నవరంధ్రాలు - విషయ'జలం'
నడిసముద్రంలో ఓడకు చిల్లుపడితే
నావికుని మనోస్థితి ఎలా వుంటుందో ఊహించండి...
శరీరమనే నౌకకు కూడా నవరంధ్రాలున్నాయి...
అందులోకి విషయ'జలం' దూరి...
కొద్ది కొద్దిగా మునుగుతున్నాం...
ఆ మునగటాన్నే 'జీవితం'గా అనుభవిస్తున్నాం...
పూర్తిగా మునగడం(మరణం) ఖాయం...
నీ ఆత్మకంటే నీకు మృత్యువు అత్యంత సన్నిహితంగా ఉంది...అంటారు శ్రీరామచంద్రులవారు భరతునితో.
* * *
పుట్టి పెరిగి నశించే స్వభావం కలిగింది దేహం.
ఈ దేహ తాదాత్మ్యత వల్లనే మృత్యుభీతి ఉండేది.
శాశ్వతమైన ఆత్మతో మమేకం వల్ల ఈ శరీరం తోచదు...
అందువల్ల మరణభయం ఉండదు...
అందుకే "శరణాగతి"కి పెద్దపీట వేశారు రమణులు.
శరణాగతి అంటే-
భవమరణాలు లేని మహేశునికి తనను తాను అప్పగించుకోవడం.
ప్రయాణికులందరూ తమ ప్రాణాలను డ్రైవరుకు అప్పజెప్పి హాయిగా నిద్రపోయినట్లుగా.
సద్గురు యమధర్మరాజు గారు
ఆత్మనెరిగినవానికి మృత్యువు అనేది
ఒక పసందైన నాటకం...అంటారు.
* * *
దేహము - కుండ.
ఆత్మ - కుండలోని ఆకాశం.
కుండ ఉన్నా...పగిలినా...అందులోని ఆకాశానికి నష్టమేమీ లేదు...
నేను అనేది చిదాకాశం.
కుండకు లోపలా, వెలుపలా ఆకాశం ఉన్నట్టు
తనువుకు లోపలా, వెలుపలా చిదాకాశమే(నేనే) ఉన్నది.
నా చిన్నప్పుడు మా అమ్మ తిడుతుండేది...
ఇంట్లో అలా ఓ మూల కూర్చోకపోతే...
బయటకెళ్ళి ఆడుకోవచ్చు కదా...! అని.
నేను పెద్దయ్యాక గురువుగారు కూడా అలానే మందలించారు-
ఈ తనువులో మాత్రమే నేనున్నాను అని ఎందుకుంటావు...?
వెలుపల కూడా నేనున్నాను...అని ఉండు...
అని ఈ నేనును తనువు నుండి విశ్వంలోకి వ్యాపింపచేశారు...
తనువు లోపలే ఉంటే మరణభయం ఉంటుంది.
వెలుపల కూడా నేనున్నాను అని ఉంటే
మరణభయం పోతుంది...
రమణుడు తన 16వ యేట అలానే వచ్చేశాడు
తన వొంటి నుండి...
తన ఇంటి నుండి...
అప్పా! నీ ఆజ్ఞ మేరకు వచ్చానంటూ...
అరుణాచలేశునికి శరణాగతి చెందారు...
అంతటితో రమణుని జీవితం ముగిసింది.
తరువాత రమణుడి రూపంలో నడయాడింది ఈశ్వరుడే...
ఇక అక్కుణ్ణుంచి ఉన్నది రమణుని చరిత్ర కాదు...
రమణభక్తుల చరిత్రే...
దేవునికి చరిత్ర ఉండదు...
ఉండేది భక్తుల చరిత్రే...
భక్తులచరిత్రలో భగవంతుడు ఉంటాడు.
భగవంతుని చరిత్రలో భగవంతుడు తప్ప ఎవరూ ఉండరు.
* * *
భక్తులెవరూ లేక భగవంతుడు "ఒక్కడే" మిగలడం - భక్తియోగం.
భగవంతుడు కూడా లేక "ఒక్కటే" మిగలడం - జ్ఞానయోగం.
No comments:
Post a Comment