Wednesday, December 9, 2020

అంతటా ఆనందమే.

అంతటా ఆనందమే.
మనిషిలో నిజమైన ప్రతిభ ఉన్నప్పుడు ఎవరైనా గుర్తిస్తారు. అసూయా ద్వేషాలు దాడి చేసినప్పుడు మాత్రం మానవుడు తోటి మనిషిలోని ప్రతిభను అంగీకరించడు. అతడి మనసు గుర్తించకపోయినా అంతరాత్మ తప్పక గుర్తిస్తుంది. ఆత్మపరంగా ప్రతిభకు ద్వేషం అంటదన్నది గీతామృత సారం.
మనిషి మనసును రంజింపజేయడానికి భగవంతుడు లలిత కళల్ని సృజించాడు. శిశువులు, పశువులు సైతం మధుర గానానికి పరవశమవుతాయని ప్రతీతి.
అన్ని దానాలూ యశస్సుతో పాటు అపార పుణ్య ఫలాన్ని ఆర్జించి పెడతాయి. ఏ దానానికీ లేని ప్రాశస్త్యం అన్నదానానికి ఉంది. ఆకలి తీరగానే మనిషి పూర్ణ తృప్తిని పొందుతాడు. ఇంకా తినాలని ఆశించడు. దాతకు యశస్సు అందివస్తుంది.
కళలు అన్నీ గొప్పవే. ఉత్కృష్టమైనవే. ప్రతి కళా సాధించిన తరవాత కళాకారుడి ద్వారా వ్యక్తమైనప్పుడు వీక్షకుడిలో ఆనందంతో కూడిన ఆశ్చర్యాతిరేకాలకు వేదిక అవుతుంది. సుస్వరమైన సంగీత శ్రవణం వల్ల శ్రోత ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. మంచి సంగీతం విన్న శ్రోత ఆనందం స్థాయిని కొలవలేం. అలాగే ఆకలి తీరిన అన్నగతప్రాణి తృప్తికి సైతం కొలమానం ఉండదు.
హాయిగా ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తున్న దృష్టికి సైతం స్థాయిని నిర్ధారించే ప్రాతిపదిక ఉండదు. అందుకే భగవంతుడి సృష్టి అమోఘమైనదంటారు పండితులు.
కష్టంతో కూడిన కార్యాలు ఫలించిన పిదప అందివచ్చే ఆనందం విలువ వెలకట్టలేనిది. ఓ విద్యార్థి, కార్మికుడు, కర్షకుడూ అటువంటి ఆనందాన్నే పొందుతారు. ఇంద్రియాలతో మనిషి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇంద్రియాలకు అధిపతి శ్రీమన్నారాయణుడు. ఆయన కరుణ లేకుండా మనిషికి ఇంద్రియానందం దక్కదు. పూర్ణ జ్ఞానికి ఇంద్రియ స్పృహ ఉండదు కదా... అలాంటి వారు ఆనందాన్ని ఎలా అనుభవించగలరు? దుఃఖ భావన లేని యోగులు, రుషులకు మిగిలేది ఆనందమే కదా!
సృష్టిలో ప్రతి వస్తువుకూ ప్రత్యామ్నాయం ఉంటుంది. మనిషికి ప్రత్యామ్నాయం ఉండదు. అందుకే ఎలాంటివారైనా తోటివారికి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అప్పుడు అందరూ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రవచించిన మంచినే పలకడం, వినడం, చూడటం వల్ల ఎవరికీ ఖేదం కలగదు.
వస్తువులను ఎంచుకొనే సౌలభ్యం ఉన్నట్లు విషయాలనూ మనిషి ఎంచుకోవచ్చు. వివేకవంతుడి ఎంపిక మంచి ఫలితాలనిస్తుంది. పరిస్థితుల ప్రాబల్యంవల్ల, లేదా మేధాపరిణతి లోపంవల్ల విషయ అవగాహన చేయలేని వ్యక్తులకు మోదం దుర్లభమే. జీవితానుభవాలను ఉపయోగించి సాధకుడు ఆనందసాధన చేయవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో గురుశిష్య సంబంధాలు మర్కట, మార్జాల కిశోర న్యాయాలుగా భాసిస్తాయంటారు పెద్దలు. కోతి పిల్ల తల్లిని అంటిపెట్టుకుని ఉండగా, పిల్లిపిల్ల తల్లి సంరక్షణలో జీవిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో శిష్యుడు, గురువును సంపూర్ణంగా నమ్మక ముందు మర్కట(కోతి) కిశోర న్యాయంగానూ, నమ్మిన తరవాత మార్జాల(పిల్లి) కిశోర న్యాయంగానూ అలరారుతాయి. అంటే, సంపూర్ణ శరణాగతి పొందిన భక్తుడి యోగక్షేమాలు భగవంతుడే చూసు కుంటాడు. కష్టాలు ముంచుకు వచ్చినా భగవంతుడిపై భారం వేసి తనకు కాదు అన్నట్లు జీవించగల కర్తవ్య పరాయణత్వం ఉంటే సుఖసంతోషాలకు లోటుండదు. సాధనలో ఆ మెట్టుదాకా ఎదిగిన తరవాత సాధకుడిని ఏ కష్టాలూ బాధించవు. మిగిలేది అంతటా ఆనందమే!
గోపాలుని రఘుపతిరావు

Source - Whatsapp Message

No comments:

Post a Comment