Monday, March 30, 2020

కుబేరుడు

కుబేరుడు

సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయురాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా! కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందనీ, మీసం, గడ్డంకలిగి ఉంటాడనీ, దంతాలు బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె) ఉంటాయనీ ఉంది. అదే విధముగా, శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం.
ఈయన జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకి చెప్తున్నట్టు వస్తుంది. ఆ ప్రకారంగా, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు. ఊరి నుండీ పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే “జన్మానికో శివరాత్రి” అంటారు.

ఇదిలా ఉండగా, పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో, మేరు పర్వతానికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ తనకనువయిన ఒక చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమయిన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు అక్కడకి వెళ్ళి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోయేవారు. వీటి వలన పులస్త్యునికి తపోభంగం కలిగేది. దానితో ఆగ్రహించిన ఆయన, తన కంట పడిన కన్య గర్భవతి అవుతుందని శపించి తపస్సులో మునిగిపోతాడు. ఈ శాపం గురించి తెలిసినవారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె అయినటువంటి మానిని అక్కడికి వెళ్ళటం, గర్భం దాల్చటం జరగటంతో తన కుమార్తెను స్వీకరించమని తృణబిందుడు పులస్త్యుని అడుగగా దయతో ఆమెను స్వీకరించి, ఆమె సేవలకి మెచ్చి, తనతో సమానమయిన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టినవాడే విశ్రవుడు (వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం). విశ్రవుడు (ఇతనిని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు) తన తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడై, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్త వయస్కుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.

కుబేరుడు చిన్నతనం నుండీ శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి మరియు పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.

No comments:

Post a Comment