం ఒక శక్తిమంతమైన ఆయుధం. మనలోని వ్యతిరేక భావనలను తొలగించే శక్తి దానికి ఉంది. అంతేకాదు, అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మౌనంలో లభిస్తాయి. అందుకే ఋషులు మౌనాన్ని ఆశ్రయించారు. వారిని ‘మౌని’ లేదా ‘ముని’ అని పిలవడానికీ అదే కారణం. మౌన వ్రతాన్ని దాదాపు అన్ని మతాలూ సూచించాయి. భాద్రపద మాసంలో మౌనవ్రతాన్ని పాటించే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో శివ నామస్మరణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఉంది.


ఇంటి నుంచి బయటకు వెళితే మనం ఏం చేస్తాం ? స్నేహితులతోనో, పరిచయస్థులతోనో మాట్లాడతాం. అయితే ఇప్పుడు మాటే చేటు తెస్తోంది. అందుకే ఇంటికే పరిమితం కావలసిన ప్రస్తుత కాలంలో మౌనాన్ని సాధన చేద్దాం.


మహాభారత లేఖనంలో...

మౌనం ఎంత గొప్పదో మహాభారత రచనకు సంబంధించిన ఒక కథ మనకు చెబుతుంది.


వ్యాస భగవానుడు చెబుతూ ఉంటే భారతాన్ని వినాయకుడు వ్రాశాడు. రచన పూర్తయిన తరువాత వ్యాసుడు ‘‘వినాయకా! ఆ భగవంతుడే మహాభారతాన్ని సృష్టించాడు. అది నా నోటి నుంచి వచ్చింది. నువ్వు రాశావు. ఇది నా అదృష్టం. కానీ నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించినది నీ మౌనం ! నేను భారతాన్ని చెబుతున్నప్పుడు దాదాపు రెండు లక్షల పదాలు నా నోటి నుంచి వచ్చాయి. ఇదంతా రాసే సమయంలో నువ్వు ఒక్క మాట మాట్లాడగా నేను వినలేదు. ఎందుకని ?’’ అని అడిగాడు.


దానికి గణపతి సమాధానమిస్తూ, ‘‘కొన్ని దీపాలలో నూనె ఎక్కువగా ఉంటుంది. మరి కొన్నిటిలో చాలా కొంచెం ఉంటుంది. అయితే ఏ దీపానికీ నిరంతరంగా నూనె అందడం జరగదు. అలాగే, మానవులకూ, రాక్షసులకూ, ఆఖరికి దేవతలకు కూడా పరిమితమైన జీవిత కాలం ఉంటుంది. ఎవరికైతే స్వీయ నియంత్రణ ఉంటుందో, తమ శక్తులను సహనంతో, అవగాహనతో ఉపయోగించుకుంటారో వాళ్ళే జీవితం నుంచి పూర్తి ప్రయోజనం పొందగలుగుతారు. స్వీయ నియంత్రణకు మొదటి మెట్టు - మాటను నియంత్రించుకోవడం ! మాట మీద నియంత్రణ లేని వాళ్ళు అనవసరంగా ఎంతో శక్తిని కోల్పోతారు. మాటను నియంత్రించుకోవడం ద్వారా అలాంటి నష్టాన్ని నివారించుకోగలరు. అందుకే మౌనానికి ఉన్న శక్తిని నేనెప్పుడూ నమ్ముతాను’’ అని చెప్పాడు !

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment