ఆత్మరక్షణ, పోషణకు పరమాత్మచింతనే మార్గం
🌈♾💫🌈♾💫🌈♾💫🌈♾💫🌈
🌈 జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే.
💫 సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మానవ జీవితం కష్టసుఖాల సంగమం. ఆపదల్లో ఉన్నప్పుడు కూడ ఈశ్వర చింతన కలిగి ఉండనివారున్నారీ లోకంలో. అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వారిని నాస్తికులనడమే సమంజసం. వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్ఛరణ చేయరు.
🌈 ‘‘జాతస్య హి ధృవో మృత్యుః’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అంచేత మొండికట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం.
🌈 ఉత్కృష్టమైన మానవజన్మ ఎత్తికూడ అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం చింతించవలసిన విషయం. అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. ఉన్నతమైన మానవజన్మనెత్తి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న మనిషి కాలాన్ని వ్యర్థంచేసే బదులు ఏ క్రిమికీటకంగానో పుట్టి ఉంటే ఈ మానుషజన్మకు కళంకం ఉండదు కదా!
💫 సర్వకాల సర్వావస్థలయందు సంసార సుఖభోగాల్లో పడినవారికి ఎంత ఆయుష్షుంటే ఏం లాభం? తనకు తెలీకుండానే అది హారతికర్పూరంలా కరిగిపోతుంది. కాలం వృధాగా పోతోందని గ్రహించిన వాడికి క్షణకాలమైనా చాలు... మోక్షంకోసం ప్రయత్నించి సిద్ధిపొందొచ్చు. మనం చేసే మంచి పనుల్లోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి పది మందికి పనికొచ్చే సత్కార్యాల్ని చేయాలి.
🌈 ఈశ్వరోపాసనకి పూజ, ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివని తెలుసుకోవాలి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులవడానికి గాని యత్నించరు. అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది.
💫 ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాడికి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. పండితులు, భాగవతులు తమ గానం చేత, నృత్యం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు. మరి పామరుల సంగతేంటి? రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే. తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు. దాంతో సంసార భోగవాంఛలు వాటంతటవే నశిస్తాయి.
💫 మనమంతా పుణ్యంకోసం గంగానది స్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి. పరోపకారం, సత్యం పలకడం, భూతదయ, సత్‌సాంగత్య విద్య దానాదిక ధర్మాలు, మాతృపితసేవ, బ్రహ్మచర్యం, ఈశ్వర స్తుతి మున్నగు ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. శ్రీహరిని పూజించనివారు జీవచ్ఛవంబులనే చెప్పాలి. అందుకే అంటారు... పరమాత్మ చింతన లేని జన్మవ్యర్థం అని.
No comments:
Post a Comment