Thursday, September 26, 2024

 *ఆదిశక్తి యొక్క లీలాకథలు*
*5.భాగము*

*కవచ సాధనతో సంపూర్ణ ఫలితం*

ఆదిశక్తి అద్భుతగాథలో ఎంత భక్తి మాధుర్యమున్నదో అంతే ఆధ్యాత్మిక రహస్యమయత ఉంది. వేదమయి శ్రీదుర్గాసప్తశతి యొక్క ప్రతిఒక్క మంత్రం ఈ రహస్యమైన లోతైన భావాలతో నిండివున్నది. 

అంతేకాక విస్తృతమైన వేదాంత సంబంధమైన మరియు ఆధ్యాత్మికమైన అర్థాలు కూడా వీటిలో ఉన్నాయి. 

దుర్గాసప్తశతి పారాయణ క్రమంలో శ్రీదేవీకవచము, అర్థశాస్తోత్రం, కీలకం, ప్రాధానిక రహస్యం, వైకృతిక రహస్యం, మూర్తి రహస్యం అనే ఆరు అంగాలు ఉంటాయి. 

ఈ ఆరు అంగాలలో అన్నింటికంటే మొదటి అంగం కవచం. పరమపూజ్య గురుదేవులు గాయత్రీ మహావిజ్ఞానంలో కవచం యొక్క గొప్ప మహిమని తెలియజేస్తూ ఇలా అన్నారు. 

'కవచం యొక్క అర్థం మూయుట లేక మూత. దేనితోనైనా మనలను మనం కప్పుకుంటే, దానిని కవచం అంటారు. 

యుద్ధసమయంలో యోధులు ఒక ప్రత్యేకమైన కవచమును ధరిస్తారు. అప్పుడు ఇతరుల కొట్టిన దెబ్బల నుండి ఆ కవచం రక్షిస్తుంది. కవచం పని రక్షించుట. రక్షించే ప్రతి వస్తువును కవచం అని చెప్పవచ్చు.

యుగఋషి కవచం యొక్క మంత్రపరమైన ఆధ్యాత్మిక తత్త్వాలను స్పష్టపరుస్తూ ఇంకా ఇలా చెప్పారు. ' అదేవిధంగా ఆధ్యాత్మికశక్తి సంపన్నమైన ఇలాంటి దైవీ కవచాలు కూడా ఉంటాయి. 

కవచము వలన మనకు రక్షణ కలుగుతుంది. మంత్రశక్తి, కర్మకాండ, శ్రద్ధలతో కలుపబడిన ఆధ్యాత్మిక కవచమును ధరించుట వలన శరీరము మనస్సులకు కీడును కలిగించే ఏవిధమైన ఆక్రమణ జరుగదు'. 

వేదమూర్తి గురుదేవుల వాక్కు వేదవాక్కు కనుక గురుదేవుల ద్వారా చెప్పబడిన ఈ విషయాలు చదువదగినవి, ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి. 

శాస్త్ర గ్రంథాలలో ప్రతివొక్క దేవీదేవతకు వేరువేరు కవచాలు చెప్పబడ్డాయి. వీటికి అసాధారణమైన సాధనా విధానం మరియు సర్వశ్రేష్ఠమైన ఫలశృతి ఉంది. దీనిని ఉపాసకులు, ఆరాధకులు అనాదిగా అనుభూతి చెందుతున్నారు.

తల్లి ఆదిశక్తి విభిన్నమైన పేర్లు మరియు వాటిలో ఇమిడివున్న రహస్యమైన ఆధ్యాత్మిక శక్తులను జ్ఞప్తికి తెచ్చే 'దేవీ కవచం' దైవికమైనదేకాక, తిరుగులేనిది, అత్యంత శ్రేష్ఠమైనది. 

దీని ప్రభావం సాటిలేనిది. 
ఈ కవచాన్ని అందరూ సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. స్వప్రయోజనానికే కాక, సర్వహితార్థమునకు కూడా 
ఈ కవచసాధన సాటిలేనిది. 

మార్కండేయ ఋషి ప్రార్థించినమీదట బ్రహ్మదేవుడు ప్రజల మేలు కొరకు, సర్వహితార్థము దీనిని వెల్లడిచేశాడనీ దుర్గాసప్తశతి కవచపు పూర్వపీఠిక ద్వారా స్పష్టమౌతున్నది. 

ఈ కవచము 'చండీ కవచం' అనే పేరుతో ఉపయోగించ బడుతుంది. అజ్ఞానాంధ కారాలను నశింపజేసే దీని ఛందస్సు అనుష్టుప్, దేవత చాముండ. దీని ఋషి స్వయంగా బ్రహ్మ.

భావనామయియైన భగవతిమీద, ఆమె విభిన్న నామ రూపాల మీద భక్తిపూర్వకమైన ధ్యానమే 
ఈ కవచ సాధనకు ప్రాణం. 

బ్రహ్మాండ చైతన్యంలో
వ్యాపించిన అద్భుతమైన ఆధ్యాత్మికశక్తులను సాధకుని అస్తిత్వంవైపు ఆకర్షించే భక్తిపూర్ణమైన ధ్యానం మహాశక్తిశాలీ, సూదంటుతాయి. 

ఇది సాధకుని వివిధ అవయవాలలో శక్తిని ప్రతిష్ఠిస్తుంది. తద్వారా ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి కీడు ఎలాంటి ఆపద ఎప్పుడూకూడా ఛేదించలేని విధంగా ఈ కవచము నిర్మించబడుతుంది. 

సాధనయొక్క ప్రాణం భావపూరితమైన భక్తి, అపారమైన శ్రద్ధ, దృఢమైన నమ్మకం మరియు చలించని విశ్వాసమే అని అనేకమంది సాధకుల అనుభవం ద్వారా నిరూపించబడినది. 

ఏ సాధకుల వద్ద ఈ అత్యంత విలువైన ఈ ఆధ్యాత్మిక పెట్టుబడి ఉందో వారు తల్లి ఆదిశక్తి సహజమైన కృపాకవచంతో స్వయంగానే సురక్షితులై జీవిస్తువుంటారు.

దివ్యమైన ఈ దేవీ కవచ పారాయణకు నాలుగు ప్రకరణములున్నాయి. దీని మొదటి ప్రకరణములో ప్రథమ పీఠికా మరియు భగవతి నవదుర్గ తొమ్మిది రూపాల చర్చ ఉంది. 

తొమ్మిది రూపాలలో మొదటిది శైలపుత్రీ, రెండవది బ్రహ్మచారిణీ, మూడవది చంద్రఘంటా, నాల్గవది కూష్మాండా, ఐదవది స్కందమాతా, ఆరవది కాత్యాయనీ, ఏడవది కాళరాత్రి, ఎనిమిదవది మహాగౌరి మరియు తొమ్మిదవది సిద్ధిదాత్రి. 

తంత్రసాధన, యోగసాధన దృష్టితో దేవి తొమ్మిదిరూపాలు ఏడు చక్రాలు మరియు రెండు విశిష్టమైన చక్రాల అధిష్ఠానదేవతా శక్తుల రూపాలు. 

వీటి సాధన మరియు ధ్యానంతో ఈ చక్రాల ఆధ్యాత్మికశక్తులు, విభూతులు వెల్లడవుతాయి. ఈ చర్చ రహస్యమయమైనది, 

అత్యంత గోపనీయమైనది కనుక ఇక్కడ దీని సంకేత వివరణమాత్రమే వెల్లడిచేయ బడుతోంది. అర్హత పొందిన వారికి సాధన ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వయంగా ప్రసాదిస్తుంది.

రెండవ ప్రకరణములో తల్లి జగదంబ విభిన్న స్వరూపాల వివేచన ఉంది. ఈ వివేచనను సంక్షిప్తమైన సాంకేతిక ధ్యానవిధానంగా కూడా చెబుతారు. 

ప్రేతాసనా, చాముండా, మహిషవాహినీ, వారాహీ, ఐరావత ఏనుగుమీద కూర్చున్న ఐంద్రీ. వృషభం మీద కూర్చున్న మాహేశ్వరీ, మయూరం మీద కూర్చున్న కౌమారీ, గరుడాసనా వైష్ణవీ, కమలాసనా లక్ష్మీ, వృషభం మీద ఆసీనురాలైన ఈశ్వరీ, 

హంసవాహినీ బ్రాహ్మీ, రథంమీద ఆసీనురాలైన భగవతి ఈ పలు రూపాలు ఎల్లప్పుడూ భక్త రక్షణ చేస్తూవుంటాయి. 

వీటన్నిటి ధ్యానం సర్వసౌభాగ్యాలనూ ప్రసాదిస్తుంది. ఈ ధ్యానంతో అన్ని ఆపదలు క్షీణిస్తాయి. సాధకునికి రక్షణ
కలుగుతుంది.తన కవచ సాధన క్రమంలో సాధకుడు మాత ఆదిశక్తి మూల రూపాన్ని (గాయత్రి స్వరూపాన్ని) స్మరించుకుంటూనే వాటి వివిధ శక్తులను ధారణచేసే దేవియొక్క దైవీస్వరూపాలను వివేచన చేస్తూవుండాలి.

మూడవ ప్రకరణంలో కవచ ధారణ ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ సులువుగా ఉంటూనే సాధకుని నుండి భక్తిపారవశ్యం, మానసిక ఏకాగ్రతను కోరుతుంది. 

అంతేకాక దీనిలో తెలియజేయబడినవున్న వివిధ అంశాలు ఆ అసాధారణ శక్తులను ధారణ చేసే ఉపదేశాన్నీ ఇస్తూవుంటాయి. 

ఈ సందర్భంలో గుర్తుంచు కొనవలసిన విషయం ఏమిటంటే కవచసాధన కేవలం శబ్దాచ్చారణ వరకు మాత్రమే పరిమితం కాదు. దీనిలో ధ్యానసాధన యొక్క శ్రేష్ఠమైన విధానం కూడా ఉంది.

కవచసాధన ఇచ్చే సత్ఫలితం నాల్గవ ప్రకరణములో తెలియజేయబడినది. ఎవరు తన హృదయంలో కవచాన్ని స్థిరపరచుకున్నాడో అతను కవచ సాధనను తన ధ్యానసాధనగా రూపొందించుకున్నాడు అని తెలుసుకోవాలి. 

ఈ ధ్యానమును చేసినవారు అన్ని రకాల రోగాలు, వ్యాధులు, జీవితంలో కీడును కలిగించే అన్ని లోకాల ప్రాణుల నుండి, గ్రహాలు, భూత, పిశాచ, బ్రహ్మరాక్షసుల బాధల నుండి విముక్తి పొందుతారు. 

అంతేకాక భైరవుడు లాంటి ఉపదేవతలు మరియు ఆపదలను కలిగించే అన్ని శక్తులూ నశించిపోయి చివరకు సత్ఫలితమును పొందుతారు. 

ఏ సాధకుని హృదయంలో 
ఈ కవచం ఉంటుందో - నశ్యన్తి దర్శనాత్తస్య కవచే హృది - సంస్థితే పైన చెప్పిన రకరకాల బాధలు, ఆపదలు అలాంటి సాధకుడిని దర్శించినంత మాత్రముననే నశించిపోతాయి.

ఈ కవచ సాధనతో కేవలం దురదృష్టాలు నశించిపోవటమే కాక, పలు అదృష్టాలు, మంచి ఫలితములు కూడా ప్రాప్తిస్తాయి అని ఋషులు తెలియజేశారు. 

యశసా వర్థతె సో-పి కీర్తిమణ్ణితభూతలే - అనగా కవచ సాధనను చేసే మానవుడు. భూమిమీద తన కీర్తితో శోభించుటయేకాక సమృద్ధిని కూడా పొందుతాడు. 

అంతేకాదు. ఈ కవచసాధన సాధకుడిని ఆధ్యాత్మిక శిఖరాగ్రమునకు చేర్చి అతనిని అన్ని బంధనాలనుండి విముక్తుడిని చేసి శివుని సాహచర్యాన్ని ప్రసాదిస్తుంది. 

కవచసాధన వలన లాభాలు అనేకం. వీటిని ఏ సాధకుడైనా కూడా తన సహజమైన సాధనాక్రమంలో అనుభూతి చెందగలడు.

కవచ సాధన వలన పైన చెప్పిన సత్ఫలితాలే కాక మనోరోగాల నిర్మూలన అనే మరో దివ్యసాధనానుభూతి కూడా సాధకులకు కలుగుతుంది. 

కవచసాధన అన్నిరకాల మనోరోగాల నిర్మూలనలో అసాధారణమైన ప్రభావం చూపిస్తుంది అనేది అనేకమంది సాధకుల అనుభవం. 

స్వచ్ఛమైన నేతి దీపాన్ని వెలిగించి, భగవతి యొక్క చిత్రపటం లేక గాయత్రిమాత చిత్రపటం ఎదురుగా కూర్చుని పవిత్రోచ్చారణ సహితంగా కవచ పఠనం చేయుట వలన అన్నిరకాల దురాలోచనలు, మనోరోగాలు నశించిపోతాయి. 

రోగి స్వయంగా దీనిని పఠించుటలో అసమర్థుడైతే అతని బంధువులు రోగి పేరుతో సంకల్పాన్ని చేసి భగవతి కృప మరియు కరుణాదృష్టిని తలచుకుంటూ ఈ క్రమాన్ని పూర్తిచేసి సత్ఫలితాలను పొందవచ్చు.

 *శ్రీ మాత్రే నమః*

No comments:

Post a Comment