*శ్రీపురం రాజ్యాన్ని శ్రీమంతుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు పక్షులంటే చాలా ఇష్టం. అందుకే రాజ భవనంలో ఎన్నో రకాల పక్షులను పెంచేవాడు. వాటి బాగోగుల కోసం ఏర్పాట్లు కూడా చేశాడు.*
*ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఓ రోజు విచారంగా ఉన్న రాజును గమనించిన రాణి కారణం అడిగింది. 'మరేం లేదు. మన దగ్గర ఉన్న పక్షులన్నీ నిక్షేపంగా ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా ఎగరడం లేదు' అని బదులిచ్చాడు రాజు.*
*ఇంతలోనే రాజ్యంలో కార్చిచ్చు రగిలి అడవి తగలబడిపోతోందని చెప్పాడు మంత్రి. వెంటనే సైన్యంతో మంటలు ఆర్పించాడు మహారాజు.* మరుసటిరోజు అక్కడికి వెళ్లి.. ప్రమాదం గురించి ఆరా తీయగా... కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోయాయని, పక్షులకు ఎలాంటి హానీ జరగలేదని తెలిసింది. తిరుగు ప్రయాణంలో రాజు.. దారిలో ఎగురుతున్న పక్షులను చూస్తూ రాజభవనానికి చేరుకున్నాడు.
తాను పెంచుకుంటున్న పక్షులు ఎందుకు ఎగరడం లేదన్న ప్రశ్న మాత్రం ఆయన మనసులో అలాగే ఉండిపోయింది.
దాంతో ఒకరోజు సభలో ఇదే ప్రశ్న అడిగాడు. ఎవరికి నచ్చిన సమాధానం వాళ్లు చెప్పారు. వాటితో మహారాజు సంతృప్తి చెందలేదు.
ఒక రోజు మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ- ఆ క్రమంలో ఓ రైతుతో మాట్లాడుతున్నప్పుడు... 'రాజభవనంలో ఉండే పక్షులు అస్సలు ఎగరడం లేదంట. కారణం ఏంటో తెలుసా?' అని అడిగాడు.
👉 'ఉన్నచోటే తిండి పెట్టి పక్షులనూ ఉచిత పథకాల ఆశ చూపి మనుషులనూ సోమరిపోతులుగా మారుస్తున్నాడు మా రాజు' అన్నాడు రైతు.
👉ఆ మాటలతో శ్రీమంతుడికి జ్ఞానోదయమైంది. 'పక్షులను జాగ్రత్తగా పెంచాలనుకోవడం తప్పు కాదు. కానీ.. అసలు ఎగరాల్సిన అవసరమే రాకుండా చూడటం సరికాదు.
👉అలాగే ప్రజలకూ వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకునే పథకాలు ప్రవేశపెట్టాలి. అంతే తప్ప.. అనవసరమైన ఉచిత పథకాలు తీసుకొచ్చి వారిని సోమరులుగా చేయకూడదు' అని గ్రహించి, తగిన చర్యలు తీసుకున్నాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే రాజభవనంలోని పక్షులు ఎగిరాయి! రాజ్యంలో ప్రజలు సోమరితనాన్ని విడిచిపెట్టి, కష్టజీవులుగా మారిపోయారు!!🍁.
No comments:
Post a Comment