Friday, June 5, 2026

 *_మందారవల్లి గర్వభంగము_*
~~~~~~~~~~~~~~~~~
*గజపతుల ఆస్థాన కవయిత్రి ముందారవల్లి. ఈమె ఘుడియకు నూరు పద్యములను ఆశువుగా చెప్ప గల్గిన కవిత్వ పాటవము గలది, పండితురాలు. ఆమె అనేక కవిపండితులను తన కవితాశక్తితో  ఓడిచింది.* 

*ఆమె ఒక పర్యాయము విజయనగర రాజ్య మునకు వచ్చింది. కవిత్వములో తనను ఓడించగల వారు మీ ఆస్థానమునందు ఉన్నారా? ఉంటే... వాదమునకు సిద్ధపరచ వలయునని రాజాస్థాన హాలునకు కబురంపింది.*

*రాజగు కృష్ణదేవరాయల కిది తన ఆస్థాన పరువు సమస్యగా తోచింది. సమయానికి పెద్దన వంటి అనుభవశాలురు రాజధానిలో లేరు. అయిననూ వాదమునకు అన్ని ఏర్పాట్లు చేయించాడు. ఈ కార్య భారమంతయు తెనాలి రామ కృష్ణునిపై పడింది. మందారవల్లి సభలోనికి ప్రవేశించింది. సభలో అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.* 

*మందారవల్లి గర్వముతో ఇలా పలికింది... _“నేను గెలిచినచో నాచే ఓడింపబడిన వాని శిరస్సుపై నా ఎడమ కాలు మోపెదను.”_ అని...*

*తర్వాత తన కాలి అందెలను గలగల లాడించి,*

*_("అందమగు నాపదంబుల_* 
*_చిందెడు నీ గజ్జెలేమి చెబుతున్నవయా?")_* 

_అని సమస్య నిచ్చింది._ 

_వెంటనేరామకృష్ణుడు!_ 

*_"మందార వల్లి పనిగో_*
*_విందాయని గోలగోల వెడుతున్నవయా!_* _అంటూ పూరించెను. మరల మందార వల్లి ఈ క్రింది సమస్యనిచ్చింది._ 

 *_(కప్పను గని త్రాచుపాము గడగడ వణికెన్!)_*

*దానికి రామకృష్ణుడు క్రింది  విధముగా పూరించెను.* 

_కందపద్యం._
*_కుప్పలు కావలి కాయగ_* 
*_చెప్పులు కర్రయును సద్దు సేయుచు నుండన్!_* 
*_తెప్పున చనుదెంచెడు వెం_*  
*_కప్పను గని త్రాచుపాము గడగడ వణికెన్.!_*
*****'********

*ఇలాగే ఆమె మరికొన్ని సమస్యల నివ్వగా... రామకృష్ణుడు వాటిని  రసవంతంగా పూరించెను.*

_1. కందపద్యం._
*_ఇలలో నిద్దరు రాజులు_* 
*_మలయగ చదరంగ మాది మాపటి వేళన్!_* 
*_బలగంబు కట్ట మరచిన_* 
*_(ఎలుకలు తమ కలుగులోని కేనుగు నీడ్చెన్)_*

_2. కందపద్యం._
*_సీతాపతి పూదోటకు_* 
*_ఏతామెత్తంగ వలయు, నిప్పటి దనుకన్!_* 
*_తాతా! తొంగున్నా వా_* 
*_(ఈతాకుల గుడిసెలోన ! యి నుడుదయించెన్!)_* 

_3. ఉత్పలమాల._
*_తక్కక కృష్ణరాయ వసుధావరు డర్థుల కర్థమిచ్చుచో_* 
*_దిక్కుల లేని కర్ణుని దధీచిని ఖేచరి వేల్పు మ్రాను పెం_* 
*_పెక్కని కామధేనువు శిబీంద్రుని నెన్నెదు వారకామినీ!_* *_(కుక్కవొ! నక్కవో! ఫణివొ! కోతివొ ! పిల్లివొ!బూత పిల్లివో! )_*

_4. ఉత్పలమాల_ 
*_వారిజ గర్భునైన సిగపట్లకు పిల్చెడు రామకృష్ణు ధి_*
*_క్కారమొనర్చి శీర్షమున కాలిడు కారులు కూసినట్టి యీ_* 
*_వారవధూ శిఖామణిని వంతులు వేసుక దంచి పంపుడీ_* *_(మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరలందరున్.)_* 

*అప్పుడు రామకృష్ణుని వారించి, తర్వాత కృష్ణదేవరాయలామెను సగౌరవంగా సాగనంపాడు.*
=================
*_-{ఎప్పుడో సేకరించి డైరీలో రాసిపెట్టుకున్నవే..!: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు}-_*

No comments:

Post a Comment