Thursday, June 19, 2025

 *మార్గదర్శి.....* 

 *`శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా... 17వ రోజు* 

*📿 మోతాదుకు మించనివన్ని మంచివే అవుతాయి 📿*

*మనసుకి ఎలా అలవాటు చెయ్యాలి అనే సాధనని ఈ వారం శ్లోకంలో అంటే 6వ అధ్యాయం 17వ శ్లోకంలో తెలిపాడు. ప్రపంచంలో చెడు ఏదీ సృష్టించలేదు. అన్నీ మంచివే సృష్టించాడు. వాడుకోవడమే మనిషికి చేతకావటం లేదు. ఉన్నవాటితో తృప్తి లేదు. అన్నీ తనకే కావాలి అంటాడు. అన్నీ తనవే అంటాడు. నిజానికి భగవంతుడు ఒక్క మనిషి కోసమే కాదు కదా! ఈ ప్రపంచాన్ని తయారుచేసింది. అన్ని ప్రాణుల కోసమనే కదా భగవంతుడు అన్నింటినీ తయారుచేసింది. ఏది నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే దానిని నువ్వు స్వీకరించి అనుభవించితే ఏ ప్రమాదం లేదు. అయితే మనిషికి తృప్తి ఉండదూ. తృప్తి అనేది మనస్సులో ఉండాలి. అదిలేకపోతే ప్రమాదమే... కనుక మోతాదుకు మించక నీకవసరమైనవి అనుభవిస్తూ మనసుకు సాధన అలవరచడం ఎలానో ఈ వారం* *శ్లోకంలో ఉపదేశిస్తున్నాడు పరమాత్మ.*

*ఈ శ్లోకంలో భగవంతుడు ప్రతిదానికి 'యుక్త...' 'యుక్త...' అంటూ ఒక విశేషణం చేర్చాడు. దానికి చివర 'యోగః దుఃఖహా భవతి' అన్నాడు. యోగః= తాను చేసేటటువంటి సాధన, దుఃఖహా భవతి = తనకు దుః ఖాలు కలిగించకుండా ఉంటుంది. అంటే కృష్ణుడు చెప్పిన పని మనం చేస్తే రెండు లాభాలు అని దీనివలన మనకు తెలుస్తుంది.* 
1. *ఇప్పుడు మనం చేసేటటువంటిది మనకు దుఃఖాన్ని కలిగించదు.*

2. *గతంలో చేసి పెట్టుకున్నటువంటి దుఃఖాన్ని కలిగించే అవకాశం కలిగినటువంటివాటి నన్నింటిని కూడా ఇది తొలగిస్తుంది. ఏం చేస్తే? సమబుద్ధిని మనం సాధించగలిగితే! ఇది చెప్పాడు శ్రీకృష్ణుడు. అయితే సమబుద్ధిని సాధించడానికి చేయవలసినటువంటి సాధన ఏమిటో మనకు ఇందులో చెపుతున్నాడు.*

*మనకు శరీరం ఉంది. ఇంద్రియాలున్నాయి. మనస్సు ఉంది. శరీరం కొన్నిటిని పొందుతూ ఉంటుంది. అనుభవిస్తూ ఉంటుంది. ఇంద్రియాలూ కొన్నింటిని అనుభవిస్తూ ఉంటాయి. మనస్సు కూడా కొన్నింటిని అనుభవిస్తూ ఉంటుంది. అవన్నీకూడా వాటివాటి మోతాదుకు మించనివి కావాలి. ఇంద్రియాలు అందులో ఉండే ఆయా శబ్ద, స్పర్శ, రూప, రసాది విషయాలను అనుభవిస్తూ ఉంటాయి. శరీరం, విషయాలకి ఆధారమైన పదార్థాన్ని అనుభవిస్తూంటుంది. అయితే మనకి ఒక పదార్థంలో ఉండే రుచి బాగున్నట్టనిపిస్తే నాలుకకు ఆ రుచి ఎప్పుడూ కావాలనిపిస్తుంది.*

*రుచి నాలుకకు బాగున్నా అన్నీ ఆరగించాలి అంటే శరీరానికి కొన్ని హద్దులున్నాయి. నిజానికి రుచి కొంత చూపించి, శరీరానికి ఎంత వరకు హద్దో అంతవరకే తాను ఇవ్వాలి. ఆహారం విషయంలో మన శాస్త్రాలు 'ఉదరంలో ఉండే ఖాళీలో అర్థభాగం వరకు ఘనపదార్థాన్ని, మిగిలిన దాంట్లో మరొక అర్థం, అంటే ఒక పాతిక వంతు ద్రవ పదార్థంతో నింపు.*

*మరి మిగిలిన సగం ఖాళీగా అట్టే పెట్టు' అని చెబుతుంది. కానీ! మనం ఆ పద్ధతిని మార్చేసి 90% ఘనపదార్థంతోటే నింపేస్తాం. ద్రవ పదార్థాన్ని తగ్గించేస్తాం. అసలు ఖాళీ బొత్తిగా పెట్టం.*

*శాస్త్రం చెప్పే ఆ సిస్టమ్ని మనం అతిగా వాడి అవమానిస్తుంటాం. తిండి విషయంలోనే కాదు. మిగతా ఏ అనుభవానికైనప్పటికికూడా పద్దతి ఇలానే ఉండాలని మనం మరిచి పోవటానికి వీలులేదు. అందుచేత ఎంత ఘనం, ఎంత ద్రవం లోపల ఉండాలి అనేది ఒక నియమం. ఆ నియమానికి తగినట్టుగా నీవు ఆహారస్వీకరణ చేయాలి. ఇదే భగవంతుడు చెప్పిన యుక్త ఆహారం.*

*యుక్త విహారం : విహారమంటే తిరగడం. మనకి చాలా అందంగా కనిపిస్తుంది కదా అని ఉదయం నుండి రాత్రి దాకా తిరిగితే కాళ్ళు పట్టేస్తాయి. మరునాడు మనం లేవలేక పడుకుంటాం. మాటలైనా ఒక నియమానికి లోబడి, ఆహారమైనా ఒక నియమానికిలోబడి, ఇతరత్రా తను చేసే పనులు కూడా ఒక నియమానికి లోబడి, విహారమైనప్పటికినీ కూడ ఒక నియమానికి లోబడి చేసినపుడు దాని వల్ల ఏ రకమైన చీకు చింత ఉండవు.*

*ప్రతి ఇంద్రియానికి మనం అందించే వాటిని ఆయా ఇంద్రియాలకు ఆహారం అని అంటాము. కనుక కంటితో చూడాలని నీకు కోరిక ఉన్నా ఒక హద్దుకు మించి చూసే ప్రయత్నం చేయకు. ఆలోచనకూడా అంతే. మనస్సుతోటి చేసే ఆలోచనైనా ఎంత వరకు నీవు చేయదగునో, అంత వరకే చేయి.*

*హద్దు మీరడం అనేది ఎప్పుడూ కూడా దోషమే. అది ఆయాస్థాయిల్లో ఉండే ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. వారి వారి హద్దులలో వారు ఉండటం ప్రతి వ్యక్తికీ ప్రతి రంగంలో కూడా అవసరమే. భగవంతుడు మనకు ఆ విషయాన్ని చెబుతున్నాడు. అందుచేత నీ హద్దు నీవు తెలుసుకొని ప్రవర్తించగలిగితే నీ మనస్సుకి సమభావన ఏర్పడే అవకాశం ఉంది.*

*అయితే ఇన్నింటికి ... మనం తీసుకొనే ఆహారం చాలా ముఖ్యం. ఛాందోగ్యం అనే* *ఉపనిషత్తు ఈ విషయాన్ని అందంగా చెప్పింది. ఆహార* *శుద్ధా సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధా ధృవా స్మృతిః*

*స్మృతి లంబే సర్వగ్రంధీనాం విప్రమోక్షః ఆహారం వల్ల ఆలోచన, ఆలోచన వల్ల ఆచరణ, ఆచరణ వల్ల సిద్ది. ఇది ఒక క్రమం. ఆలోచన నీకు బాగుండాలి అంటే, ముందు నీవు తీసుకునేటటువంటి తిండిని కంట్రోల్ చెయ్యి. తిండిని కంట్రోల్ చెయ్యడం అంటే మూడు రకాల దోషాలు దాంట్లో లేకుండా చూసుకో. ఆ దోషాలు 1. జాతి, 2. ఆశ్రయ 3. నిమిత్త.*

*ఈ 3 రకాల దోషాలు లేని భగవన్ నివేదితమైన ఆహారం నీవు తీసుకొన్నట్టయితే అది 3రకాలుగ శరీరంలో మారుతుంది అని అంటారు.*

1. *స్థూలభాగం మలరూపంలో బయటకు విసర్జింపబడుతుంది.*

2. *మధ్యమ భాగంశరీరంలో మాంసాదులుగా పరిణమిస్తుంది.*

3. *సూక్ష్మరూపం మన మనస్సును పెంచుతుంది.*

*కనుక నువ్వు దోషం లేని మంచి ఆహారం తీసుకొన్నప్పుడు అందులో ఉండే సూక్ష్మాంశ నీ మనస్సుకి మంచిని ఇస్తుంది. కనుక ఆలోచన బాగుంటుంది. అదే నీ మాంస పరిణామ శరీర నిర్మాణానికి సహకరించింది కనుక నీ శరీరం కూడ చెప్పుచేతల్లో ఉంటుంది. ఇంద్రియాలు చెప్పుచేతల్లో ఉంటాయి. ఇక అందులో కూడా కొన్ని వ్యర్థ పదార్థాలు తప్పవు కనుక అవి మలాది రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. తద్వార నీయొక్క శరీరం, మనస్సు, ఇంద్రియాలు స్వాధీనంలో ఉండి ఆలోచన బాగుండి, ఆచరణ బాగుంటుంది. అందుకోసమనే శ్రీకృష్ణుడు మొట్టమొదటలోనే “యుక్తాహార” ఆహారం మంచిది తీసుకో “విహారస్య” శరీరంతో చేసే పనులు నియమ బద్ధంగా చేయడం అలవాటు చేసుకో. అంతేకాదు నువ్వు మాటాడే మాటను కూడ క్రమబద్ధం చేసుకో, దానితోపాటు 'యుక్త చేష్టస్య కర్మసు' నువ్వు చేసే పనులలో అతి ఆయాసము కలిగించే పనులు చేయకు. అలాంటి వాటిని కూడ తగ్గించుకో. వాటి వల్ల ఏర్పడేవి కొన్ని ఉన్నాయి. "యుక్త స్వప్నావ బోధస్య' ఎంతసేపు నిద్రించాలో అంత సేపు నిద్రించాలి. ఎప్పుడు మేలుకోవాలో అపుడు నీవు మేల్కొనే ప్రయత్నంచేయి. స్వప్నమంటే ఇక్కడ నిద్ర అని అర్థం. నీ ఆహారం బాగుండక పోతే నిద్ర సక్రమంగా ఉండదు. అతిగా ఆహారం తీసుకోవడం, అసలు ఆహారం మానివేసి ఊరకే ఉపవాసాలు చేయటం కూడ తప్పే. అంచేత నిద్ర ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మేల్కొనడం ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. నీకు మొదటివి క్రమబద్ధంలో వచ్చినట్లైతే సహజంగానే రెండవవి క్రమబద్ధం అవుతాయి. కనుక యుక్త స్వప్న, యుక్త అవబోధస్య. ఇవి ఎవరికైతే ఉంటాయో అలాంటి వారికి మానసికమైన సమభావన అలవడుతుంది. అనుకూలంగా అంటే పై పై వాటిని చూడడం కాదు. అన్నిటి లోపల ఉండే తత్త్వం ఒకటే, అలాంటివి అన్నీ నాలాంటివే. అందుకోసమనే ఆ లోపల ఉండే ఆత్మని నేను ద్వేషించక్కరలేదు, ఏ వ్యక్తి మీద నేను ద్వేషం పెంచుకోనక్కరలేదు, వ్యక్తిత్వాలు కర్మను బట్టి మారుతుంటాయి. వాటిని క్రమబద్ధం చేద్దాం లేదా మనకి వీలైనంతవరకు వాటినుంచి ప్రమాదం రాకుండ చూసుకొందాము.*

*గతంలో మనం అనుకున్నట్లుగ లోకంలో కన్పించే అంతరాలు ఆత్మవికావు అవి అంతరంగాల్లో ఉన్నవి కనుక అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి శారీరక ప్రవృత్తులే ప్రథమ సాధనాలు. అంచేత మోతాదుకేదీ మించనివ్వకుండ మనం ఉంచుకున్నంత వరకు ప్రతీది మనకి మంచినే కలిగిస్తుంది అనే విషయాన్ని శ్రీకృష్ణుడు మనకి ఈ శ్లోకంలో చెబుతున్నాడు. వాటిని క్రమబద్ధం చేసే ప్రయత్నం చేద్దాము.*

*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు* 
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️

No comments:

Post a Comment