Wednesday, October 20, 2021

Karma story (మనం ఇతరులకు చేసిన చెడు కూడా అంతే...ఒకటికి వందింతలై మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. అందుకె మనం ఎల్లప్పుడూ మంచే చేద్దాం)

 

Karma story


కారు ఆగిపోయింది .
అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి .
దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది .
స్టెఫినీ ఉందికానీ తనకు వెయ్యడంరాదు.
రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు .
సమయం చూస్తే ...
సాయంత్రం ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి .
మనసులో ఆందోళన. ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు.
చీకటి పడితే ఎలా?

దగ్గరలో ఇళ్ళు లేవు. సెల్ పనిచెయ్యడం లేదు( సిగ్నల్స్ లేవు ).
ఎవరూ కారునూ, పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు.
అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది. ఎలారా దేవుడా అనుకుంటూ ...
భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది.

అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది.
ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటంతో ...
ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను?
ఎందుకు వస్తున్నాడు? ఏమి చేస్తాడు?
ఆందోళన !

అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు?
టైర్ లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు.
"భయపడకండి. నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను.
బాగా చలిగా ఉంది కదా! మీరు కారులో కూర్చోండి.
నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు.
ఆమె భయపడుతూనే ఉంది.

"నా పేరు రాముడు.
ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను" అన్నాడు.
అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని ...
కారు కిందకి దూరి జాకీ బిగించాడు.
తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో ...
జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు.
ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు.

"మీరు కాదనకండి. మీరు ఈ సహాయం చెయ్యక పోతే ...
నా పరిస్థితిని తలుచుకుంటే ... నాకు భయం వేస్తోంది" అంది.
"నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు.
మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ... ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే ...
నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి" అని వెళ్లి పోయాడు.

మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ...
ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది.
అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది.
తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది.
ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి.

అదొక చిన్న హోటల్.
కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది.
ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది.
డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది.
బరువుగా నడుస్తోంది.
అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం,
సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని ... చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది.
ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు.

ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది.
చిరునవ్వుతో “ఏమి కావాలండి?” అని అడిగింది.
అంత శ్రమ పడుతూ కూడా ...
చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో? అని,
ఆశ్చర్య పడుతోంది, తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది.
భోజనం చేసి ఆమెకు ... 1000 రూపాయల నోటు ఇచ్చింది.
ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు ..
ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద ...
నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి.

ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు.
అందులో ఇలా ఉంది ...
“చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది.
నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే ...
నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది.
నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ ...
నేను నీకు సహాయపడుతున్నాను.
నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు." అని రాసి ఉంది..

హోటల్ మూసేశాక గర్భిణీ మహిళ ఇంటికి వచ్చింది.

అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది.
గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది.
అతడి పక్కన మంచం మీదకు చేరుతూ ...
“మనం దిగులుపడుతున్నాం కదా ... డెలివరీకి డబ్బులెలాగా అని.
ఇక ఆ బెంగ తీరిపోయిందిలేండి!
భగవంతుడే మనకు సహాయం చేశాడు.
ఆయనకి కృతజ్ఞతలు” అంది ప్రశాంతంగా.

మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.
మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది.
అన్నది ఆ కధ యొక్క పరమార్థం..!!

మనం ఇతరులకు చేసిన చెడు కూడా అంతే...ఒకటికి వందింతలై మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. అందుకె మనం ఎల్లప్పుడూ మంచే చేద్దాం

వాట్సప్ లో ఇలాంటి మంచి విషయాలు బోధించండి.. సమాజం బాగు కోసం చేయూత ఇవ్వండి
మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి..

సేకరణ

No comments:

Post a Comment