Monday, May 30, 2022

కలి పురుషుడు అనేక రకాలుగా ఆర్షమతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు ఈ దేశపు వైదిక మతాన్ని రూపుమాపాలని ఆలయ ద్వంసాలు, హత్యాకాండలు, హింసలు, మానభంగాలు, చేసిన విమతాలు ఇప్పుడు మరో దుర్మార్గాన్ని అవలంబించాయి. మన వేదపురాణాల్లోనే వాళ్ళ దేవుళ్ళ గురించి, మూలపురుషుల గురించి చెప్పబడిందని పేర్కొనడం. అందుకు వాళ్ళు చేస్తున్న కుయుక్తులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వేదమంత్రాలకు, పురాణ శ్లోకాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం క్రొత్త క్రొత్త సంస్కృత శ్లోకాలను రాసి అవి ఆ పురాణాల్లో ఉన్నాయని చెప్పడం. నిజానికి ఆ శ్లోకాల పూర్వాపరాలు చూస్తే వాళ్ళ అజ్ఞానం బయటపడుతుంది. వాళ్ళు ఆరాధించే ప్రవక్తలే ‘కల్కి’ అవతారం అన్న దుస్సాహసానికి దిగిన మూర్ఖులూ ఉన్నారు. ఈ దేశపు మతాన్నీ, అవతారాలనీ, దేవుళ్ళనీ, సంస్కృతినీ కాదనదానికి చేసే ప్రయత్నంలో ఈ దేశపు అవతారాలను, పురాణాలను స్పృశించవలసిన అవసరం ఏమొచ్చింది! ఇది అవివేకం, అజ్ఞానం కాదా! కల్కి గురించి చెప్పిన మాటలున్న పురాణాల్లో మన హైందవ దేవాలయాలు, హైందవ పర్వదినాలు, హైందవ ఆచారాలు, యజ్ఞయాగాలు అన్నీ ఉన్నాయి. వాటిని అనాదిగా ఆచరిస్తున్న సత్సంప్రదాయాలు మనకు ఉన్నాయి. వాటిని సమూలంగా అంతం చేద్దామని పాశవిక, రాక్షస ప్రవర్తనలతో పెచ్చరిల్లిన వాళ్ళంతా ఇప్పుడు వాటి మూలాలలో తమ మూలాలు ఉన్నాయని చెప్పుకొనేటంత దుర్బలత్వానికి దిగజారుతున్నారు. తమ మతాలలోకి మారమని ఏమార్చడానికి, మన మతపు మాటల్ని మార్చి వాడుతున్నారు. హఠాత్తుగా వేదపురాణాలపై ఇంత ప్రేమ వాళ్లకి ఎలా పొడుచుకొచ్చిందో! పాపం మన సంస్కృతి ఆధారాలు చూపిస్తే గానీ తమకు ఇక్కడ మనుగడ లేదని తమకంటూ వ్యక్తిత్వమే లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రచారం చేస్తూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో తమ మతం వేదాలలో పురాణాలలో ఉందని చెప్పుకుంటున్నప్పుడు అనాదిగా ఇక్కడే పుట్టి పెరిగి వేదాల మార్గాన్నే అనుసరిస్తున్న మనం వాళ్ళ మతాన్ని స్వీకరించాల్సిన అవసరమేముంది! దేవాలయాలు, విగ్రహారాధనలు అక్కర్లేదనుకున్నప్పుడు తమకంటూ ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా మందిరాలు ఎందుకు కాపాడుకుంటున్నట్టో! మనవాళ్ళల్లో అనాసక్తి, మూర్ఖత్వం పెరుగుతోంది. కనీసం వివేకంతో ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళ మతాలు ఎప్పుడు పుట్టాయో, ప్రవక్తలు ఎప్పుడు ఉదయించారో వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంతకు పూర్వమే ఉన్న వేదం, పురాణం, భగవద్గీతల వాక్యాలను తమ ఉనికికి ప్రమాణాలుగా చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే మన ధర్మపు (హిందూ మతపు) ప్రాచీనతని, ఔన్నత్యాన్ని, శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళే అంగీకరిస్తున్నారు. ఇది వెన్నెముక లేని పైశాచిక వ్యక్తిత్వానికి ఉదాహరణ కాదా! సనాతన ధర్మాన్ని యుగాల పూర్వమే చాటిన వేదవాక్యాలు చెప్పిన నిత్యసత్యాల ఛాయలు, ఆరాధనా విధానాల జాడలు ప్రపంచంలోని ఇతర మతాలలో కాసిని కనిపిస్తాయి. కానీ ఈ సంస్కృతికి ఉన్న ఔన్నత్యం, విస్తృతి వాటిలో లోపించినా, చిట్టచివరకు వారు ఏ చెట్టును నరకడానికి రాక్షస కృత్యాలు చేశారో, వాటి మూలాల్లోనే తమ మూలం ఉందని బూటకపు మాటల్లోకి దిగారంటే, మతమార్పిడులకు మరో వంచనా మార్గాన్ని ఎన్నుకున్నారని గ్రహించలేని అజ్ఞానంలో మనమున్నట్లే కదా! ఒకనాడు ప్రపంచమంతా విస్తరించిన హైందవ సంస్కృతి జాడలు ప్రపంచంలో ఎక్కడైనా దొరకవచ్చు. ‘ఎవడి మార్గం వాడిది ఎందులో వెళ్ళినా చేరేది ఒకే గమ్యం’ అని చాటిన మహోజ్జ్వల వైదిక మార్గం ఎవరినీ మతం మార్చలేదు, మార్చదు. నువ్వు ఎక్కడ పుట్టావో అది నీకు మాతృస్థానం. ఇప్పుడెవడో దుర్మార్గుడు వచ్చి ‘ఆక్రమణ’లో భాగంగా హింసించినా, ఎరలువేసినా, నువ్వు లొంగకపోయేసరికి “మా అమ్మ స్త్రీ, మీ అమ్మ స్త్రీ. ఇద్దరూ ఒకటే కనుక మీ అమ్మను వదలి మా అమ్మనే మీ అమ్మగా ఆరాధించు” అంటే ఇది బాగుందని నువ్వు నీ మాతృమూర్తిని వదిలితే ఎంత ద్రోహమో – ఇలా మతం మారినా అంతే ద్రోహం. వారి మతాల మూలాలు మన ప్రాచీన గ్రంథాలలో ఉన్నాయని చెప్పుకోవడం – ఈ దేశవాసులుగా వారు మనతో కలిసి బ్రతికే సమైక్యతకు దోహదపడాలి గాని, మన మాతృమతం నుండి విడదీసేందుకు వాడుకోవడం విచారకరం. ప్రతి స్త్రీనీ మాతృమూర్తిగా గౌరవించే సంస్కృతిలోని ఔదార్యాన్ని బలహీనతగా భావించే దుర్మార్గులకు బుద్ధి చెప్పలేని విధంగా పాలనా వ్యవస్థ, బుద్ధి జీవుల ఆలోచనా వ్యవస్థ పాడై కూర్చున్నాయి. కన్నతల్లిని తన తల్లి కాదని, పరాయితల్లి పొత్తిళ్ళలోకి చేరే కుత్సితాలను ఖండించడానికి పెద్ద తర్కాలు, సమాధానాలు అక్కర్లేదు, కాసింత ఇంగితం చాలు. మన మతంపై శత్రుతాభావం పెంచుకుని, కపటాలకు పూనుకుంటున్న విమతాలు రెండూ ఈ బాటనే అనుసరిస్తున్నాయి. వీరికి ఒకటే సూటి ప్రశ్న - తమ మతపు మూలాలు భారతీయ వేదపురాణాల్లో ఉన్నాయని కువ్యాఖ్యానిస్తూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారే ఇవే మాటలు, వారి మతాలు పుట్టి వర్ధిల్లుతున్న దేశాల్లో చెప్పగలరా! ఈ మాటల్ని వాళ్ళ మతపు భాషల్లో, వాళ్ళ దేశాల ప్రార్థనాలయాల్లో ప్రచురించి పంచగలరా! కేవలం – ఈ దేశంలో ఇక్కడి వాళ్ళ సనాతన మతాన్ని, మాతృ మతాన్ని మార్చడానికి ఈ దేశంలో మాత్రమే సాగిస్తున్న ఆత్మవంచన – పరవంచనా మార్గాలివి. ఇవే మాటలు వాళ్ళ దేశాల్లో అంటే వాళ్ళ మతపెద్దలే ఘోరంగా శిక్షిస్తారు. గతంలో ఇతర దేశాల మీదికి దాడికి వెళ్ళినప్పుడు హింసతో దాడిచేసి ఎన్నో అందమైన సంస్కృతుల్ని గ్రీక్, రోమన్, మాయా వంటి పద్ధతుల్ని బూడిద చేశారు. అవే ప్రయత్నాలు అంతకన్నా దారుణంగా చేసినా ఈ సంస్కృతి ఇంకా పచ్చగా ఉండడంతో మరోరకమైన కుత్సితానికి ఒడిగడుతున్నారు. ఇతర దేశాలలో ఇతర మతాలుగానీ ఉంటే వాళ్ళ ప్రాచీన గ్రంథాల్లో కూడా తమ దేవుళ్ళ గురించే ఉందని చెప్పడానికి కూడా వెనుకాడరు. వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం మతమార్పిడి. ఇతరుల్ని నిందించకుండా ఎవడి మానాన వాడిని, వాడి పరంపరాగత ధర్మంలో ఉండనీయక ఇలా భ్రష్టు పట్టిస్తుంటే ఇది ఎందరికో మనస్తాపాన్ని కలిగించి క్రమంగా వైషమ్యాలకు దారి తీస్తుందని, చివరకు దేశానికే ముప్పు తెస్తుందని గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఈ దేశాన్ని ఆక్రమించుకుని పాలించి తిరిగి వెళ్ళిపోయినా, ఈ సంస్కృతిని దురాక్రమించి రూపుమాపే ప్రయత్నాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. ఒక దేశపు పరంపరాగత సంస్కృతీ, ఆ దేశపు తరతరాల ఆస్తి. దానిని నశింపజేయడం దేశాన్ని దోచుకోవడం కాదా! ఈ కాసింత అవగాహన ఈ దేశాల పాలక, మేధావి వర్గాలకు ఇంకా కలగలేదా! విదేశాలలో వివేకవంతులైన విజ్ఞానులు భారతీయుల సనాతనహిందూధర్మపు ఔన్నత్యాల్ని గ్రహించి ఇటు మళ్ళి తరించుతుంటే ఇక్కడి అతి సామాన్యులని వృధా మాటలతో తమలోకి మార్చుకొని మెజారిటీని నిరూపించుకోవాలని ప్రయత్నించడం హాస్యాస్పదం, శోచనీయం. గుర్రం మీద తమ పూర్వీకుడు ఎక్కి వచ్చాడు కనుక ఆయనే కల్కి అవతారమనుకుంటే, గుర్రమెక్కిన ప్రతివాడూ కల్కి అయిపోతాడా! అన్యాక్రమణ చేసే మ్లేచ్ఛులతో యజ్ఞభూమి అయిన భరతవర్షం బాధితమైనప్పుడు కల్కి వస్తాడనీ, శంబళగ్రామం హిమాలయాలలో ఋషులచే గుప్తమై(రహస్యంగా) ఉన్న దివ్యధామమని భాగవతం, భవిష్యపురాణం చెప్పాయి. వారి పూర్వాపరాలు పరిశీలించక, ధర్మ ద్రోహులైన మ్లేచ్ఛుల నాశనం కోసం రానున్న కల్కి మ్లేచ్ఛులలోనే ఉన్నాడని, ముందే వచ్చాడని చెప్పడం మరో మ్లేచ్ఛభావం కాదా! ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుని కాలంలో, ఒక ప్రబుద్ధుడు (పౌండ్రక వాసుదేవుడు) తానే కృష్ణుడినని చెప్పుకుని పాపం నశించాడు. ఇది కలియుగం కదా అవతారం ఇంకా రాకుండానే తామే అవతార పురుషులమనే కపటులు ఇంకెందరు రానున్నారో పరమాత్మకే ఎరుక! కల్కి ఇప్పటికే అవతరించి తనపని పూర్తిచేసి ఉంటే నిత్యశాంతియుతమైన కృతయుగం సహజంగా ఆవిర్భవించేది కదా! ఇన్ని అశాంతులు, దుర్భిక్షాలు, అశ్లీలాలు, దౌర్జన్యాలు ఉంటాయా! కనీసపు వివేకాన్ని కూడా తాము కోల్పోయి అందరినీ మూర్ఖులుగా చేయడమేనా మతమార్పిడి! వాళ్ళకి. అద్భుతమైన ‘సర్వం బ్రహ్మమయం జగత్’ అనే తాత్త్విక చింతనకు ఎదిగేలా చేసే సంప్రదాయాలను సశాస్త్రీయంగా బహుముఖాలుగా ఏర్పరచుకొని బ్రతుకుతున్న అనాది భారతీయతకు ఎవ్వరి ప్రబోధాలు నూత్న మతాలూ అక్కర్లేదు. “నీ తల్లి నీకు గొప్ప – నా తల్లి నాకు గొప్ప. నీది నువ్వు ఆచరించు. నిన్ను గౌరవిస్తాను. మా వైదిక సంప్రదాయ శాఖలన్నీ మావి. వాటిని గౌరవించు. కానీ వాటిలో నీ ప్రతిబింబాన్ని చూపించి నన్ను నీలా మార్చడమెందుకు? నన్ను నాలా బ్రతకనివ్వు. నువ్వు నీలా బ్రతుకు. కలసి బ్రతుకుదాం. కలుపుకొని బ్రతకవలసిన అవసరం లేదు”, అని చెప్పగలిగేదే నిజమైన సర్వమత సమ్మత మార్గం. అదే అసలు సెక్యులరిజం. చక్కని పురాణ విద్యలో పనికిమాలిన అవైదిక ప్రక్షిప్తాలు చాలా పేరుకుపోయాయి. ఔరంగజేబును గత జన్మలో కాశీ శివభక్తునిగా వ్రాసిన కట్టు పురాణ కథ కూడా కనిపిస్తుంది. అదే మాదిరి కథలు హింసాళువైన ఘజనీకి కూడా వ్రాశారు. అవన్నీ ఆర్షవిద్యలని ఎలా అంగీకరిస్తాం! దీనికి అసలైన పరిష్కారం ప్రభుత్వాలు చేపట్టాలి. ఒకరి మాతృమతాన్ని మార్చడానికి ఎవరు ప్రయత్నించినా కఠినంగా శిక్షించే విధానాలను ఏర్పరచిన నాడే దీనికి విమోచనం లభిస్తుంది. లేదా క్రమంగా దేశమే పరహస్తగతం కావచ్చు లేదా మతకలహాలతో మండిపోవచ్చు. ఈ ముందుచూపు లేని స్వార్థ నాయకుల బారిన ఈ దేశం పడకుండా, భారతీయ సనాతన ధర్మదేవత అనుగ్రహించుగాక! (ఒక్కవిషయం – అన్ని మతాల్నీ గౌరవించే భారతీయులం మనం. కేవలం మన సంస్కృతిని మన వాళ్ళలో రక్షించుకోవాలనే ఆత్మరక్షణ ధర్మాన్ని అనుసరించే ఆత్మనివేదన ఇది. ఏ ఒక్క మతాన్నీ, వారి ప్రవక్తల్ని కించిత్తు కూడా అవమానించడం ఋషిపీఠమైన ఈ దేశపు సంప్రదాయం కాదు). (ఎంతో వేదనలో ఆర్.ఎస్.చక్రవర్తి(ఈ సంచికలోని ‘పాఠకస్వరం’ చూడండి)వ్రాసిన ఉత్తరానికి ప్రతిస్పందన ఈ వేదనావేశం. శ్రీ చక్రవర్తి గారు ‘అశ్వమెక్కిన ధర్మ స్థాపకుడే కల్కి అయితే, శివాజీ(కూడా) కల్కి అవతారమే’ అని మరో ప్రత్యేక వ్యాసం వ్రాసి పంపారు. వీరి యుక్తి అభినందనీయమే).

No comments:

Post a Comment