*భక్తి భావం.....*
*భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందులో భక్తిమార్గం ఒక్కటే సులభసాధనం అంటారు రుషిగణం. భక్తి నిండిన మనసులో భగవంతుడు సదా నివసిస్తాడు. ఆయన భక్తికే వశ్యుడు.*
*కొందరు కేవలం స్వప్రయోజనాల కోసమే భగవంతుణ్ని అర్చిస్తుంటారు. ఇది భక్తి తాలూకు లక్షణం కాదు; అతడు భక్తుడూ కాదు. మరికొందరు పదుగురి దృష్టిని ఆకర్షించుకొని సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందాలన్న ఉద్దేశంతో పూజలు చేస్తుంటారు. ఈ కార్యక్రమాలు కూడా ఆ భక్తి అనిపించుకోవు. ఇంకొందరేమో కష్టకాలంలో " భగవంతుణ్ని తలచుకోవడం, సుఖసమయాన విస్మ " రించడం చేస్తుంటారు. ఇది భక్తుడి లక్షణమే కాదు. భక్తి మనసుకు సంబంధించింది. మనసులో*
*భక్తిభావన కలగడానికి పరిసర వాతావరణంతో పని లేదు. గొప్ప వ్యక్తుల అవసరం అంతకన్నా లేదు. మానసిక ఉన్నతస్థితినే భక్తి అంటారు. భగవద్భక్తి పూర్వజన్మ పుణ్యఫలం వల్లనే* *కలుగుతుందన్నది జ్ఞానుల మాట. పురాణాలు సైతం ఇదే వల్లిస్తున్నాయి. మనసులో భక్తి బీజం మొలకెత్తాలంటే మనసు నిర్మలంగా ఉండాలి. మానసిక స్వచ్ఛత, సదాచారం, సత్ప్రవర్తన, సజ్జన సాంగత్యం- దీనికి ఎంతో దోహదపడతాయి.*
*విపరీతమైన విషయ వాంఛలు, ద్వేషం, అసూయ వంటి చెడ్డ భావాలతో నిండిన హృదయం పాడుపడిన ఇల్లు లాంటిది. మానవుడు కోరికలు తీర్చుకోవడానికి; ఆశలు నెరవేర్చుకోవడానికి తనకు ఇష్టమైన దేవుణ్ని పూజిస్తారన్నది లోక విదితం. ఒకవేళ తన ఆశలు; కోరికలు నెరవేరకపోయాయో భగవంతుణ్ని నిందిస్తాడు, నిరసిస్తాడు. ఆయనపై ద్వేషం పెంచుకొంటాడు. అసలు భగవంతుడనే వాడే లేడని ప్రచారం చేయడానిక్కూడా వెనకాడడు.*
*మనం ఎంత చెమటోడ్చి పనిచేసినా ప్రాప్తం ఉన్నంతవరకే ఫలితం దక్కుతుంది. ఘటం (కుండ) ఎంతో, నీరు అంతే పడుతుంది తప్ప మరిన్ని నీళ్ళు నింపుకోవాలన్నా అందులో పట్టదు. కర్మఫలం అనుసారంగా ధర్మబద్ధమైన కోరికలనే ఆ భగవంతుడు తీరుస్తాడని జ్ఞానులు చెబుతుంటారు. ఆకు, పువ్వు, పండు, నీరు ఈ నాలుగింటిలో భక్తిపూర్వకంగా ఏది సమర్పించినా ఆ అంతర్యామి ప్రీతితో స్వీకరిస్తాడు. రాసులుగా మల్లెపూలు పోసి వాటితో అర్చించినా, ఖరీదైన సామగ్రితో పూజలు చేసినా, రకరకాల పదార్థాలు వండి నివేదించినా, గుళ్ళు గోపురాలు కట్టించినా నిర్మలమైన భక్తిభావం లేకుంటే అవేమీ సత్ఫలితాలు అందివ్వలేవు.*
*ఆత్మ స్వచ్ఛంగా లేకుండా పాటించే ఆచారం సదాచారం కాదు. పరిశుభ్రంగా లేని గిన్నెల్లో వండిన వంటకం ఆరోగ్యాన్ని పంచి పెట్టదు. మనసు స్వచ్ఛత లేకుండా చేసిన భగవంతుని పూజ సైతం వ్యర్థమే అంటాడు యోగి వేమన.*
*పూజకు ఆడంబరాలు, అట్టహా సాలు పనికిరావు. డాంబిక భక్తులకు భగవంతుడు ఎప్పుడూ దూరంగా ఉంటాడు. నిజమైన భక్తుడు తాను బాధల బందిఖానాలో మగ్గుతూ ఉన్నా, కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నా భగవంతుణ్ని నిందించడు. ఆయనపై నమ్మకం వీడడు. దేవుడు మనిషికి బుద్ధిబలం ప్రసాదించాడు. అజ్ఞానానికి సైతం భక్తిభావం కలిగేలా అతడిలో జ్ఞానదీపం వెలిగిస్తాడు. ఇది తెలుసుకొని నిండు మనసుతో దేవుణ్ని ధ్యానిస్తూ అడుగులు ముందుకు వేస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పరమాత్ముడే ఆదుకొంటాడు. మనిషి దేవుణ్ని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన నీడలా అతడి వెన్నంటే ఉంటాడు. అతడి బరువు బాధ్య తలన్నీ ఆయనే మోస్తాడు. భక్తపోతన, అలాగే మొసలి నోట చిక్కిన గజేంద్రుడు ఇందుకు ఉదాహరణలు.*
*భగవద్దర్శనం అందరికీ ప్రాప్తించదు. అనన్య భక్తిపరులకే సాధ్యం అంటారు రామకృష్ణ పరమహంస. వారి మాటలు సర్వులకూ శిరోధార్యం. ఈ అనన్య భక్తి మార్గంలో ఒక్కొక్కమెట్టే అధిగమిస్తూ వెళ్ళే భక్తుడు భగవంతుడికి చేరువవుతాడు. ఆయనలో ఐక్యమైపోతాడు. అంతర్యామి ఉనికి భక్తినిండిన మనసుకే గోచరమవుతుంది తప్ప అన్యులకు సాధ్యపడదు!*
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌳🏹🌳 🙏🕉️🙏 🌳🏹🌳
No comments:
Post a Comment