Thursday, May 25, 2023

ముఖ్యంగా తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆలోచనా ధోరణి గురించి తెలియచెప్పే అద్భుతమైన కథ.

ముఖ్యంగా తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆలోచనా ధోరణి గురించి తెలియచెప్పే అద్భుతమైన కథ.

“ విరిగిపోయిన ఈ బక్కెట్టు తీసుకెళ్లి పాత సామాన్ల వాడికి ఇచ్చెయ్” అంది అమ్మ  రవికి  ప్లాస్టిక్ బకెట్ అందిస్తూ. తొమ్మిదో తరగతి చదివే రవిలో తెలివి, సృజనాత్మకత శాతం ఎక్కువ. 

 ఆకుపచ్చ రంగున్న బకెట్ మీద రంగు రంగుల్లో పువ్వులున్నాయి. విరిగినదే అయినా సరే అందంగా కనిపిస్తోందది. దాన్ని పాత సామాన్ల  వాడికివ్వడం   రవికి నచ్చలేదు.   కాసేపు ఆలోచించాడు రవి.  వాడికో ఆలోచన వచ్చింది. 

 ఒక కత్తెర తీసుకుని బకెట్ అంచు నుండి విరిగిన భాగం వరకు  క్రమ పద్ధతిలో కత్తిరించి. అడుగున ఒక   రంధ్రం చేసి, మట్టితో నింపాడు. పెరట్లోని  గులాబీ మొక్కల్లో ఒకటి తెచ్చి మట్టిలో  పాతాడు. దాని మీద  నీళ్లు  పోసాడు. ఇప్పుడది పూల కుండీ అయింది. దాన్ని తీసుకెళ్లి ప్రహరీ గేటు ప్రక్కన అలంకరణగా  పట్టేసి  అమ్మకి చూపించాడు.

 “ఇదెప్పుడు కొన్నాము?” అని ఆశ్చర్య పోయిందావిడ.  జరిగింది  అమ్మకి చెప్పాడు రవి. వాడి ఆలోచనకు మెచ్చుకుని,  వాళ్ళ నాన్నతో  చెప్పబోయింది. “చదువుకోవాల్సిన  సమయాన్ని ఇలా  వృధా చేయవద్దు.  చదువుకోమను” అన్నాడు నాన్న.    
 మరొక రోజు వీధిలో అందరికీ కరెంట్ పోయింది. రవి గదిలో మాత్రం విద్యుత్ బల్బు వెలుగు కనబడింది. 

వీధిలో వాళ్లకు రవి వాళ్లింట్లో మాత్రం వెలుగు కనబడడం ఆశ్చర్యమేసింది. 
“మీకు కరెంట్ పోలేదా? లేకపోతే ఇన్ వర్టర్ దా?” అని అడగడానికి వచ్చారు కొందరు.  

రవి అమ్మా నాన్నలు కూడా  ఆశ్చర్యపోయి “మాకూ కరెంట్ పోయింది. ఇన్ వర్టర్  లేదు” అని చెప్పారు.  

“మీ ఇంట్లో  లైట్ వెలుగుతోంది” అని వాళ్లు చెబితే ఆశ్చర్యపోయి లోపలకు వెళ్లారు.  అక్కడ విద్యుత్ వెలుగులో చదువుకుంటూ కనబడ్డాడు రవి. 
“ఇదెలా సాధ్యం?” అని అడిగారు రవిని.
“ పనిచెయ్యని కారు బ్యాటరీలను ఒక అంకుల్ పారెయ్యబోతుంటే అడిగి తీసుకున్నాను. మనింట్లో కరెంట్ రిపేరు చేసినప్పుడు మిగిలిపోయిన రాగి వైర్లు   నా దగ్గర దాచాను. ఆ పాత బ్యాటరీలో మెగ్నీషియం సల్ఫేట్ (ఎప్సమ్ సాల్ట్), కాస్టిక్ సోడా ,  పరిశ్రమల్లో  ఉపయోగించే స్ఫటికాకార ఆమ్లం ఉపయోగించి ఛార్జింగ్ చేశాను.  దానికి  కొత్త జీవితం వచ్చింది. ఇన్ వర్టర్ లాగా పనిచేసి వెలుగు ఇస్తోంది” అన్నాడు రవి. 

వీధిలో వాళ్లంతా రవి తెలివిని అభినందించి వెళ్ళిపోగా, నాన్న మాత్రం ఇలాంటి వాటికి సమయం వృధా చేస్తున్నాడని గొణుక్కున్నాడు. 

 ఒకరోజు సాయంత్రం బడి నుండి వచ్చిన రవితో ‘దోమతెర  చినిగిపోయిందని,  కొత్త దోమతెర  కట్టడానికి సాయం  రమ్మని’  పిలిచింది వాళ్ళమ్మ.  పాత   దోమతెరలో  కొన్నిచోట్ల  రంధ్రాలు పెద్దవయ్యాయి. పనయ్యాక  పాత తెరని  బయట పడెయ్యమంది. 

దాన్ని చూసిన  రవి  మనసులో బయట పారేయడం కంటే  వడియాలు, పిండి, నువ్వులు  ఆరబోసేటప్పుడు  పక్షులు ఎత్తుకు పోకుండా  వల లాగా  వాడాలన్న ఆలోచన కలిగింది.  ఆ మాటే వాళ్ళమ్మకి చెప్పగా  భలే ఆలోచన అంటూ మెచ్చుకుంది ఆమె.   

సరిగా అప్పుడే వాళ్ళ నాన్న ఇంట్లోకి వస్తూ ఆ మాటల్ని  విన్నాడు.  “ అదే పనిగా మెచ్చుకుని వాడిని పాడు చెయ్యకు” అని కసిరాడు. 

రవి  మీద వాళ్ళ నాన్నకి ప్రేమ ఉంది. ఇలాంటి పనులతో చదువుకి ఆటంకం వస్తుందని  భయపడుతుంటాడు.  తరగతి  పుస్తకాలు చదవాలి తప్ప ఇలాంటి  పనులు చేయొద్దంటాడు. ఏదైనా కొత్తగా  ఆలోచించి రవి చెప్పగానే వాటిని  మొగ్గలోనే తుంచి పారేసేవాడాయన. కొడుకుని ప్రోత్సహించాలని ఉన్నప్పటికీ భర్తకి ఎదురు చెప్పలేక పోయేది వాళ్ళమ్మ. 

ఒక  రోజు ఉదయం  కూరగాయలు కోసం  వెళ్లిన రవి నాన్నకి సైన్సు మాస్టారు కనిపించారు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. రవి తెలివిని , సృజనాత్మకతని     మెచ్చుకున్నారు మాస్టారు. 
  రవి నాన్న  సంతోషించలేదు సరికదా   “నాకూ అదే  భయం. వేరే ఆలోచనల్లో పడిపోయి  చదువుని  నిర్లక్ష్యం చేస్తాడేమోనని ” అన్నాడు.    

“ అందులో భయపడాల్సిందేముంది?   వాళ్ల కొచ్చే  ఆలోచనలను స్వాగతించాలి.  రవిలా సృజనాత్మకత  ఉన్నవాళ్లు మాత్రమే దేన్నైనా   కొత్త కోణంలో చూస్తారు.  బడిలో పిల్లలకు వచ్చే కొత్త  ఆలోచనలను మేం స్వాగతిస్తుంటాం.  వాటిని నూతన ఆవిష్కరణలుగా మార్చడానికి ప్రయత్నిస్తుంటాము. విజ్ఞాన ప్రదర్శనలప్పుడు ప్రదర్శిస్తుంటాం”  అన్నారు మాష్టారు. 

రవి ఇంట్లో చేసిన  పనుల గురించి  మాష్టారికి చెప్పి “వీటివల్ల ఏం ప్రయోజనం ఉంది?” అనడిగాడు   రవి నాన్న. 

మాష్టారు “ఎన్నో ఏళ్ళు పిండి విసిరిన తిరగలి అరిగిపోతే కొందరు పారేస్తారు. మరికొందరు గార్డెన్లో మెట్టుగా వాడతారు. టీ  కప్పు పగిలితే  కొందరు పారేస్తారు. మరికొందరు బడ్ వేజ్ గా వాడతారు . ఇందులో డబ్బు  ఎంత మిగిలిందన్నది ప్రశ్న కాదు. కొత్త రూపంలో పాత వస్తువుని చూసినప్పుడు కలిగే  మానసిక ఆనందం  వేరు. అందులో  ఉన్న కొత్త కోణాన్ని. సృజనాత్మకతను చూస్తే  ఆ పని ఎంతో గొప్పదని తప్పక అర్ధమవుతుంది.  రవిలో చురుకైన బుద్ధి ఉంది.  తెలివిగా, వేగంగా  ఆలోచిస్తాడు. అందువల్ల చదువుల్లో కూడా ముందుంటాడు  తప్ప నష్టం జరగదు” అన్నారు  నమ్మకంగా. 

 రవి నాన్నకి అంతవరకూ ఉన్న  అపోహలన్నీ తొలగిపోయాయి.  రవిని చదువుకే పరిమితం చేయకుండా మిగతా విషయాల్లో కూడా  ప్రోత్సహించాడు. తన మీద అమ్మానాన్నలకు ఉన్న   నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు రవి.  
ఈనాటి కాలంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించే నేటి బాలకులకు ఈ కథ అంకితం.
నారంశెట్టి ఉమామహేశ్వరరావు

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment