Monday, June 29, 2026

 ప్రతిరోజు సెల్ ఫోన్ కు ఛార్జింగ్ చేస్తున్నాం. మనకు చార్జింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. 
----------
ఈ మధ్య మా ఇంట్లో ఉదయాన్నే వినిపించే మొదటి శబ్దం కోయిల కూయడం కాదు. "ఛార్జర్ ఎక్కడుంది?" అన్న కేక.
ఒకప్పుడు నిద్రలేచిన మనిషి కిటికీ తెరిచి ఆకాశం చూసేవాడు. ఇప్పుడు కళ్లు పూర్తిగా తెరవకముందే మొబైల్ స్క్రీన్ వెలుగు ముఖం మీద పడుతోంది. దేవుడి ఫోటో దర్శనం కంటే ముందే బ్యాటరీ పర్సెంటేజ్ దర్శనం జరుగుతోంది.
బ్యాటరీ 100% ఉంటే ముఖంలో వసంతం విరుస్తుంది. 15%కి పడిపోతే ప్రపంచ బ్యాంకు దివాళా తీసినట్టుగా ఆందోళన మొదలవుతుంది. మనిషి గుండె ఎంత కొట్టుకుంటోందో తెలియదు కానీ బ్యాటరీ ఎంత మిగిలిందో మాత్రం క్షణక్షణం తెలుసుకుంటున్నాడు.

మా ఇంట్లో ప్రతి ఉదయం ఒక చిన్న కురుక్షేత్రమే. ఒక ప్లగ్ పాయింట్ చుట్టూ ముగ్గురు యోధులు. ఒక ఛార్జర్ కోసం నాలుగు వాదనలు. ఫోన్ ముందా? ట్యాబ్ ముందా? వాచ్ ముందా? ఇయర్‌బడ్స్ ముందా? అన్న చర్చలు.

ఒకరోజు అబ్బాయి, కోడలు, మనవడు ముగ్గురూ ఒకే ఛార్జర్ కోసం యుద్ధం చేస్తున్నారు. నేను మధ్యలో,"అది నా ఇల్లు బాబూ!"అన్నాను. ఎవరూ వినలేదు.
ఆ క్షణంలో నాకు ఒక తాత్విక సత్యం అర్థమైంది. ఇంటి యజమాని నేనే అయినా, ఇంటి అధికారం మాత్రం ఛార్జర్‌దే.
ఒకప్పుడు అన్నదమ్ములు పొలాలు పంచుకునేవారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ప్లగ్ పాయింట్లు పంచుకుంటున్నారు.
ప్రయాణానికి బయలుదేరే ముందు ఒకప్పుడు టికెట్ ఉందా? డబ్బులు ఉన్నాయా? అడిగేవారు. ఇప్పుడు మొబైల్ ఉందా? ఛార్జర్ ఉందా? పవర్‌బ్యాంక్ ఉందా? అని అడుగుతున్నారు.

ఒక మిత్రుడు ఒకసారి అత్యవసరంగా ఫోన్ చేశాడు."అర్జెంట్‌గా మాట్లాడాలి" అన్నాడు.
నేను కంగారుపడి "ఏమైంది?" అన్నాను.
అతను గంభీరంగా,"బ్యాటరీ రెండు శాతం ఉంది..."అన్నాడు. అతని స్వరం వింటుంటే బ్యాటరీ కాదు, ప్రాణవాయువు రెండు శాతమే మిగిలినట్టుగా అనిపించింది.
ఇంతలో కాలం కొత్త అవతారాలు ఎత్తింది.
ఫోన్‌కి ఛార్జింగ్, వాచ్‌కి ఛార్జింగ్, ఇయర్‌బడ్స్‌కి ఛార్జింగ్, కారుకి ఛార్జింగ్, స్కూటర్‌కి ఛార్జింగ్...
ఇంట్లో మనుషులు ఎంతమందో లెక్క తెలియదు. కానీ బ్యాటరీలు మాత్రం గణాంక శాఖకే సవాలు విసురుతున్నాయి.

అలాంటి రోజుల్లో ఒకసారి మా మనవడు అమాయకంగా అడిగాడు."తాతయ్యా... నిన్ను ఎక్కడ ఛార్జ్ చేస్తారు?"నేను నవ్వాను.
కానీ ఆ నవ్వు వెనక ఒక ఆలోచన నిలబడి ఉంది.

నిజంగానే...మనిషిని ఎక్కడ ఛార్జ్ చేస్తారు?
ప్రతి వస్తువుకీ ఛార్జర్ ఉంది. కానీ మనసుకి?
అక్కడి నుంచే అసలు కథ మొదలైంది.
ఉదయాన్నే తూర్పు దిక్కున సూర్యుడు బంగారు అక్షరాలతో రోజు ప్రారంభించడం చూడటం ఒక ఛార్జింగ్. చెట్టు కొమ్మపై పక్షి పాడే పాట వినటం ఒక ఛార్జింగ్. వాన తర్వాత నేల వెదజల్లే మట్టి పరిమళం ఒక ఛార్జింగ్.
శివాలయంలో అభిషేకం చూస్తూ కాసేపు నిశ్శబ్దంగా కూర్చోవటం ఒక ఛార్జింగ్.
పాత మిత్రుడితో కాలం మరిచి కబుర్లు చెప్పుకోవటం ఒక ఛార్జింగ్.
పసిపిల్ల నవ్వు చూడటం అయితే అది ఫాస్ట్ ఛార్జింగ్ కాదు... సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.
మంచి పుస్తకం, మంచి సినిమా, కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ పంచుకున్న నవ్వులు...
ఇవన్నీ మనిషి బ్యాటరీని నింపే అసలైన పవర్‌బ్యాంకులు.

ఒక రాత్రి డాబా మీద కూర్చుని వెన్నెలతో ముచ్చట్లు చెప్పాను. చేతిలో కాఫీ కప్పు. మనసులో పాత జ్ఞాపకాలు. రెండు గంటల తర్వాత లోపలికి వచ్చి మొబైల్ చూసాను.
అది 12% వద్ద ఉంది. కానీ నేను మాత్రం 112% వద్ద ఉన్నాను. అప్పుడు తెలిసింది.
ఛార్జర్ గోడ దగ్గర దొరుకుతుందని.

ఛార్జింగ్ మాత్రం జీవితం దగ్గర దొరుకుతుంది.
మన పెద్దలు ఈ రహస్యం ఎప్పుడో కనిపెట్టేశారు. వాళ్ల దగ్గర స్మార్ట్‌ఫోన్లు లేవు. పవర్‌బ్యాంకులు లేవు. బ్లూటూత్‌లు లేవు.
అయినా వాళ్ల ముఖాల్లో వెలుగు ఉండేది.
ఎందుకంటే వాళ్లు ప్రకృతితో కనెక్ట్ అయ్యి ఉండేవారు.మనం ఇప్పుడు ప్రపంచమంతా కనెక్ట్ అయ్యాం. కానీ మనసుతో మాత్రం డిస్‌కనెక్ట్ అయ్యాం.

అందుకే నేను ఒక కొత్త నియమం పెట్టుకున్నాను. మొబైల్‌ని రోజుకి ఒక్కసారి ఛార్జ్ చేయండి. మనసుని రోజుకి పదిసార్లు ఛార్జ్ చేయండి. 

సూర్యోదయంతో.
స్నేహంతో.
నవ్వుతో.
సంగీతంతో.
ప్రకృతితో.
దైవస్మరణతో.

ఎందుకంటే చివరికి...జేబులో ఫుల్ ఛార్జ్ మొబైల్ ఉండొచ్చు.చేతికి ఫుల్ ఛార్జ్ వాచ్ ఉండొచ్చు.బయట ఫుల్ ఛార్జ్ కారు ఉండొచ్చు.
కానీ లోపల మనిషి డిశ్చార్జ్ అయిపోయి ఉంటే—
ఆ జీవితం స్విచ్ ఆఫ్ అయినట్టే.
కాబట్టి మొబైల్‌ని మాత్రమే కాదు...
మనసుని కూడా ఛార్జ్ చేసుకోండి.
ప్రకృతిని కనెక్ట్ చేసుకోండి.
జీవితాన్ని రీచార్జ్ చేసుకోండి.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏

No comments:

Post a Comment