Sunday, September 29, 2024

 Vedantha panchadasi:
అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందమితి ద్విధా ౹
కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్ ౹౹49౹౹

జీవసృష్టి  అగు అశాస్త్రీయద్వైతము తీవ్రము మందము అని రెండు విధములు.అందు కామక్రోధాలు కల్పించునది తీవ్రము,పగటికలలు కల్పించునది మందము.

ఉభయం తత్త్వబోధాత్ ప్రాఙ్నివార్యం బోధసిద్ధయే ౹
శమః సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః ౹౹50౹౹

50.ఇవి రెండూ తత్త్వబోధకై ప్రయత్నించుటకు పూర్వమే పరిత్యజింపవలెను.బోధసిద్ధికి శాంతస్వభావము ఏకాగ్రత సాధనములుగ చెప్పబడినవి.అశాస్త్రీయ ద్వైతమును వదలనిచో ఈసాధనములు సిద్ధింపవు.

ఆకాశము నీలముగా ఉన్నదని అందురు.ఆ నీలివర్ణము కేవలము నేత్రభ్రాంతియేగాని వాస్తవముగాదు.
అట్లే ప్రపంచ దర్శనముగూడ భ్రమయే.దీనికి మూలమయిన అవిద్యావాసనను పూర్తిగా నశింపజేసికొని మరల గుర్తుకు రాని విధముగా ఈ భ్రమను మరచుటయే అత్యుత్తమము.

ప్రపంచదర్శనము అసత్యమనీ నమ్మకము కలుగనంతవరకు వ్యక్తికి దుఃఖవిముక్తిగానీ నిజరూపజ్ఞానముగానీ కల్గుట అసంభవము.

జీవసృష్టి అగు అశాస్త్రీయద్వైతము తీవ్రము,మందముఅను రెండు విధములు.కామక్రోధాదులను కల్పించునది తీవ్రమని,పగటికలల కల్పించునది మందమని శాస్త్రవాక్యము.

వీటిని తత్వమార్గ ప్రారంభపూర్వమే విడవవలెను.
శాంతస్వభావము,ఏకాగ్రత వున్న వారికి మాత్రమే శాస్త్రం,గురువులు చెప్పే  ఈ తత్త్వబోధ ముత్యపుచిప్పలో పడిన నీటిచుక్క ముత్యమైనరీతిగా ఉపయోగపడుతుంది.

కామక్రోధాదులకు,పగటికలలకు ఈ ప్రాపంచిక సుఖమేగా కారణం.

ఈ ప్రాపంచిక సుఖమనగా ఏమి?
అపారమైన సంసారమే కదా!
జనులు మరణించుటకై పుట్టుదురు,పుట్టుటకై మరణింతురు.జనన మరణ రూపమయిన సంసారమునందు సుఖమన్నది నామమాత్రమే.

సంబంధము లేనివ్యక్తులు కలియుదురు.ఇక మనస్సు వారి మధ్య మాయతో సంబంధమును కల్పించును.

ఈ ప్రపంచమందు ప్రతి విషయము మనస్సుమీద,వ్యక్తి యొక్క మానసిక స్థితిమీద ఆధారపడి యుండును.

ఈ సంసారసాగరమును దాటుటకై మానవుడు శాశ్వతము, అవ్యయమునయిన దానిని ఆశ్రయింపవలెను.

సుఖ,దుఃఖములు ఒక దానిని మరొకటి అనుసరించుచు నశింపజేసికొనునని  వివేకముతో గ్రహించిన వానికి ఆత్మనిగ్రహము,శాంతి యుండును. ఇది తెలిసికొననివాడు మండుచున్న ఇంటిలో నిద్రించుచున్నవాడే.ఇట్టి ద్వైతములను వదలనిచో వానికి ఏసాధనలు సిద్ధింపవు.

సంతోష,కోపములను గలిగించు పరిస్థితులలో ఉన్నప్పటికి సంతోషింపక,కోపింపక నిద్రించువానివలె చింతారహితుడయి ఉండువాడే ఆత్మనిగ్రహము  గలవాడు.

ఎవని మనస్సు శాశ్వత తత్త్వములో విశ్రమించుటవలన సంపూర్ణముగా ఆత్మనిగ్రహము కలదయి ప్రశాంతమగునో అట్టివాడే మానవులలో అత్యుత్తముడు.   

No comments:

Post a Comment