*అహింస*
*‘అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః’ అని భారతం ప్రబోధించినట్టే అహింసను సర్వమతాలు సమర్ధించాయి.
*‘సకల జీవుల పట్ల దయతో ప్రవర్తిస్తూ హింసించకపోవడమే అహింసయని, ఏనుగు పాదముద్రలో సకల జంతువుల పాదముద్రలు ఇమిడినట్టే, అహింసలో సర్వధర్మాలు ఇమిడి ఉంటాయని’ యుధిష్ఠిరునికి ఉపదేశిస్తాడు భీష్ముడు.
*"హింస అధర్మమైనప్పుడు వేదోక్త ధర్మము ముక్తిప్రదం కాదనియు, ధర్మశాస్త్రాలలో చెప్పబడిన సోమపానము, పశుహింస , మాంసభక్షణము వంటి అనాచారాలు మోక్ష హేతువులు కాదని” వాదించిన శుకుడితో.. "యఙ్ఞకర్మల హింస ఉపాధి చేత హింస కానందున అహింసయేననియు, విరక్తుడు ధర్మ నిరతితో , ముముక్షువులు నిరహంకారంగా చేసే హింసలు అహింసయేనని” జనకుడు వివరించినట్టు దేవీభాగవతం తెలిపింది.
*“నేల, నీరు, ఆకాశం జీవులతో నిండి ఉన్నందున, రైతు పొలం దున్నుచున్నప్పుడు, మానవుడు నీరు త్రాగుతున్నప్పుడు లేక గాలి పీల్చుచున్నప్పుడు జీవులెన్నో నశించక తప్పదనియు, హింస చేయనివాడు లోకంలోనే ఉండడనియు” పార్వతీదేవితో శివుడు పలికినట్టు అనుశాసనిక పర్వం తెలిపింది.
*“యుద్ధం హింసతో కూడినప్పటికీ క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధ నివారణ చర్యలు విఫలమైనప్పుడే రణరంగానికి దూకాలని” భగవద్గీత చెప్పినట్టుగా రాజ్య పాలకులు సంధి ప్రయత్నాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
*కృష్ణ రాయబారం విఫలమైన తరువాతనే కురుక్షేత్ర సంగ్రామం , అంగద రాయబారం విఫలమైన తరువాతనే రామరావణ యుద్ధం జరిగినట్టు ఇతిహాసాలు తెలిపాయి.
*‘దానము, ధర్మము, తపస్సు, అహింస, యఙ్ఞము, పరిశుద్ధత, మంత్రము, అనుష్ఠానము, సత్యము - అహింసా రూపాలనియు, అహింస అనే సంపద ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లేనని’ గ్రంథాలు బోధించినట్టుగా సర్వశ్రేష్టమైన అహింసా మార్గాన్ని అనుసరించడం ఉత్తమం.
*‘అహింసను మించిన శ్రేష్టమైన ధర్మం, హింసను మించిన క్రూరమైన అధర్మం లేదని’ మలయాళ స్వామి పలికినట్టు సత్యం, అహింసలనే ఆయుధాలుగా ధరించి ఆంగ్లేయుల నుండి భారత స్వాతంత్య్రం సాధించాడు మహాత్మా గాంధీ. యుద్ధకాంక్షతో రగిలిపోయిన అశోకుడు కళింగ యుద్ధానంతరం అహింసనే ఆశ్రయించినట్టు చరిత్ర తెలిపింది.
*“జనులు స్వీకరించే ఆహారానికి అనుగుణంగానే ఆలోచనలు కలుగుతాయనియు, ఆలోచనల ప్రకారమే జీవన విధానం ఉంటుందనియు, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరమని’ కబీర్ దాస్, ‘మాంస భక్షకుల హృదయం కఠిన తరమవుతుంది కనుక పరమాత్మ ప్రకటితం కాదని’ దాదూ దయాళ్ చాటిన సత్యాన్ని గ్రహించి సర్వజీవుల యెడల దయగా ప్రవర్తిస్తూ జీవించడమే ఆయురారోగ్యాలను కాపాడుతూ అంతర్యామిని చేరే మార్గాన్ని సుగమం చేస్తుంది.
….నారంశెట్టి ఉమామహేశ్వరరావు.
No comments:
Post a Comment