Sunday, March 13, 2022

మేష్టారు - మంత్రి

మేష్టారు - మంత్రి

'సర్... ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు... కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట... ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.' అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ.

కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.

'రండి, కూచోండి. మీ వివరాలన్నీ చూసాను.' అంటూ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు.

'ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు... మీరు నిశ్చింతగా ఉండొచ్చు,' అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు.

మాస్టారు ఉప్పొంగిపోయేరు. 'గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది.' అంటూ కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు.

'అయ్యో... మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం!' అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు.

కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు తెలుగు మాస్టారు.

చేతన్, చేన్, తోడన్, తోన్... చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం...
తృతీయా విభక్తి...!


కొఱకున్, కై ... ప్రజల కొరకు, ప్రజల కోసం పోరాడటం.. చతుర్ధీ విభక్తి ...!

వలనన్, కంటెన్, పట్టి... ప్రజల వలన ఎన్నుకోబడిన నేను, వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే... పంచమీ విభక్తి ..!

కిన్, కున్, యొక్క , లోన్, లోపల... వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే... షష్టీ విభక్తి..!

అందున్, నన్... అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను. సప్తమీ విభక్తి...!

'ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన పాఠం! అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!'

అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా వున్నాయి.

'అవును మాస్టారు... నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి...' అన్నాడు మంత్రి శీనయ్య!!!

నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు.

'కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు. అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో, మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ...
నా బతుకు చిత్రాన్నే మార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా...
చూస్తున్నారుగా... ఇపుడిలా'

'మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లికి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా. ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు. మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి...'
'ఇది నా విన్నపం. కాదనకండి.' అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య ఉరఫ్ శీను.

గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.

'సార్, మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట.'

'మరేమి ఫరవాలేదు... హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట...' అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ... వచ్చి చెప్పాడు సెక్రటరీ.

'మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను. మరీ బుద్ధి లేకుండా తయారౌతున్నాడు ఈ మధ్య!' అంటూ... తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు మంత్రి గారు.

ఆ ఇద్దరూ అంతలా పక, పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీకి.


షరా: అలాంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని చూపించమంటే చూపగలను, కానీ అలాంటి మంత్రులను చూపమని మాత్రం అడగొద్దు... అది అసాధ్యం.

సేకరణ

No comments:

Post a Comment