Saturday, May 28, 2022

ఇలా మన సనాతన ధర్మం ‘అవిద్య’ మానవ దుఃఖానికి, జనన మరణ చక్రభ్రమణానికి, భగవంతుడికి మనిషికి మధ్య దూరానికి ప్రధాన కారణమని తేల్చిచెప్పింది.

రామకృష్ణ పరమహంస కోల్‌కతా దక్షిణేశ్వరంలో పూజారిగా ఉన్నరోజుల్లో, ఒకసారి ప్రముఖ సంఘసేవకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ను కలిశాడు. పరమహంసకు విద్యాసాగర్‌ ఆతిథ్యమిచ్చి, ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. అందులో భాగంగా వారి మధ్య ‘అవిద్య’ అన్న అంశం చర్చకు వస్తుంది. అప్పుడు రామకృష్ణులు అవిద్య అన్న పారమార్థిక పారిభాషిక పదానికి వివరణ ఇస్తూ.. ‘మనిషిని ప్రాపంచిక మోహంలో పడదోసి, భగవంతుడికి దూరం చేసే గుణాలను కలిగి ఉండేదే అవిద్య. అది మహా మాయ. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే భక్తి, జ్ఞానం, దయ, ప్రేమ, వైరాగ్యం ఇవి ‘విద్య’ లక్షణాలైతే, భగవంతుడిపై విశ్వాసం లేకపోవటం, అజ్ఞానం, కాఠిన్యం, ప్రేమరాహిత్యం, భోగాసక్తి ఇవన్నీ ‘అవిద్య’ స్వభావాలు’ అని వివరించాడు. మనిషి తన సహజ స్వభావమైన ఆనందాన్ని కాదని, సంసార దుఃఖాల్లో కూరుకుపోవటానికి ఈ అవిద్య కారణమని పరమహంస విస్పష్టం చేశాడు.
ఒక సందర్భంలో ఓ శిష్యుడు ఆది శంకరాచార్యులతో ‘గురువర్యా! నిద్రలో ఎంతో ప్రశాంతతను, సుఖాన్ని అనుభవిస్తున్నాను. కానీ మెలకువలో ఉన్నప్పుడు ఆ సుఖశాంతులు మాయమైపోతున్నాయి? పైగా వాటిస్థానంలో అశాంతి, దుఃఖం వచ్చిచేరుతున్నాయి. కారణమేంటి?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఆదిశంకరులు ‘నాయనా! నీవు మేల్కొన్నప్పుడు ఇంద్రియాలు కూడా మేల్కొంటున్నాయి. వేటి కోసమో వెంపర్లాడుతున్నాయి. దీన్నే ‘అవిద్య’ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అసంసారివి అయినా సంసారి అనుకోవటం, దేనికీ నీవు కర్తవు కాకపోయినా, ‘నేను’ కర్తను అనుకోవటం, నీవు భోక్తవు కాకపోయినా భోక్తను అనుకోవటం, నీవు ఆత్మరూపంగా శాశ్వతుడవైనా.. శరీరానికే పరిమితమై అశాశ్వతుడనని భ్రమపడటం వీటిని ‘అవిద్య’ అంటారు. నీవు మరలా, మరలా పుట్టడానికి, చావడానికి ఈ ‘అవిద్యే’ కారణమ’ని శంకరాచార్యులు ఉద్ఘాటించాడు. వారి ‘ఉపదేశ సాహస్రి’లో ఈ అంశంపై విపుల వ్యాఖ్యానం చూడవచ్చు.
అయితే వివిధ తత్త్వవిధులు వేర్వేరుగా ‘అవిద్య’ను నిర్వచించారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమించే మాయనే అవిద్య అన్నారు అద్వైతులు. తత్త్వజ్ఞానం లేకపోవటమే ‘అవిద్య’ అని వ్యాఖ్యానించారు విశిష్టాద్వైతులు. బౌద్ధమత గ్రంథాల్లో కూడా ‘అవిద్య’ అన్న ఆధ్యాత్మిక పారిభాషిక పదం ప్రస్తావన కనిపిస్తుంది. ‘క్షణికమైన వాటిని శాశ్వతమని తలచటమే అవిద్య’ అంటారు బౌద్ధమత గురువులు. పతంజలి యోగసూత్రాల్లో కూడా ‘అవిద్య’ పై వివరణ కనిపిస్తుంది. ‘అనిత్యాశుచి, దుఃఖానాత్మను నిత్యశుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్యా’ అనిత్యం, అశుచి, దుఃఖం, అనాత్మలను నిత్యం, శుచి, సుఖం, ఆత్మ అనుకోవటం ‘అవిద్య’ అని పతంజలి యోగసూత్రాల్లో సాధన యోగంలోని అయిదో సూత్రం పునరుద్ఘాటిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే చీకట్లో తాడును చూసి పాము అనుకొని భయపడ్డట్లు, అశాశ్వతమైన ప్రపంచాన్ని, శాశ్వతమని భ్రమించటమే ‘అవిద్య’.
ఇక రమణ మహర్షి తాను తనువు అనుకోవటమే ‘అవిద్య’ అంటారు. తను ఆత్మ అని తెలుసుకోవటమే ‘విద్య’ అని పేర్కొన్నారు. ‘కూలీ కోసం లగేజీ మోసేవాడు దానిని దింపే స్థలం వరకు మోసుకొని వస్తాడు. స్థలాన్ని చేరగానే సంతోషంగా బరువు దింపుతాడు. బరువు వదిలిందిరా నాయనా’ అనుకుంటాడు. అంతేకానీ, విచారించడు. వదిలించుకున్న బరువు కేసి చూడడు. జీవన్ముక్తునికి ఈ శరీరం లగేజీ లాంటిది. కూలీ వాడికి తాను మోసే లగేజీపై ‘నేను, నాది’ అనే భావం ఎలా ఉండదో, అలాగే జీవన్ముక్తునికి దేహంపై అభిమానం, మమకారం ఉండవు. మానవ శరీరంతో జన్మ ఎత్తినందుకు పరమ ప్రయోజనమైన ఆత్మజ్ఞానం పొందాలి. పొందాక శరీరభావాన్ని విడవాలి. భోజనం అయ్యాక, ఎంగిలి ఆకును అవతల పారేసినట్లు, శరీర భావాన్ని తోసివేయాలి. అంతేకానీ, ఇంకా దాన్ని పట్టుకొని వేలాడటం ఏమిటి? అదే అవిద్య. ఇలా మన సనాతన ధర్మం ‘అవిద్య’ మానవ దుఃఖానికి, జనన మరణ చక్రభ్రమణానికి, భగవంతుడికి మనిషికి మధ్య దూరానికి ప్రధాన కారణమని తేల్చిచెప్పింది.

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment