Saturday, January 30, 2021

అందరూ తప్పక ఆచరించవలసిన వ్రతం

అందరూ తప్పక ఆచరించవలసిన వ్రతం :-

తప్పులెన్ను వారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వ దాభిరామ వినుర వేమ !


ఈ నాలుగు చిన్ని చిన్ని వాక్యాలలో - ఎంత అర్థం వుందో - చూడండి.

తప్పులెన్నువారు తండోపతండంబులు - నిజమే కదా...ఎక్కడి కెళ్ళినా - యిది మనం చూస్తూనే వున్నాము. ప్రపంచంలో అందరి తప్పులూ మనకు తెలుసు. అందరినీ విమర్శిస్తాం . మనలాగే మన పక్క వారూ. వారి పక్క వారూ - మనమందరూ అంతే. విమర్శించడం మన జన్మ హక్కు . పోనీ. మనం విమర్శించే తప్పు - కనీసం మనం చెయ్యకుండా వున్నామా? ..అదీలేదు.

ఆ తప్పు మనం చేస్తూనే, మరొకరిని విమర్శిస్తూ వుంటాం. అందుకనే వేమన అన్నారు - తప్పులెన్నువారు తండోపతండంబులు. నిజమే కదా!

"ఉర్వి జనుల కెల్ల వుండు తప్పు"

తప్పులే చెయ్యని వాడు ప్రపంచంలో పుట్ట లేదు. దేవతలు కూడా తప్పులు చేస్తారు వొక్కో సారి.
దానికి తగిన ఫలితమూ అనుభవిస్తారు.

పార్వతీ దేవి మగనికి అవమానం జరిగే యజ్ఞానికి వెళ్లి - తను కూడా అవమానం పాలైంది కదా. మహా యోగి శివుడు కూడా - యివ్వ తగని వరాలు యిచ్చి కస్టాలు అనుభవించాడు కదా. యివి కథలు కావచ్చు. కానీ మన కోసం చెప్ప బడ్డ జీవిత సూత్రాలు.

మరి మూడో వాక్యం చూద్దాం.. " తప్పులెన్నువారు తమతప్పులెరుగరు "

యిది చాలా ముఖ్యమైనది. చుట్టూ వున్న వారి తప్పులే, చూసే వారికి - తమ తప్పులు అసలు తెలీవు.


ఎవరో చేసే తప్పులు వేలెత్తి చూపుతాం. అదే తప్పు మనమూ చేస్తున్నట్టు గుర్తించం.

సరే. మనం చెప్పాం. వారు మారొచ్చు; మారక పోవచ్చు .

మారితే వారు బాగుపడ్డారు. మంచిదే. కానీ, మనమెప్పుడు బాగు పడేది? మనం ఎవరు చెబితే వింటాం?

"తప్పులెన్నువారు" మిగతా వారి మాటలు వినరు గాక వినరు. తమ తప్పులు చూడరు గాక చూడరు.

"నాలో తప్పులే లేవు" అనే వాడంత మూర్ఖుడు మరొకడు లేడు.

మనందరిలో తప్పులున్నాయి. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి నిమిషం వుంది.

ప్రతి రోజూ పడుకునే ముందు మనం చేసిన తప్పులు ఏమిటి అని చూసుకుని, వాటిని రేపెలా సరిదిద్దు కుంటామో ప్రణాళిక వేసుకొవాలి. దానికి దైవ సహాయం అడగాలి. అదే ప్రార్థన.

మీకు తెలిసే వుంటుంది - మన పూజల్లో - యిది వొక ముఖ్య భాగం. నేను తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు -వాటిని మనం పాపాలు అని అంటాం - వాటిని క్షమించు . మళ్ళీ వాటిని చెయ్యకుండా కాపాడు -అని ప్రార్థిస్తాము.

. దేవుడు ఎక్కడో లెదు. మన లోపలే వున్నాడు. బయటా వున్నాడు. ప్రార్థన రెండింటికీ అందుతుంది.

పక్క వాడి గురించి మాట్లాడ్డం - మన అలవాటు. అంతే.

సరే . మరెవ్వరి గురించీ - మనం మాట్లాడనే కూడదా ?

మాట్లాడొచ్చు . మొదట - వారి తప్పులు, మనలో లేకుండా చూసుకోవాలి. తరువాత - వారికి, మనం చెప్ప దగిన వాళ్ళమా, మనం చెబితే వారు వినే పరిస్థితిలో వున్నారా - అనేది కూడా చూడాలి.

సంస్కృతంలో ఒక సూక్తి వుంది. "సత్యం బ్రూయాత్; ప్రియం బ్రూయాత్; న బ్రూయాత్ సత్యమప్రియం".

సత్యం మాత్రమే చెప్పాలి. కాని, అది ప్రియంగా వుండేటట్టు చెప్పాలి . అలా మంచి మాటను మంచిగా చెప్పలేని వారు - చెప్పకుండా వుండడమే మంచిది.

మనం బాగు పడాలంటే - మన తప్పులు మనం తెలుసుకొవాలి. దిద్దుకోవాలి. యిది రోజూ చెయ్యాల్సిన పని. యిదే దైవ ప్రార్థన . యిదే ముక్తి మార్గం. యిదే మన సంతోషానికి రాచ బాట.

ఈ రోజు నుండీ - ఒక వారం రోజుల పాటు - "నేను ఎవరి తప్పులూ వేలెత్తి చూపను" అని ఒక వ్రతం పెట్టుకోండి.

మీ జీవన విధానంలో గొప్ప మార్పు వస్తుంది .

మీ మనసులో ఎంతో శాంతి, ఆనందం నిండుతుంది .
🙏కృష్ణo వందే జగద్గురుమ్🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment