Friday, September 27, 2024

 గాన రామాయణం

భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. ఆ గాథను పాడుకోవడానికి వీలుగా ఆధ్యాత్మ రామాయణం పేరుతో కీర్తనలను రచించి మనకు అందించారు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి.

శ్రీరామ తత్వాన్ని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. అయినా వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ఆధ్యాత్మిక రామాయణం పేరుతో అందించినంత స్పష్టంగా మరే ఇతర రామాయణాలు లేవు. ఈ కథ పార్వతీ పరమేశ్వరుల సంవాద రూపంలో ఇంచుమించు వేల శ్లోకాల్లో ఉంది. నాలుగు రాముడు పరమాత్మ స్వరూపమైనప్పటికీ మామూలు మానవుడిగా లోక వ్యవ హారమనే మాయలో చిక్కుకున్నాడు. అయినప్పటికీ ఆత్మజ్ఞానం కలిగి దుష్ట సంహారం చేసినవాడని నిరూపించింది ఆధ్యాత్మ రామా యణ గాథ. ఈ కథను అందరూ పాడుకోవడానికి వీలుగా వివిధ రాగాలలో కీర్తనలుగా కూర్చారు సుబ్రహ్మణ్య కవి. సంస్కృతాంధ్ర భాషల్లోను, సంగీత, నాట్య, అలంకార శాస్త్రాల్లోనూ అపార పాండిత్యం కలిగినవారాయన. క్షేత్రయ్య, త్యాగయ్యలకు మధ్యకాలంవారు.
సంస్కృత ఆధ్యాత్మిక రామాయణంలో వాల్మీకి రామాయణంలో లాగానే ఏడు కాండలున్నాయి. కానీ సుబ్రహ్మణ్య కవి రచించిన తెలుగు ఆధ్యాత్మ రామాయణంలో ఆరు కాండలే ఉన్నాయి. వాల్మీకి రామాయణంలో రాముడు సాధారణ మానవుడు. భార్య వియోగానికి దుఃఖిస్తాడు. శత్రువులపై యుద్ధం చేస్తాడు. కానీ ఆధ్యాత్మ రామాయణంలోని రాముడు పరబ్రహ్మ స్వరూపుడు. సీత ఆదిమాయ. ఇందులోని కథంతా లీలానటనం. బాలకాండలో రామావతార తత్వార్థాన్ని శివుడు పార్వతికి వివరించిన సందర్భంలో పదిహేడు కీర్తనలున్నాయి. అయోధ్యకాండలో నారదాగమనం మొదలు దండకారణ్య ప్రస్థానం వరకు తొమ్మిది కీర్తనలున్నాయి. అరణ్యకాండలో ముని ఆశ్రమాల్లో ఆతిథ్యం మొదలు శబరి మోక్షం వరకు పదకొండు, కిష్కింధకాండలో పది కీర్తనలున్నాయి.

సుందరకాండలో సింహిక, లంకిణిల వధ మొదలుకొని హనుమంతుడు లంకను చేరడం, తిరిగి రాముణ్ని చేరి చూడామణిని సీతకు ఇవ్వడం వరకు పది కీర్తనలున్నాయి. ఆపై యుద్ధకాండలో విభీషణ పట్టాభిషేకం అగ్ని ప్రవేశం, అయోధ్యలో తిరిగి పట్టాభిషేకం వరకు అత్యధికంగా నలభై ఏడు. మొత్తం నూట నాలుగు కీర్తనలు. అన్ని కీర్తనలూ అనుప్రాసలతో కూడి ఉంటాయి. శృంగార రసాత్మకమైన విశేషణాలతో ఈశ్వరుడు పార్వతిని సంబోధించి రామకథను వినిపిస్తున్నట్లుగా ఉండే పల్లవులతో ప్రారంభమవుతాయి. 'చేరి వినవే శౌరి చరితము గౌరీ' అంటూ కీర్తనల పల్లవులు మొదలవుతాయి.

వాల్మీకి రామాయణాన్ని పండితులు ఎంతగా గౌరవించారో ఆధ్యాత్మ రామాయణాన్ని సైతం జానపదులు అంతగానే ఆదరించారు. వాగ్గేయకారులు రెండు రామాయణ భావాలను గుదిగుచ్చి కీర్తనలుగా గానం చేశారు. కానీ ఆధ్యాత్మిక రామాయణ కీర్తన గానానికి క్రమంగా ఆదరణ తగ్గింది. మారుమూల గ్రామాల సంకీర్తనాపరుల గొంతుకల్లో మిగిలిన కొద్ది అధ్యాత్మ రామాయణ గానమూ హరించుకుపోతోంది. కాబట్టి ఈ కీర్తనల సంగీతాన్ని ఉద్దరించుకోవడం మన సంగీతాన్ని మనం సంరక్షించుకోవడమే అవుతుంది.

గంటి ఉషాబాల

No comments:

Post a Comment