Sunday, January 24, 2021

పరిష్కారం

పరిష్కారం

ప్రమధ్వర రాజ్యాన్ని చంద్రశేఖరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.ఆ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. రాజు ప్రత్యేక శ్రద్ద తీసుకుని పహరా పెంచి చాలా మంది దొంగలను బంధించాడు. కాని దొంగతనాలు ఆగలేదు.ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి. ఒక్కడే దొంగ దొంగతనం చేస్తున్నట్లు బాధితుల విచారణలో తెలిసింది.ఈ దొంగతనాలు గంగులు అనే గజదొంగ చేస్తుండేవాడు. కాపలా భటుల కళ్ళు కప్పి ఇంటి దగ్గరకు చేరుకోవటంలో, తాళాలు తీయటంలో, కిటికీలు తొలగించడంలో, నేర్పుగా దోచుకోవటంలో, చాకచక్యంగా కళ్ళు కప్పితప్పించుకోవటంలో వాడిది అందె వేసిన చెయ్యి. ముసుగు ధరించటం వల్ల వాడి ముఖాన్ని ఇంతవరకూ చూసిన వాళ్ళు లేరు. ఏ రాత్రి ఎక్కడ ఏ దిక్కున దోచుకుంటాడో తెలియదు.కాబట్టి భటులు
బంధించలేకపోయారు.
ఒక రోజు రాజు తన జన్మదినం సందర్భంగా తనకిష్టమైన చదరంగం పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. పోటీలో పాల్గొనేవారు రాజాస్థానంలో ఉన్న చదరంగంలో ఆరితేరిన నలుగురు మేధావులను ఓడించాలి. అలా ఓడించి విజేతగా నిలిచిన వారికి రాజు రెండు వందల వజ్రాలను బహుమతిగా ఇస్తాడు. ఈ విషయం రాజ్యమంతటా ప్రకటించారు.
చదరంగంలో నైపుణ్యమున్న వాళ్ళు వారి అదృష్టాన్ని పరీక్షించుకుందామని పేరు నమోదు చేయించుకున్నారు. వారి వంతు వచ్చినప్పుడు పోటీకి వెళ్తున్నారు. చదరంగం ఆటకు ఏకాగ్రత ముఖ్యం కాబట్టి ఇతరులెవరూ లేకుండా ప్రత్యేకమైన గదిలో మంత్రి ఆధ్వర్యంలో పోటిలు జరుపుతున్నారు.కానీ చదరంగంలో తలలు పండిన నలుగురిని ఓడించడం మాటలు కాదుకదా!ఎవరూ గెలవలేదు.
ఆ రాజ్యంలో చతురుడనేపండితుడున్నాడు. చతురుడు కూడా పేరు నమోదు చేయించుకున్నాడు. పోటీలో పాల్గొన్నాడు. నలుగురినీ ఓడించి విజేతగా నిలిచాడు. రాజు సభలో చతురుడిని ఘనంగా సన్మానించి, రెండువందల వజ్రాలు అందజేశాడు. చతురుడి పేరు రాజ్యమంతటా మార్మోగింది. ఈ సంగతి గంగులు చెవిన పడింది. చతురుడి వద్ద నుండి వజ్రాలు దొంగిలించాలనుకున్నాడు. ఆలస్యం చేయకుండా అదే రోజు సాధారణ పౌరుడిగా చతురుడి ఇంటి చుట్టూ తిరిగి,
ఆ ఇంటిని పరిశీలించి ఆ ఇంటిలో ప్రవేశించి దొంగలించడం సులభమనే నిర్ణయానికొచ్చాడు.
అర్ధరాత్రి నల్లని దుస్తుల్లో ముసుగు దొంగగా మారి, చతురుడి ఇంటి వద్దకు చేరుకున్నాడు. చెట్టు కొమ్మ సాయంతో ఇంటి చుట్టూ ఉన్న గోడను దూకి తలుపు వద్దకు చేరుకున్నాడు. అక్కడ గోడ చాటున చీకట్లో దాగి దొంగ రాకకోసం ఎదురుచూస్తున్న రాజభటులు చుట్టుముట్టి బంధించి కారాగారంలో వేశారు. రాజు వాడికి జీవిత ఖైదు విధించారు.
చదరంగం పోటీలు ఏర్పాటు చేయటం పోటీలో గెలవకున్నా గెలిచినట్లు విజేతగా చతురుడిని ప్రకటించి, రెండు వందల వజ్రాలనిచ్చి రాజ్యంలో అందరికీ తెలిసేలా చేయటం, రాజుతో కలిసి చతురుడు పన్నిన పథకం.
ఈ విషయం దొంగ చెవిలో పడుతుందని వజ్రాలకోసం దొంగ ఏదో ఒక రోజు చతురుడి ఇంటికి దొంగతనానికి వస్తాడని రాత్రి వేళ చతురుడి ఇంటి వద్ద కాపలాభటులను ఉంచారు.దొంగ చతురుడు పన్నిన వలలో పడ్డాడు.
తర్వాత ఒక రోజు చతురుడు రాజును కలుసుకుని "మహారాజా!ప్రస్తుతానికి దొంగల బెడద తగ్గినా, భవిష్యత్తులో కొత్త దొంగలు పుట్టుకు రావచ్చు. చేతినిండా పని ఎంతో కొంత సంపాదన లేకుంటే మరో మార్గం లేనప్పుడు కఠిన శిక్షలకు కూడా భయపడక దొంగలుగా మారుతారు. కాబట్టి అందరికీ పని దొరికేలా చేతి వృత్తుల్లో శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేయండి. వ్యవసాయాన్ని,పరిశ్రమలను అభివృద్ది చేయండి.నిరుపేదలకోసం సంక్షేమపథకాలు ప్రవేశపెట్టండి.సమస్యపరిష్కారమవుతుంది"అన్నాడు.
రాజు చతురుడిని సలహాదారుడిగా నియమించారు.

Source - Whatsapp Message

No comments:

Post a Comment