Wednesday, May 31, 2023

బంధాలు అనుబంధాలు

 *బంధాలు అనుబంధాలు*
                          
కూతురు అమెరికాలో
అమ్మ అంబాజీపేటలో
కొడుకు ఇంగ్లండ్ లో
తండ్రి ఇరుకు సందులో
నువ్వు ఇన్ఫోసిస్
నాన్నకేమో క్రైసిస్
నువ్వు వీసాపై ఎక్కడో
అమ్మ అంపశయ్యపై 
నువ్వు రావు, రాలేనంటావు
నిజానికి రావాలని అనుకోవు
టికెట్ దొరకదంటావు
సెలవు లేదంటావు
వస్తే తిరిగి రావడం కష్టమంటావు
నువ్వు వచ్చేదాక
అమ్మ ప్రాణం పోనంటుంది..
నీ రాక కోసం ఆ కళ్ళు 
గుమ్మం వైపే రావని తెలిసినా 
నాన్న అమ్మకు ఆ కబురు చెప్పలేక, కక్కలేక, మింగలేక
మంచం చుట్టూ అటూ ఇటూ
అవతల ఆ తల్లి 
ఇంకాసేపట్లో అటో ఇటో
వయసు వచ్చినప్పటి నుంచి 
డాలర్ డ్రీమ్సే
పొద్దున లేస్తే ఆ ఊసే
నీ కలల వెనకే 
తల్లిదండ్రుల పరుగు
వారి ఆశలన్నీ నీ అమెరికా 
పయనంతోనే కరుగు
బ్రతుకుతెరువంటూ నువ్వక్కడ
గుండె బరువుతో వారిక్కడ
మొదట్లోరోజూ ఓవాట్సప్ కాలు
రెండ్రోజులకో వీడియో ఫోను
పోను పోను కొంత విరామం
ఏంట్రా అంటే వర్కులోడు
అప్పటికే  నిద్ర లేచి ఉంటాడు 
నీలో ఓ మాయలోడు
అక్కడ కొనుక్కున్న కొత్త కారుతో నీ ఫొటో పోజు
ఇక్కడ డొక్కు స్కూటర్ తో
తంటాలే నాన్నకి ప్రతిరోజు
ఈలోగా అన్నీ బాగుంటే 
పెద్దలు కుదిర్చిన పెళ్లి
లేదంటే అక్కడే 
ఓ భామతో మేరేజ్
ఆలికి కడుపో కాలో వస్తే
ఆయాగా అమ్మకి వీసా
నాన్నకి నేను డబ్బులు పంపుతాలే అని భరోసా
ఎంత అమ్మయినా
నీ పిల్లలకు నాన్నమ్మయినా
ఆమె నాన్నకు భార్య
అక్కడ పెద్దాయన 
రోజూ చెయ్యి కాల్చుకుంటున్నాడేమోనని
ఒకటే బెంగ
ఆ దంపతులను 
అలా వేరుగా ఉంచి 
మీ జంట మాత్రం
టింగురంగ
మొత్తానికి అలా అమ్మ అవసరం 
కొంత తీరాక
అప్పుడిక ఆమె ఉంటే బరువు
ఈలోగా ముగుస్తుంది 
ఆమె వీసా గడువు
ఆమె చేతిలో టికెట్
నాన్నకిమ్మంటూ 
ఓ గిఫ్టు పేకెట్
ఇటు నిన్ను వదలి వెళ్ళలేక
అటు భర్తని విడిచి ఉండలేక
చెమ్మగిల్లిన కళ్ళతో
విమానం ఎక్కిన అమ్మకి తెలియదు 
అదే చివరి చూపని
ఊరెళ్ళాక కమ్మేసిన జబ్బు
నీళ్లలా ఖర్చయ్యే డబ్బు
నువ్వు పంపుతావేమో
కాని ఆ వయసులో 
నాన్నకు శ్రమ
నువ్వు వస్తావని అమ్మకి భ్రమ
వచ్చే ప్రాణం పోయే ప్రాణం
చివరకు అనివార్యమయ్యే మరణం
వాడు వస్తున్నాడా ఏమంటున్నాడు
ఊపిరి వదిలే వరకు అదే ప్రశ్నతో అమ్మ
నిర్జీవమైన ఆ కళ్ళలో నీ బొమ్మ
కొరివి పెట్టాల్సిన 
నువ్వు సీమలో
నాన్న కర్మ చేస్తుంటే 
ఖర్మ కాలి చూసేస్తావు లైవ్ లో
అస్తికల నిమజ్జనం అంటూ 
నాన్న కాశీకి పయనం
అంత శ్రమ ఎందుకు
పక్కనే ఉంది కదా 
గోదారని నీ అనునయం 
ఇప్పుడిక నాన్న కథ
ఉన్న ఊరు
కట్టుకున్న ఇల్లు
ముఖ్యంగా ఆ ఇంట్లో 
అమ్మ జ్ఞాపకాలు 
వదిలి రాలేక
ఒంటరి బ్రతుకు ఈడ్వలేక
కష్టాలకు ఓర్వలేక
ఓ రోజున 
ఆయన కధా కంచికి
ఈసారి వస్తావు
కొరివి పెట్టి
ఊళ్ళో ఇల్లు అమ్మేసి
ఉన్న ఊరు, కన్న తల్లి
అన్నిటితో రుణం తెంచుకుని 
నేను ఎన్నారై
మిగిలినవన్నీ 
జాన్తా నై
అంటూ
పుట్టిన గడ్డను వదిలి
పెట్టిన గడ్డకు శాశ్వతంగా వలస
ఇదే కదా చాలామంది వరస.!!

No comments:

Post a Comment