*మార్గదర్శి.....*
*శ్రీమద్ భగవద్గీత వీక్షకులకు ప్రత్యేకంగా... 15వ రోజు*
*📿🪔📿వీడనితోడు-వాడని మనస్సు📿🪔📿*
*ఆరవ అధ్యాయానికి ఆత్మసంయమ యోగమని పేరు. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. సంయమన మంటే దానిని నిగ్రహించుట. మనస్సుని మన అధీనంలో పెట్టుకుంటే ఎలా మనం బాగుపడతాం, అది మన జీవితాన్ని ఎలా సక్రమంగా నడపటానికి ఉపయోగపడుతుందో భగవానుడు చెప్పాడు. 5వ అధ్యాయంలో, శరీరం కనిపించేది కనుక, దానికి కలిగే కష్టనష్టాలు అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టి కర్తృత్వం శరీరం మీద వదలమన్నాడు. కర్తృత్వం, ఫలితం, లాభనష్టాలు శరీరానికే కాని మనకి కావని తెలిపాడు. ఉదాII నిప్పును ముట్టుకుంటే కాలేది శరీరమే కదా! మంచును ముట్టు కున్నా చల్లబడేది శరీరమేకదా! కర్తృత్వం శరీరంమీద పెట్టి సంగత్యాగం చేయమని చెప్పాడు. ఆ అధ్యాయంలోనే కర్తృత్వం మొదట శరీరంమీద వదలిపెట్టమని చెప్పాడు. ఆ తర్వాత కర్మాచరణకి సంకల్పం* *చేసేది, జ్ఞానప్రసారం జరిగేది ఆత్మవలనే కనుక లోపల ఉన్న ఆత్మకే కరృత్వం అని చెప్పాడు. ఆ ఆత్మకి కూడ లోపలఉండి. నియమించే తనయందే కర్తృత్వం వదలిపెట్టాలని, ఫలితంకూడా తనకే అర్పించాలని చెప్పాడు. అలా సాధన చేయాలంటే మనస్సు స్వాధీనం కావాలి. అది ఎలానో ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.*
*ఆత్మ చేత ఆత్మను బాగుచేసుకోండి. ఆత్మని నాశనం చేసుకోవద్దు. ఆత్మే ఆత్మకు బంధువు, ఆత్మే ఆత్మకు శత్రువు. ఇలా శ్లోకంయొక్క పై పై భావాన్ని గమనిస్తే చాలా Confusingగా ఉండొచ్చు. కానీ, జాగ్రత్తగా అర్థం తెలుసుకోవాలి. ఒకే శబ్దానికి అనేక అర్థాలు ఉండచ్చు. అసలు ఆత్మ అంటే వ్యాపించేది అని అర్థం. అలా అయితే ఒడ్డుపొడువు కలిగి వ్యాపించివుంటుంది కనుక శరీరాన్ని 'ఆత్మ' అనవచ్చు. ఆ శరీర మంతా వ్యాపించిన జ్ఞానాన్ని 'ఆత్మ' అనవచ్చు. ఆ జ్ఞానాన్ని ప్రసరింపచేసే మనసునీ 'ఆత్మ' అనవచ్చు. విభువంత జ్ఞానానికి నిలయమై అణువంతే ఉన్నా మనసు ద్వారా శరీరమంతటా జ్ఞానాన్ని ప్రసరింపచేసే జీవునీ 'ఆత్మ' అనవచ్చు. ఆ జీవుడి లోపల ఉండి నియమిస్తూ ప్రపంచంలో అణువణువున వ్యాపించిన పరమాత్మనీ 'ఆత్మ' అనవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వాటి వాటి పరిధిలో వ్యాపించినవన్నీ ఆత్మ అనే శబ్దంతో చెప్పవచ్చు. కనుక ప్రకరణాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఆత్మ పదానికి మనస్సు అని, రెండవ ఆత్మ పదానికి జీవుడు అని అర్థం. ఆత్మ బాగుకు మొదటి పరికరం మనస్సు కనుక దాన్నిగూడ ఆపేరుతోనే పిలుస్తారు.*
*కనుక ఆత్మనా-మంచి మనసుచేత ఆత్మానం-జీవుని బాగుచేసుకోవాలి. ఆత్మానం -మనసుని న అవసాదయేత్-నాశనం చేసుకో వద్దు. నీ మనసుకు మంచి సంస్కారం నేర్పితే అదే నీకు బంధువులా శ్రేయస్సును కల్గిస్తుంది. చెడు విషయాలను నేర్పావా, నీ మనసే శత్రువులా, నీ పతనానికి కారణమవుతుంది.*
*ఈ మనస్సనేది ఎప్పటి నుంచో మనతో ఉంది. శరీరం పోగానే ఆ శరీరంతో ఉండే బంధుత్వాలు, బంధువులు కూడ దూరమౌతారు. కానీ, ఇంద్రియాలు పదింటితో కూడిన సూక్ష్మ శరీరంతో పాటు ఈ మనస్సు కూడ జన్మలన్నింటిలోను అనువర్తిస్తూ ఉంటుంది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే మొట్టమొదటి శరీరం నుండి రాబోయే జన్మల వరకు వీడక వస్తుందీ మనస్సు, కనుక, వీడని బంధువు, మిత్రుడు మన మనస్సే. దానినెంతో జాగ్రత్తగా చూసుకోవాలి. సున్నితంగా వాడుకోవాలి. అలా అని అతి గారం చేస్తే తలకెక్కుతుంది. అప్పుడు మరలాదాన్ని కాస్త నియంత్రించాల్సి ఉంటుంది. దీనికి రామాయణంలో ఒక దృష్టాంతం.*
*రాముడిని ఆత్మ అనుకుందాం. మనస్సేమో సుగ్రీవుడు. ఇతడు కోతులకు రాజు. ఇంద్రియాలు కోతులులాంటివే కదా! అలాంటి సుగ్రీవునకు పెత్తనమిచ్చాడు రాముడు. నాలుగు నెలల కాలం రాజ్య సుఖాలలో మునిగిపోయాడు. రామ కార్యం మరచి పోయాడు. అప్పుడు మా వాలి పథమన్వగాః సమయే తిష్ఠ సుగ్రీవ (వాలి వెళ్ళిన మార్గం ఇంకా తెరిచే ఉంది సుమా!) అంటూ రాముడు హెచ్చరించాల్సివచ్చింది. లేకపోతే సుగ్రీవుడు నేను చెప్పినట్లు నీవు నడు అని రాముణ్ణి శాసించి ఉండేవాడు. మొదట సుగ్రీవం నాథమిచ్ఛతి అంటూ తలకెక్కించు కున్నాడు. తరువాత మళ్ళీ చెప్పాల్సివచ్చింది హెచ్చరించాడు. ఇదీ మనసు తీరు. ఎంతో అనుకూలంగా ఉన్నట్లున్నా మనసు తిరిగి ఎప్పుడైనా అననుకూలంగా ప్రవర్తిస్తే Be careful అనగలగాలి. అప్పుడే అది తన పని చేసుకుంటుంది. మనకీ పనిచేసి పెడుతుంది.*
*నిజానికి మనసు అచేతనం. మనం పని చేయిస్తే పనిచేస్తుంది. అయితే ఇంద్రియాల వెంట విషయ సుఖాలవెంట పరుగుపెట్టి మనని అందులోకి లాగివేస్తుంది. ఇంద్రియాలు విషయాలతో క్రీడించాలీ అంటే మనస్సు సహకరించాలి. అందుకే దాన్ని ముందు తమ వైపు లాగుకొంటాయి. దాని వెంట జీవుడూ పోతాడు. ఇంద్రియాలు మనస్సు మాట వింటున్నట్లే ఉంటాయి కానీ, మనస్సును లాగే ప్రయత్నం చేస్తాయి. అందుకని మనస్సుని నియంత్రించాలి. సరైన మార్గంలో పెట్టి మంచిగ చేసుకోగలిగావా అదే మిత్రుడు కూడా.*
*నమ్మాళ్వార్లు వారి మనస్సు భగవంతుని అనుభూతికి కారణమైంది కనుక దాన్ని పొగుడుతారు. 'నెంజమే నల్లై నల్లై', 'ఓ నా మంచిమనసా! నీవు మిత్రుడవై ఉండగా ఇంకా నాకు లోటేమిటి? నన్ను నీతోపాటు మంచి మార్గంలో నడపవా! అంటారు.' శాస్త్రం చెప్పినవాటిని చేయించే మనసు మంచిది. శాస్త్రం నిషేధించే వాటిని చేయించే మనసు చెడ్డది.*
*నా మనసు మంచిదనే ఏమరపాటు కూడదు. జడభరతుడు రాజ్య భారాలు వదలి తపస్సుకని అడవికి చేరాడు. తీరా తపస్సు ఫలించే చివరి సమయంలో నదిలో కొట్టుకు పోతున్న లేడిపిల్ల మీద జాలిపడ్డాడు. ఆత్మ నాశనమైంది. కారణం మనసే. ఈ రకంగా మన మనసే మన వినాశానికి కారణమయ్యే శత్రువులాంటిది. నిజానికి మనసు తగని వాటిని కోరుతోందంటే సంస్కరింపబడలేదని అర్థం. కనుక దానిని నియంత్రించాలి. తగిన వాటిని, తగని వాటిని విడదీసి దానికి అందించాలి. మనసు సక్రమంగా పనిచేయాలంటే తగిన సాత్త్విక ఆహారాన్నే దానికి అందించాలి. అలా సాత్త్విక ఆహారాన్ని అందించి, అధీనంలో పెట్టుకున్న వానికి అది బంధువు. అలా కాక దాని అధీనంలో ఉన్నవాడికది శత్రువు. అది కోరినదల్లా యిచ్చి, దాని పని మొదట చేద్దాం అంటే, అది హాయిగ నిద్రపోయి ఏ పనీ చేయదు. ఎంత బుజ్జగించాలో అంతే చేయాలి.*
*ఇంటిని కాపాలా కాసే కుక్కకు అతిగ తిండి పెడితే నిద్రపోతుంది కావలి కాయడం మానివేసి. అలాగని మాడ్చేస్తే కోపంతో మనలని కరవడమో లేక దొంగను చూచి కూడ మొఱగలేక మూలుగుతుంది. అలానే మనస్సు కూడ. దాని శక్తిని నాశనం చేయకుండ, ఆ శక్తి మనకోసం వాడేట్టు చేయాలి. అపుడు అది మనకు భగవంతుని దరిచేరడానికి మంచి సాధనం అవుతుంది.*
*సాధన చేద్దాం! మనస్సును మంచిమిత్రుడిగ మలచుకుందాం!! శ్రీకృష్ణ అనుగ్రహం పొందుదాం!!!*
*┈┉┅━❀꧁ మార్గదర్శి ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌻🦚🌻 🙏🕉️🙏 🌻🦚🌻
No comments:
Post a Comment