Saturday, August 6, 2022

🌷మహాసిద్ధి🌷

 🌷మహాసిద్ధి🌷
అనేకమంది సాధకులు సిద్ధులకై ప్రయత్నిస్తుంటారేగాని,
ఆత్మసిద్ధికై ఎవడూ ప్రయత్నించడు.
లేదా నిజంగానే ఆత్మసిద్ధికై సాధన మొదలు పెట్టినప్పటికీ, మధ్యలో సిద్ధులు కలిగి, ఆ వైపుకు ఆకర్షింపబడి గమ్యాన్ని చేరకపోవడమూ ఉంది.
సిద్ధులన్నీ స్వప్నసిద్ధులే.
ఈ మహాస్వప్నం నుండి మేలుకోవడమే మహాసిద్ధి.
కలలోనే ఉంటూనే ఇది కల అని తెలుసుకునే జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానము.
మెలకువలో ఉంటూనే మెలకువగా(ఇది కూడా ఓ కలే అని) ఉండడమే ఆధ్యాత్మిక జ్ఞానము.
మేలుకో-మేలుకో అని కఠోపనిషత్తు ఘోషించడానికి కారణమిదే.
నీవు దేనినయితే మెలకువ అంటున్నావో అది మెలకువ కాదు అని అర్థం.
మెలకువలో నుంచి మేలుకోవడమే మోక్షం.
కలలు, మెలకువలు కలయని ఎరిగిన
"మెలకువ" తానే అనిలాచలా!
అన్నారు గురుదేవులు.
"మెలకువ" అంటే నిత్య ఎరుక.(అచలమైన ఎరుక)
జాగ్రత్-స్వప్న-సుషుప్తులు మూడింటిలోనూ
"నేనున్నాను" అన్న నిత్య ఎరుకలో ఉండడమే మహాసిద్ధి.
అటువంటి మహాసిద్ధిని పొందటానికి 
కేవలం గ్రంథపఠనం, క్షేత్రదర్శనం చాలవు.
ఈ అజ్ఞానమనే గాఢనిద్ర నుండి,
ఆ నిద్రలో కనే ఈ స్వప్న ప్రపంచం నుండి 
నిన్ను గట్టిగా తట్టి లేపగలిగేది సద్గురు సాంగత్యం ఒక్కటే.
లే... కదులు...గురుపాదాల వైపుకు....
* * *
మగవాడు తాను మగవాడినని సదా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడా? లేదు కదా?
'అహం బ్రహ్మాస్మి' అంటూ లేదా 
'శివోహం' అంటూ కొందరు సదా జపం చేస్తుంటారు....
కొందరు నేతి-నేతి(నేనిదికాదు-నేనిదికాదు)అంటూ
సాధన చేస్తుంటారు.
అంటే వీరు అంతగా దేహాత్మభావంతో మమేకం అయిఉండబట్టే, వారికి అటువంటి సాధనలు అవసరమై ఉండొచ్చు.
అటువంటివారికి ఆ మాత్రం సాధన చేయడం సహాయమేగాని
నిజానికి తానెప్పుడూ 'అదే' కదా!
రాజకుమారుడు రాజే అవుతాడు.
సాలెవాని కుమారుడు సాలెవాడే అవుతాడు.
వాటికై ఎవరూ ప్రత్యేక సాధనలు చేయరు కదా!
బంగారం ఆభరణంగా మారుకున్నాక
బంగారం కాకుండా అయిపోతుందా?
ఆభరణం బంగారం కావడానికి సాధన చేయాలా?
* * *
సాధకుని పరిపక్వతను అనుసరించి
ఆ జ్ఞప్తినిపొందటంలో కాలభేదం ఉంటుందేగాని
"తానెప్పుడూ అదే" అనేది తిరుగులేని సత్యం.
పరిపక్వత అనేది కేవలం సద్గురు సన్నిధిలో మాత్రమే దొరికే అపురూపమైన స్థితి.
* * *
సాధన వలన తానే ఐన వస్తువు తాను కావడం
అంతేగాని తానుకానిది తానవ్వడం కాదు.
'నేను ఈ శరీరమాత్రుణ్ణి' అనే అబద్ధపు భావన నుంచి
'నేను ఆత్మస్వరూపుణ్ణి' అనే సత్యానుభవానికి 
చేసే ప్రయాణమే "ఉపాసన".
ఎవరైనా సాధన అవసరమా? అని అడిగితే
తప్పనిసరిగా వారికి అవసరమే అంటాను.
యెందుకంటే ప్రశ్నించారంటేనే దాని అర్థం వారికి ఆత్మానుభవం కలుగలేదనే.
'నేను ఆత్మానుభవాన్ని పొందానంటారా....?' అని అడిగారు నా మిత్రుడు ఓ రోజు.
'పొందలేదు' అని చెప్పా ఖండితంగా...
యెందుకంటే పొందినవాడు అలా యెవరినీ అడగడు.
ఆత్మానుభవంలో 
సంశయానికి, అయోమయానికి తావుండదు.
అంతేకాదు, అటువంటి మహనీయుడు  తానై యెవడినీ పిలిచి బోధించడు.
యెందుకంటే వానికి అజ్ఞాని అనేవాడు తోచడు.
వాని దృష్టిలో "జ్ఞానం" తప్ప మరో వస్తువు కనబడదు.
ఇతరులు తనను నిరూపించడం గాని
తాను ఇతరులకు నిరూపించుకోవడంగాని
రెండవస్తలూ ఉండవు.
అలా ఎట్టి సంశయమూ లేని స్వస్థితిని పొందటానికి చేసే అనేక సాధనలలో ముఖ్యమైనది - అహం మూలాన్వేషణ.
అనగా "నేను" అనే భావన యెక్కడ పుడుతోందో 
అక్కడకు తానెళ్లి స్థిరపడడం. (అంటే ఆచలంలో లేదా ఆకాశంలో చలనం ఎక్కడ ప్రారంభమవుతోందో అక్కడ స్థిరంగా ఉండడం)
దీనినే ఆత్మనిష్ఠ అంటారు.
ఆత్మనిష్ఠ కన్నా గొప్ప సాధనగానీ, 
గొప్ప సిద్ధిగానీ మరేదీ లేదు.
* * *

No comments:

Post a Comment