*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝యయాతి సంతతి కథ: కామం, క్రోధం, పగ - తరం నుంచి తరానికి ప్రవహించిన ఇతివృత్తం. ముఖ్యంగా ఇద్దరు స్నేహితులు - ద్రుపదుడు, ద్రోణుడు. అందులో ఒకరివల్ల మరొకరుపొందిన అవమానం, తిరిగి అశ్వత్థామ పాండవ సంతతిని మట్టుబెట్టడందాకా కొనసాగింది. పగ మనిషినుంచి మనిషికీ, తరం నుంచి తరానికీ ప్రయాణిస్తూనే ఉంటుంది.
❤️నిన్నెవరో గాయపరుస్తారు, నీ నిమిత్తం లేకుండానే. నువ్వు మరొకబలహీనుణ్ణెవరినో గాయపరిచేదాకా నీకు మనశ్శాంతి ఉండదు. అప్పుడు వాళ్ళు మరొకరిని. ఈ ప్రతీకారచక్రాన్ని తుంచాలంటే ఎవరో ఒకరు ఆ గాయాన్ని సహించగలగాలి, ఆ పగని మింగగలగాలి. నిప్పులాంటి ఆ పగని ద్రౌపది మింగగలిగాక కానీ భారత “రణకథ” పూర్తి కాలేదు.
💖ఒక ఎపిక్ నెరేటివ్ గా మహాభారతం ఆద్యంతం అద్భుతం, విస్మయకారకం. కథాకథనంలో ఎన్నిరకాల టెక్నిక్స్ ని వాడవచ్చో అన్నీ మహాభారత కథకుడు ఉపయోగించాడు. ఒక కావ్యంగా భారతసౌందర్యం వనపర్వమంతా పరచుకుని ఉంది. నలదమయంతుల కథ, సావిత్రీసత్యవంతుల కథ, ఋష్యశృంగుడి కథ, హిమాయలవర్ణనలు. ఇంతే అయితే భారతం గొప్ప నెరేటివ్ గా మాత్రమే మిగిలిపోయుండేది. ఆ రచన ప్రాశస్త్యం, ఆ కథని ఆసరాచేసుకుని తన కాలానికి తగ్గట్టుగా ఒకవైపూ, కాలాతీతంగా మరొకవైపూ జీవనపరమార్థ మూల్యాంకనం చేపట్టడంలో ఉంది.
💓గొప్ప సాహిత్యం ఏదైనా ఒక వైపు తన కాలపు milieu బట్టి యుగధర్మాన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే మరొకవైపు అది మాత్రమే సత్యం కాదనీ, మనిషి తన జీవితాన్ని సత్యంగా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే తత్కాలీన ధర్మాన్ని దాటి ముందుకు చూడాలనీ చెప్తుంది.
💕మహాభారతంలో ఇది మూడుపొరల్లో కనిపించింది. మొదటి పొర - బాహ్యావరణలో మహాభారతం వర్ణాశ్రమధర్మం గురించి మరీమరీ చెబుతుంది. అరణ్యపర్వంలో హనుమంతుడు భీముడితో యుగలక్షణాలు చెప్తూ కృతయుగంలో యజ్ఞాలు లేవుగానీ, వర్ణాశ్రమధర్మం ఉంది అంటాడు. భారతం పదేపదే మాట్లాడిన ఏకైక అంశం, బ్రాహ్మణ, క్షత్రియుల్లో బ్రాహ్మణుడికే పెద్దపీట వెయ్యాలనేది. అలా అదొక నిర్దిష్టకాలానికి చెందిన యుగవిశ్వాన్ని, మనుధర్మాన్ని పూర్తిగా ప్రతిపాదించిన రచన. ఈనాటి సమాజానికి ఆ వాదనే ఎంతో అనవసరంగానూ, అర్థరహితంగానూ, కొన్నిసార్లు అమానుషంగానూ కనిపిస్తుంది. భారతంలో విశేషమేమిటంటే, బ్రాహ్మణాధిక్యత గురించి చెప్పవలసినంతగా నొక్కి చెప్పాక ‘ఎవరు నిజమైన బ్రాహ్మణుడు?’ అనే ప్రశ్నను లేవనెత్తుతూనే ఆలోచనాత్మకమైన పలు వ్యాఖ్యానాల్ని ఇస్తుంది.
💞అన్నింటిలోనూ గొప్ప సమాధానం యుధిష్టిర-నహుష సంవాదంలో కనిపిస్తుంది. ఎవరు బ్రాహ్మణుడని నహుషుడు అడిగినదానికి జవాబుగా యుధిష్టిరుడు ‘ఎవరిలో సత్యం, దానగుణం, ఓర్పు, సత్ప్రవర్తన, అక్రూరం, తపస్సు, దయ కనబడుతూ ఉన్నాయో అతడే బ్రాహ్మణుడు’ అని చెప్పాడు. అందుకు నహుషుడు ‘ఈ గుణాలన్నీ నాలుగువర్ణాలకూ అవసరమే కదా. ఒక్క బ్రాహ్మణుడికే ప్రత్యేక గుణాలుగా ఎలా చెప్తావు?’ అన్నాడు. అందుకు ధర్మరాజు చాలా స్పష్టంగా జవాబిచ్చాడు: ‘ఒకవేళ ఈ గుణాలు శూద్రుడిలో కనబడితే అతడు శూద్రుడు కాడు, బ్రాహ్మణుడు. ఇవి బ్రాహ్మణుడిలో కనబడకపోతే అతడు బ్రాహ్మణుడు కాడు, శూద్రుడే’ అని అన్నాడు.
💖ఇదంతా భారతబాహ్యావరణ మాత్రమే. భారతకారుడి దృష్టి ఇక్కడ లేదు, రెండవ ఆవరణలో అతడు వేదార్థమీమాంస చేపట్టాడు. ముఖ్యంగా వేదాలకు ఆధారస్తంభమైన యజ్ఞవిచారణ భారతమీమాంస. వేదాలు మాట్లాడిన యజ్ఞాన్ని బ్రాహ్మణాలు బాహ్య క్రతువుగానూ, ఉపనిషత్తులు అంత:విచారణగానూ భావించాయి. భారతం ఆ రెండు మార్గాల్లోనూ యజ్ఞాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. భారతంలో సంభవించిన ప్రతి బాహ్యయజ్ఞమూ అసంపూర్తిగా ముగిసిపోయిందే. యుద్ధం తర్వాత ధర్మరాజుచేపట్టిన అశ్వమేధమొక్కటీ సంపూర్ణంగా ముగిసిందనుకున్నా అది కూడా చివరికి ఒక ముంగిస నోట అపహాస్యం పాలుకాక తప్పలేదు. శస్త్రయజ్ఞంగా భావించదగిన కురుక్షేత్రం కూడా అశ్వత్థామ అస్త్రప్రయోగంతో విషాదకరమైన ముగింపుకి లోనుకాక తప్పలేదు. తన కాలంనాటి బాహ్యయజ్ఞాల్ని ఇలా వ్యంజనాపూర్వకంగా విమర్శిస్తూ మహాభారతం నిజమైన యజ్ఞమేదని ప్రశ్నిస్తూ పోయింది. ఈ ప్రశ్న భారతం పొడుగునా పరుచుకుని ఉంది. వన, శాంతి, అనుశాసన పర్వాలంతటా యజ్ఞమీమాంసనే ప్రతిధ్వనిస్తూ ఉంది. రకరకాల తావుల్లో వివిధరీతుల్లో యజ్ఞం గురించి చేయవలసినంత విచారణ చేసి యజ్ఞసారాంశాన్ని భారతం మొత్తం మూడు మాటల్లో కుదించింది. అవి దానం, సత్యం, తపస్సు. అందులో అన్నిటికన్నా దానం గొప్ప యజ్ఞమని పదేపదే చెప్తుంది. ‘త్యాగేనైకేనేవ అమృతత్వ మానశు:’ అని ఉపనిషత్తు చెప్పినమాటకి వ్యాఖ్యానమది. దానం తరువాతి స్థానం సత్యానికి . ఆ తరువాత తపస్సు. ఇక తక్కిన విలువలన్నీ ఆ మూడింటి తరువాతే.
❤️కాని యజ్ఞానికి కూడా ఒక యుగానికి సంబంధించిన ప్రాసంగికత మాత్రమే ఉంటుందని భారతకారుడికి తెలుసు. యజ్ఞానికి కూడా అతీతమైన మానవజీవన మూల్యం ఏదన్నా ఉందా అన్నదే భారతంలోని మూడవ ఆవరణ, భారతగర్భమది. భారతం యుగాంత కథ. యుగాంతవేళ అన్ని విలువలూ, అన్ని ధర్మాలూ నశించిపోతున్న సమయంలో మానవాళిని కాపాడే ఒకే ఒక్క విలువ ఏదైనా ఉందా?
💖ఆ ప్రశ్నకి జవాబు వెతకడమే భారతాన్వేషణ. దాన్ని వ్యాసుడు యుధిష్ఠిరుడి రూపంలో వెతకడానికి ప్రయత్నించాడు. యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడేవాడని అర్థం. కాని భారతకథలో ధర్మరాజు ఎక్కడా నిలకడగా యుద్ధం చేసినట్టు కనబడకపోగా, ఒకసారి యుద్ధభూమి నుంచి పారిపోయాడు కూడా. అస్త్రవిద్యా సందర్భంలో ద్రోణుడు అతణ్ణి పక్షినేత్రం కనిపిస్తున్నదా అంటే, నేత్రం మాత్రమే కాదు, పక్షి, చెట్టు సమస్తం కనిపిస్తున్నాయన్నాడు. ఒక వీరుడిగా అతడు ఉత్తీర్ణుడు కాకపోవడానికి అంతకుమించిన అనర్హత ఏముంటుంది? కాని ఒకడు యుధిష్ఠిరుడు కావడానికి అంతకన్నా గొప్ప అర్హత కూడా మరేమీ లేదు. ఎందుకంటే అతడు చేసిన యుద్ధం అంతర్యుద్ధం.
💖రెండు అంతర్యుద్ధాలు భారతంలో సంభవించాయి. ఒకటి ధృతరాష్ట్రుడి అంతరంగంలో, మరొకటి ధర్మరాజు అంతరంగంలో. ఈ యుద్ధం స్వర్గారోహణ పర్వందాకా కొనసాగింది. ధృతరాష్ట్రుడు అంతర్యుద్ధంలోనూ, బాహ్య యుద్ధంలోనూ ఓడిపోయాడు.
💞యుధిష్టిరుడి అంతస్సంగ్రామాన్ని భారతకారుడు మూడు సన్నివేశాల్లో పట్టుకున్నాడు. మొదటిది, అరణ్యపర్వంలో యక్షుడితో జరిగిన సంవాదం. రెండవది స్వర్గారోహణ పర్వంలో తనకోసం దేవరథం వచ్చినప్పుడు తన కుక్కకు కూడా చోటిస్తేనే తాను స్వర్గంలో అడుగుపెడతానని చెప్పడం. మూడవది, నరకంలో క్షణమాత్రం నిల్చున్నపుడు తన తమ్ముళ్ళు, భార్యతో పాటు కర్ణుడు కూడా ఆ నరకబాధ పడుతుండగా వారిని వదిలిపెట్టి నరకంనుంచి బయటపడటానికి నిరాకరించడం.
💕మొదటి సన్నివేశంలో అతడు కుంతి కొడుకుల్ని కాక మాద్రి కొడుకుల్లో ఒకరిని బతికించమని అడిగినప్పుడే ధృతరాష్ట్ర భావజాలాన్ని జయించేసాడు. తాను జూదంలో తమ్ముళ్ళని పణం పెట్టినప్పుడు ముందు మాద్రి కొడుకుల్ని పణం పెట్టాడన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఇంద్రప్రస్థం నాటి ధర్మరాజు కామ్యకవనానికి వచ్చేటప్పటికి ఎంతమారాడో మనకి అర్థమవుతుంది.ఈ వివేకం వెనక అతడు వనవాసకాలంలో వివిధ ఋషులద్వారా విన్న కథలసారాంశమంతా ఉంది.
💓ఇక కుక్క కోసం పట్టుబట్టినప్పుడు, ఆ సహానుభూతి మనుషులకి మాత్రమే పరిమితంకాకుండా ప్రాణికోటికంతటికీ విస్తరించడం కనబడుతుంది. అసలు భారతకథ మొదలైనప్పుడే సర్పయాగం సమయంలో జనమేజయుడి తమ్ముళ్ళు అకారణంగా ఒక కుక్కని కొట్టినప్పుడు దేవలోక శుని ‘ఏ రాజులు బీదలని, సాధువుల్ని, బలహీనుల్ని హింసిస్తారో వాళ్ళకి అనుకోని అనర్థాలు సంప్రాప్తిస్తాయి’ అని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, కథకుడు భారత కథని ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాడో అర్థమవుతుంది.
💕నరకలోకంలో కర్ణుడి గురించి వేదనచెందినప్పేటప్పటికి అతడు శత్రు-మిత్రభావానికి పూర్తిగా అతీతుడు కాగలిగాడు. ఈ మన:స్థితికి చేరడానికి శాంతి, అనుశాసనపర్వాల్లో అతడికి లభించిన హితబోధ ప్రధానకారణంగా కనిపిస్తుంది.
💞చివరికి మహాభారతం చెప్తున్నదేమిటి? తన కాలం నాటి వర్ణాశ్రమధర్మాన్ని ప్రస్తుతిస్తూనే దాన్ని దాటి చూడమంటున్నది. తనముందు వేదాలు నియమించిన యజ్ఞాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే బాహ్యయజ్ఞం కన్నా దానం, సత్యం,తపస్సు గొప్పయజ్ఞాలంది. చివరికి అన్నిటికన్నా కూడా శత్రు-మిత్ర భావాన్ని దాటి తోటిప్రాణికోసం నరకాన్ని అనుభవించడాకైనా సిద్ధపడటమే నిజమైన పురుషార్థమని ప్రబోధించింది.
💖విజయమంటే బాహ్యప్రపంచంలో సంభవించేది. జయం అలా కాదు. అది మనిషి తన అంతరంగంలో సాధించేది. మనసుతో మనసుని జయించడం. జయం భారతంగా, మహాభారతంగా మారినా కూడా మళ్ళా జయకావ్యంగానే మనముందు నిలబడుతోంది.
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment