*చంద్రవంక*
అత్తయ్యగారు...మేము వెళ్లొస్తాం అంటూ రూమ్ లోకొచ్చిన అదితిని, తలెత్తి చూసారు ఏవో పేపర్స్ చూసుకుంటున్న మమత. రింకిల్స్ చేసుకున్న హెయిర్ తో, పెద్దవిగా వేలాడుతున్న ముత్యాల లోలాకులతో అందంగా ఉన్నా ...బోసి మెడ బాలేదనిపించింది ఆమెకు.
మెళ్లోకి ఏమేసుకోలేదే ? మమత ప్రశ్న పూర్తి కాకముందే ! చెవులకి హెవీ గా ఉంటే... మెళ్లోకి బాగోదండి చెప్పేసింది అదితి. వెళ్ళేది పెళ్ళికి ఆలా బాగోదు. చిన్నదైనా ఎదో ఒకటి వేసుకో అంటూనే ఎలాగూ సూత్రాలు, నల్లపూసలు పూజలకి తప్ప వేసుకోరు అంటూ మనసులోనే గొణుక్కుంది మమత.
చిన్నవేం మ్యాచ్ అవలేదు అందుకే నసిగింది అదితి. నాదగ్గరేమన్నా ఉంటే...చూడు అంటూ దిండుకింద ఉన్న కీస్ ఇచ్చింది మమత. హు ... వదిలేట్టు లేరు. ఎదో ఒకటి వేసేసుకుని కారులో తీసిపడేస్తా అనుకుంటూ అయిష్టంగానే బీరువా తెరిచింది అదితి.
లోపల లాకర్లో చాలా బాక్స్ లు ఉన్నాయి. చైన్స్ ఉన్న బాక్స్ తీసుకోబోతూ, పక్కనే ఉన్న రాళ్లు పొదిగిన చిన్న చెక్కపెట్టె చూసి చేతిలోకి తీసుకుంది అదితి.
బాగా పాతదిలాగ ఉంది. కానీ బావుంది అనుకుంటూ తెరిచింది. రెండు పెండెంట్స్ లాగా ఉన్నాయి. ఎరుపు, తెలుపు రాళ్లతో తళుక్కున మెరిసాయి.
చాల బావున్నాయి ఇవి అనుకుంటూ చేతిలోకి తీసుకుని, చైన్స్ లేవు వెనకాల ఈ క్లిప్ ఏంటి ? తిప్పుతూ చూస్తుంది అదితి.
వెనక్కి తిరిగి కోడల్ని చూసిన మమత ఏంటవి పెట్టుకుంటావా ? అయినా జడే వేసుకోవు అవెందుకులే నీకు అంది.
ఏంటివి అత్తయ్యా చాలా బాగున్నాయి మెరుస్తూ, సారీ పిన్స్ లాగ కూడ లేవు అడిగింది అదితి.
అవి తలమీద పాపిడికి అటు ఇటు పెట్టుకునేవి అంటుండగానే వాట్ ? అంటూ నోరు తెరిచింది అదితి.
నీకలాగే ఉంటుంది కానీ...ఆ పెట్టి ఇలా ఇచ్చి నీక్కావలసింది వేసుకువెళ్ళు అంటూ ఆ పెట్టి చేతిలోకి తీసుకుంది మమత.
ఎర్రపొళ్లు, తెల్లరాళ్లు, పచ్చలతో మెరుస్తూ ఇప్పటికిప్పుడు తల మీద పెట్టుకోవాలనిపించింది.
నవ్వుకుంటూ తలమీద చేయి పెట్టుకుని మధురమైన బాల్యం లోకి వెళ్ళిపోయింది మమత.
అవధాని గారి పెద్దమ్మాయి పెద్దమనిషి బంతి ఉంది గుర్తులేదా ?? ఇవాళ సీతా...ముస్తాబవండి అంటూ ఖంగుమంది నాయనమ్మ గొంతు.
ఆమ్మా ...మనం ఈ ఊరొచ్చినప్పుడల్లా, ఎక్కడికన్నా తీసుకెళ్తూనే ఉంటుంది కదా నాయనమ్మ ? పెద్ద పెద్ద కళ్ళు విప్పార్చుకుంటూ తలెత్తి అమ్మ మొహం లోకి చూస్తూ అడుగుతుంటే ...
అవును మనల్ని అందరికి చూపించాలని అంది అమ్మ.
ఎందుకు ? అమాయకంగా అంటున్న నన్ను దగ్గరికి తీసుకుని వీళ్ళు ఊరొదిలి పోలేదు ఉద్యోగాలకి వెళ్లారు అంతే అని చెప్పుకుంటుంది పాపం అంటున్న అమ్మ మాటలు అర్ధం కాకపోయినా, గొంతులో ఎదో బాధ తెలిసి అమ్మని హత్తుకుని కూర్చున్న క్షణం బాగా గుర్తుంది నాకు .
హడావుడిగా వచ్చిన నాయనమ్మ చేతిలో చిన్న మెరిసే పెట్టి ఉంది. మమ్మలూ ఇలా రావే...అంటూ పిలిచి వళ్ళో కూర్చోపెట్టుకుని ఆ పెట్టి తెరిచింది నాయనమ్మ
రెండు చిన్న బిళ్ళల్లాగ మెరుస్తున్నాయి.
అమ్మకూడా చూసి ఇప్పుడెందుకండి చేయించారు ?అసలే ...అంటున్న అమ్మని ఆగమని సైగ చేస్తూ
చిన్నోడి డాక్టర్ చదువుకి ఎంత డబ్బూ చాలక కొంత పొలం అమ్మాల్సొచ్చింది.
పెద్దోళ్ళు మీరు కూడా బెజవాడలో ఇల్లు కట్టుకుంటాం అంటే మిగిలింది కూడా నిన్నే సంతకాలైనాయ్.
పంట ఇచ్చే పొలం పోయింది. ఇంకా ...
పాడి ఇచ్చే గొడ్డుగోదా, నాలుగు తరాలు నిశ్చింతగా బతికిన ఇల్లు కూడా...నా ముందో, నా తర్వాతో అమ్మేస్తారు.
పుట్టి పెరిగిన ఊరు ఆనవాలు, ముందు తరంకి ఎట్లా ఉంటుంది. ఈ ధాన్యంపురిలు, పశువుల కొట్టాలు నిట్టాడి వంటిల్లు, పదిమంది పెళ్లిళ్లు చేసిన ఈ మండువా లోగిలిని గుర్తు తెచ్చుకోవాలంటే ...
ఫోటోలు పాతబడతాయి. కానీ పసిడి పది కాలాలుంటుంది.
ఎప్పుడు ఏ పరిస్థితిలో కొన్నామో గుర్తు ఉంటుంది,
అంటూ కళ్ళల్లో నీళ్లు కనపడకుండా అటు తిరిగి చెప్తున్న నాయనమ్మని చూసి అమ్మ ఏడ్చేసింది. పిల్లల చదువులు. అయన ఉద్యోగం అంటూ చెప్తున్న అమ్మతో అవున్లే...
మీ కారణాలు మీకుంటాయి అంటూ,
కళ్ళు తుడుచుకుంటూ నాయనమ్మ నా బుగ్గలు పట్టి ముద్దు పెట్టుకుని, ఇవి సూర్య చంద్రులు. నీకుఁ గొలుసులు, గాజులు అన్నీ ఇచ్చిన పొలం కౌలు డబ్బులుతో ఆఖరిగా ఇస్తున్న బహుమతి.
పగలు సుర్యకాంతి వల్ల అందరికి జీవనం, రాత్రి చంద్రకాంతి వల్ల అందరికి సంతోషం కలుగుతున్నాయని ఇలా... ఆ రూపుల్ని తలమీద పెట్టుకుని గౌరవిస్తామన్న మాట.
బాగున్నాయా ! అంటూ నాకు పాపిడికి అటు ఇటు వాటిని పెట్టి ముద్దు పెట్టుకుంటున్న నాయనమ్మ కళ్ళ నీళ్లు, పాపిట్లో పడినప్పుడు అంతగా అర్ధం కాకపోయినా కొత్త నగ వచ్చిన ఆనందం బాగుంది.
తర్వాత నాయనమ్మ ఎక్కువ రోజులు లేదు. పెద్ద కమతం చేతి నుండి జారేక నాట్లు, కోతలు, కూర్పిళ్లు లేక మనాదితోనే పోయిందని, అమ్మలాంటి వ్వయసాయాన్ని, అమ్మని కూడా లేకుండా చేసుకున్నామని నాన్న ఇప్పటికీ గుండెలోతుల్లో దిగులు దాచే ఉంచారు.
ఈ సూర్యుని మెరుపు, చెంద్రుని తళుకు నేను ఉన్నంతవరకు నాయనమ్మని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆపెద్ద ఇల్లు చటుక్కున చేత్తో కోసిన నిమ్మచెట్టు కాయలు, పెద్దపాలేరు చెట్టెక్కి కోసిపడేసే కొబ్బరి గెలలు, తలకాయలంత కాయలు కాసే కొబ్బరిమామిడి చెట్టు, పందిరి మంచం, పొద్దున్నే వెన్నముద్దలు, కోళ్ల గూళ్ళు వాకిట్లో ముగ్గులు, అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగాయి.
అవును పది కాలాల జ్ఞాపకాలు తెరలు తీసిన ఆ పసిడి సూర్యవంక, చంద్రవంక లను చూస్తూ ఉండిపోయింది మమత.
చదువులంటూ, ఉద్యోగాలంటూ అమ్మచేయి వదిలి, చేనొదిలి, ఊరొదిలి ఆ పచ్చి గాలినొదిలి ఒకతరం వచ్చేస్తే, వారి పిల్లలు వారినొదిలి ఇంకొంత దూరం...
సుధామాధవి
No comments:
Post a Comment