Tuesday, June 14, 2022

కలియుగ ధర్మం

శ్రీ మహాభారతం…

కలియుగ ధర్మం:
➖➖➖✍️

ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు.

మార్కండేయ మహర్షి “ధర్మనందనా ! కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది,
త్రేతాయుగంలో మూడుపాదాలతో నడుస్తుంది,
ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది.
కలియుగంలో ఒక్క పాదంతో నడుస్తుంది..
ధర్మం క్షీణిస్తుంది. అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు. మానవుల ఆయుస్షు క్షీణిస్తుంది, విద్యలు క్షీణిస్తాయి. విద్యాహీనత వలన మోహం కలుగుతుంది. మోహము వలన లోభము, లోభము వలన కామము, కామము వలన క్రోధం, క్రోధం వలన వైరం ఇలా ఒక దాని వెంట ఒకటి వస్తుంది. వైరం వలన వర్ణ భేధం కలుగుతుంది. వర్ణ బేధము వలన వర్ణసంకరం జరుగుతుంది. హింస ప్రబలుతుంది. బ్రాహ్మణుడు తన ధర్మాలైన జపము, తపము, నియమము, స్వాధ్యాయము విడుస్తారు. శూద్రులు తపస్సు చేస్తారు.

జనపదాలు కౄరమృగాలతో నిండి పోతాయి. అరాచకం ప్రబలుతుంది. రాజులు దుష్టులౌతారు. రాజ్యాధికారం నశిస్తుంది. క్షత్రియులు తమ ధర్మాలైన క్షాత్రము, తేజము, శౌర్యము విడిచి పెట్టి సేవకా వృత్తి అవలంబిస్తారు. పంటలు సరిగా పండవు. చెట్లకు, కాయలు, పూలు, పండ్లు సరిగా కాయవు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని వదిలి వ్యాపారం, వ్యవసాయం చేస్తాడు. నాస్తికులు ప్రబల మౌతారు. దేహ సంరక్షణయే ప్రధానము అనుకుంటారు. పాపం, పుణ్యమూ అనే మాటలకు విలువ ఉండదు. వానలు సకాలంలో కురవవు. విత్తనాలు తాలుగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలు మోసపూరితమౌతాయి. తాకట్టుఆ పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు. సాధు చరితులు, సజ్జనులు రోగపీడితులౌతారు. అధర్మ వర్తనులు దీర్గాయువులై భోగభాగ్యాలు అనుభవిస్తారు. పనికిరాని పంటలు ఎక్కువ ఔతాయి. మానవులలో వివాహేతర సంబంధాలు ఎక్కువ ఔతాయి. పితృ కార్యాలలో అర్పించిన పిండములు ఒకరివి మరొకరు తింటారు. దైవకార్యాలు పితృకార్యాలు కాలానుగుణంగా జరగవు. బ్రాహ్మణులు హేతువాదులౌతారు. వేదాలను నిందిస్తూ పూజలు వ్రతములు విడనాడి దుర్మార్గులు ఔతారు. బంధువులను, దీనులను, దుర్భలులను, దీనులను మోసగించి వారి ఆస్తులను అపహరిస్తారు. తల్లి తండ్రులను, కన్నపిల్లలను చంపు వారిని, విచ్చలవిడిగా ప్రవర్తించు వారిని ప్రజలు పూజిస్తారు. వారి ధనానికి ఆశపడి బ్రాహ్మణులు వారిని ఆశ్రయిస్తారు. ప్రజలను రక్షించి భూమి పాలించ వలసిన ప్రభువు వారి ధనాన్ని దోచుకుంటాడు. స్త్రీలను, ధనాన్ని, భూములను హరిస్తారు. రాజులు వారిలో వారు కలహించి యుద్ధాలు చేసుకుంటారు. అందువలన ప్రజా క్షయం ఔతుంది. కొడుకులు తండ్రులను అవమానిస్తారు. భార్యలు భర్తను అవమానిస్తారు. భార్యాభర్తలు పరస్పరం కలహిస్తారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. దేవకార్యం, పితృకార్యం నడవవు. వేదాధ్యయనం అంతరిస్తుంది. ఈ భూమి మొత్తం దుర్జనులతో నిండి పోతుంది. పదహారు ఏండ్లకే నూరేళ్ళు నిండుతాయి. ఏడెనిమిదేళ్ళకే స్త్రీలు సంతానవతులౌతారు. దానం చేసే వాళ్ళు ఉండరు. ప్రజలు ఒకరిని ఒకరు దోచుకుంటారు. అన్ని తెలిసిన జ్ఞానులు సైతం అధర్మంగా ప్రవర్తిస్తారు. అన్నాన్ని ధనం కోసం అమ్ముకుంటారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు. స్త్రీలు మానాన్ని ధనానికి అమ్ముకుంటారు. శూద్రులు అత్యంత బలవంతులై ఇతరులను సంహరిస్తారు. బ్రాహ్మణులు దిక్కు తోచక నాలుగు దిక్కులకు పారిపోతారు. దోపిడీదారులు, దొంగలూ ప్రజల ధన, ప్రాణాలను దోచుకుంటారు. ప్రజలు అడవులలో తలదాచుకుంటారు. శూద్రులు వేదాంతవిషయాలు వివరిస్తుంటే బ్రాహ్మణులు వింటుంటారు. బ్రాహ్మణులు ధైర్యం వీడి శూద్రులకు సేవకులై చేయరాని పనులు చేస్తారు. కలియుగంలో దేవాలయాలు, పవిత్రమైన ఆశ్రమాలు, బ్రాహ్మణ గృహాలు పాడై పోతాయి. అడవులను ధ్వంసం చేస్తారు. వ్యభిచారం, మద్యపానం ప్రబలి పోతాయి. శిష్యుడు గురువును లక్ష్యపెట్టడు. గురువు శిష్యుడిని మోసం చేస్తాడు. కరవు కాటకాలు ఏర్పడతాయి. ప్రజలలో భయం ఏర్పడుతుంది. కలియుగంలో క్రమంగా ధర్మం క్షీణించి అధర్మం వర్ధిల్లుతుంది.

కల్కి అవతారము:
ఇలా కలియుగం ఆఖరి దశకు చేరగానే శంబళ గ్రామంలో కల్కి అవతరిస్తాడు. అతని పేరు విష్ణుయశుడు. అతనికి సంస్మరణ చేతనే సకల వేదాలు, శాస్త్రాలు అవగతమౌతాయి. అతను సార్వభౌముడౌతాడు. అతడు అధర్మవర్తనులను సంహరించి ధర్మం నిలబెడతాడు. ఆ పై అశ్వమేధయాగం చేస్తాడు. అతను నిలిపిన ధర్మం అనుసరించి బ్రాహ్మణులు తమ ధర్మం నిర్వర్తిస్తారు. కృతయుగం ఆరంభమౌతుంది. ధర్మం నాలుగు పాదాల విలసిల్లుతుంది. దేవాలయాలు ఆశ్రమాలు పూర్వవైభవం సంతరించుకుంటాయి. సకాలంలో వానలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రజల ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తిరిగి కాలచక్రం మొదలౌతుంది. కనుక ధర్మనందనా ! నీవు బ్రాహ్మణులను అవమానించకు వారికి ఇష్టం వచ్చినవి చేయుము. సమస్త భూతముల యందు దయకలిగి ఉండు. ప్రజలను కన్నబిడ్డలవలె పాలించు. పాపాత్ములను శిక్షించు. అజ్ఞానం ప్రబలకుండా చూడు. అహంకారం వదిలి పెట్టు. ఎల్లప్పుడూ సత్యమే చెప్పు. నీవు భరతవంశ సంజాతుడవు నీకు అన్నీ తెలుసు. ప్రాజ్ఞుడవు నీకు చెప్పవలసిన పని లేదు” అన్నాడు.*🙏

. 🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment