Wednesday, August 3, 2022

శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర

 🧘‍♂️ *27- శ్రీ రమణ మార్గము* 


*శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర*


*ముందుమాట*


నేను చదువుకునే రోజుల్లో, చలంగారి రచనలు చదివి, ఆయనకో ఉత్తరం రాశాను. దానికి సమాధానంతో పాటు, భగవాన్ శ్రీ రమణమహర్షి ఫొటో ఒకటి పంపించారు.


ఆ భగవానెవరో , నాకు తెలియదు కాని ఆ ఫొటోలో వున్న ఆయన - His Gracious Smile ఆ క్షణాన నన్ను ఆకర్షించి, ఆకట్టుకుంది. అంతే! వెంటనే ఆ పటాన్ని ఫ్రేమ్ కట్టించాను. దాన్ని చూసి నా మిత్రులు కొందరు చిరునవ్వారు.


ఆ తర్వాత నాలుగేళ్ల కు చిన్నారావుగారితో కలిసి చలం గారిని చూడ్డానికి, తిరువణ్ణామలై వెళ్ళాను. ఆ మధ్యకాలంలో చలంగారు భగవాన్ మీద రాసిన కొన్ని వ్యాసాలు చదివాను. భగవాన్ ప్రతి ఒక్కరినీ ‘‘నిన్ను నీవు తెలుసుకో” అంటారు. ఎవరికైనా ఆ సూచన సరైనదీ, సూటియైనదే అనిపించింది.


శ్రీ రమణస్థాన్ లో వున్నన్ని రోజులూ, రోజూ చలంగారితో కలిసి, శ్రీ రమణాశ్రమానికి వెళ్లేవాడిని. తిరిగి శ్రీ రమణస్థానానికి వస్తే, సౌరిన్గారు భగవాన్ గురించి ఎన్నో సంగతులు చెప్పేవారు.


ఆ తర్వాత నాకు సంవత్సరంలో ఎక్కువ కాలం శ్రీ రమణ స్థాన్లో వుండే అవకాశం లభించింది. ఆ కాలంలో భగవాన్ రచనలను, భగవాన్ గురించి అనేకమంది రాసిన గ్రంథాలను, పత్రి వచ్చిన సమాచారాన్ని, శ్రీ రమణాశ్రమ గ్రంథాలయంలో లభ్య విషయాల్ని చదివి, నాసంస్కార స్వభావాల్ని బట్టి భగవాన్ని గ్రహించాను.


భగవాన్ గురించి నాకేమి అర్థమైందో, దాన్నంతా,  ఆయన మాటలతోనే రాసుకున్నాను. చివరికి అది ఆయన జీవిత తత్వంగా రూపొందింది.


-🖌️కృష్ణ



*పరిచయం*


ఈ భూమి మీద అప్పుడప్పుడూ, అక్కడక్కడా అపురూపంగా పూసే పువ్వులు వంటివారు ఈ గురువులూ, జ్ఞానులూ, మహర్షులూ, ప్రపక్తలు. అటువంటి వారిలో, భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒకరు. సృష్టి తమకు ఇచ్చిన సౌందర్యాన్ని, సౌరభాన్ని వెదజల్లి, కొంతకాలం ఈ భూమి మీద వుండి, తక్కిన వాటిమల్లేనే ఆ పువ్వులూ నేల రాలిపోతాయి. మనం వివేకవంతులమైతే, ఆ అందాన్ని అనుభవించి, ఆ సౌరభాన్ని ఆఘ్రాణించి ఆనందిస్తాం. మహర్షుల విషయంలోనూ అంతే !


ఇరవైఐదు వందల సంవత్సరాల క్రిందట బుద్ధ భగవానులూ, పన్నెండు వందల సంవత్సరాల కిందట శ్రీ శంకరాచార్యులూ మహాభినిష్క్రమణ గావించారు. వారు తాము తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రచారం చేసి, బోధించారు. వారి మాదిరిగా కాక, భగవాన్ మహాభినిష్క్రమణ గావించినా, అరుణా చలంలో సహజ సమాధిస్థితిలో స్థిరనివాసులై, తన్నర్థించిన వారికి ఆత్మ విచారణ మార్గాన్ని సూచించారు.


తమను తాము తెలుసుకున్న మహాత్ములందరూ బాహ్య విషయాల్లో ఒకే విధంగా ఉండకపోవచ్చు. కాని, వారంతా ప్రేమ మయులు, కరుణాస్వరూపులు. వారు ఏం చేసినా, ఏం చెప్పినా, ఏం రాసినా - గీసినా - పాడినా అదంతా సమస్త ప్రాణికోటి పురోభి వృద్ధికోసమేనని, మనం గ్రహించాలి. ఎందుకంటే, జీవితంలో సత్యాన్వేషణ చేసిన మహాత్ములందరూ, కొన్ని జీవన ఫలాల్ని పోగుజేసి, బుట్టల్లో నింపుతారు. అటువంటివారు ప్రజల మధ్య వున్నా, రోడ్డు పక్కన కూర్చున్నా, ఎక్కడ ఎట్లా వున్నా, తాము సేకరించిన ఫలాలను, ప్రేమతో తమ తమ రీతుల్లో అందరికీ పంచుతారు.


మధురకు ముఫ్పై మైళ్ళ దూరంలో “తిరుచ్చు?" అనే గ్రామంలో, 30-12-1879 న, సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వెంకట్రామన్ కి , హైస్కూల్లో చదివేరోజుల్లో - పదహారవ - ఏట - అతని ఆశ, ప్రయత్నం, కోర్కె, సాధన, ధ్యానం, తపం, : జపం, యోగం, శిక్షణ, నియమ - నిష్టలు, ఏమీ లేకుండానే అకస్మాత్తుగా మృత్యు అనుభవం కలిగింది. అది అన్ని అనుభవాల్లోకి శక్తి వంతమైన ఏకత్వానుభవం.


ఆ అనుభవంతో వెంకట్రామను సద్యోముక్తి కలిగింది. సర్వైక్యభావం సిద్ధించింది. అసలు పరమార్ధాన్ని తెలుసుకున్నారు. ప్రత్యేక గురువు అంటూ ఎవరూ లేకుండానే, కేవలం స్వబుద్ధితో విరాట్ స్వరూపాన్ని, ఆత్మ శాశ్వతత్వాన్ని, అసలు సత్యాన్ని, అంతిమ జ్ఞానాన్ని అవగాహన చేసుకున్నారు. అఖిల జగదాచార్య సింహాసనాన్ని అధిష్టించారు.


అనుభవంతో, సూర్యోదయమైన తర్వాత పద్మం వికసించినట్లు, మృత్యు వెంకట్రామన్ హృదయ పద్మం, పూర్తిగా విచ్చుకుంది. అప్పటి నుంచి ఆయన ఆత్మనిష్టులై, సహజ సమాధి స్థితిలో వున్నారు.


మెరపువలె వచ్చిన ఆ అనుభవం, మెరపువలె పోక, ఆ స్థితి ఆయనలో చివరి వరకు స్థిరంగా నిలిచింది. ఆ తర్వాత అన్నీ వదిలేసి, అరుణాచలం చేరి, ఏదీ అంటకుండా, ఏదీ పట్టకుండా, ఏదీ తనకు కప్పకుండా, ఏదీ తనను మూయకుండా, బాధించకుండా, బంధించకుండా ఏదీ భారంకాకుండా అలలు అణగిన మహాసాగరం మాదిరిగా, ఆత్మలోతుల్లో మరో యాభైనాలుగేళ్ళు జీవించారు.


క్రమంగా ఆయన చుట్టూ భక్తుల, శిష్యుల, పరిచారకుల, జిజ్ఞాసువుల, సాధకుల, సాధువుల, యాత్రికుల, మేధావుల రూపంలో పెద్ద ప్రపంచం అల్లుకుంది. స్థితప్రజ్ఞుడై సమస్త వాంఛల్ని విసర్జించి,కష్ట సుఖలకు, రాగ ద్వేషాలకు, భయక్రోధాదులకు అతీతుడై, అరుణాచలంపై సహజ సమాధి స్థితిలోవుండి, నిత్య కృత్యాల్ని నిర్వర్తించుకుంటున్న వెంకట్రామన్ని. కావ్య కంఠ గణపతి శాస్త్రిగారు చూశారు. అందరూ అన్ని కాలాల్లో ఏ సత్యాన్ని వెదికారో, ఏ జ్ఞానాన్ని కాంక్షించారో, ఆ సత్యమే.ఆ జ్ఞానమే అరుణాచలంపై వారికి దర్శన మిచ్చింది. ఆ తర్వాత ఆయన వెంకట్రామన్ సంగతులు అడిగి తెలుసుకుని, వారికి "భగవాన్ రమణ మహర్షి," అని నామ కరణం చేశారు.


క్రమంగా గ్రంథాలూ, అనుభవాలూ, ఉవాచలూ వెలువడ్డాయి. దేశ విదేశీయులు భగవాని కి ఆకర్షితులయ్యారు. గొప్ప, గొప్ప నిర్మాణాలతో త్వరలో శ్రీరమణా శ్రమం ఏర్పడ్డది.


భగవాన్ కౌపీనధారియై, చాలా వరకు మౌనంగా వున్నా, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూవుండేవారు. ఆయన దర్శనం అందరికీ, అన్ని వేళలా అందుబాటులో వుండేది. సహజమైన ఆయన చిరునవ్వు, సమ్మోహనమైన ఆయన చూపు, నిర్మలమూ పవిత్రమూ అయిన ఆయన వదనం, పసిబిడ్డవంటి తత్వం, ప్రతిఒక్కరినీ ఆకర్షించేవి.


అటువంటి మహోన్నత స్థితిలో వున్న భగవాన్ జీవితం, ఆశ్రమంలో ఓ నిర్ణీత కార్యక్రమంలో లిప్తపాటు తేడా లేకుండా నడిచింది. ఆయన ప్రతి పనినీ తనదిగా, ప్రేమగా, జాగ్రత్తగా, నెమ్మదిగా చేసేవారు. ఏ వస్తువు ఎక్కడ వుండాలో, అక్కడ వుండేటట్లు చూసేవారు. రేడియో ప్రకారం గడియారాన్ని సరిచేయించే వారు. రోజూ కేలండర్ మార్పించేవారు. హాలూ, సోఫాలూ శుభ్రంగా వున్నాయో, లేదో గమనించేవారు.


జీవితంలో అనేక విధాల అణగారినవారూ, అధోగతిలో వున్నవారూ, శారీరకంగా మానసికంగా అలసినవారూ, భగవాన్ సమక్షంలో శాంతిని, ఆనందాన్ని అనుభవించేవారు.


భగవాన్ సన్నిధే, ఒక దివ్యబోధ. కాని, కొందరు ప్రశ్నల జాబితాతో వచ్చేవారు. అడిగిన వెంటనే భగవాన్ అందరికీ సమా ధానం చెప్పేవారు కాదు. కాని, ఎప్పడో ఒకప్పుడు, ఓపికతో వేచి వున్న వారికి, వారి ప్రశ్నలకు ఆయన్నించి సమాధానం వచ్చేది. కొందరు ఆయన సన్నిధిలో కూర్చోగానే, తమ సంశయాల ప్రశ్నల సంగతే మరచిపోయేవారు. “ఆయన సమక్షంలో అప్రయత్నంగా మనసు తిరుగుళ్ళూ, ఆలోచనల పోకళ్ళూ అద్భుతంగా అణగేవి” అంటారు. అనుభవజ్ఞులు.


"భగవాన్ ఎదురుగా కూర్చుని లోదృష్టితో గమనిస్తే ఆరాటం, ఆందోళన, అశాంతి పోయి, హాయిగా, ఆనందంగా వుండేవార” మని కొందరు అంటారు.


“ఆయన సన్నిధిలో ఒక అసాధారణమైన, చిత్రమైన, అద్భుతమైన - అన్నిటికీ భిన్నమైన వాతావరణం వుండేది” అని కొందరు చెప్పేవారు.


తాము ఏ అరమరికా, వేరు ఆలోచనా లేకుండా తమను భగవానికి అర్పించుకుని, ఆశ్రమవాసం గడిపేవారంతా, ఏదో ఒక పని చేస్తూ, ఎప్పుడూ భగవానికి సన్నిహితంగా వుండేవారు. ఆ సన్నిహితమే వారి జీవితాలకు ఒక వరంగా, అదృష్టంగా, ఆనం దంగా భావించేవారు. ఆర్తులకూ, అన్వేషకులకూ, భక్తులకూ, సాధువులకూ, పరిచారకులకూ, యాత్రికులకూ అందరికీ శ్రీ రమణా శ్రమంలో భగవాన్ ఒక దీపస్తంభంలాగ నిలిచి వెలిగారు. సన్నిధిలో వున్న వారినే గాక, తన మార్గాన నడిచే వారందరికి ఆయన మార్గ దర్శకుడు. శారీరక-మానసిక అలసట చెందిన వారు ఆ మహావృక్షం క్రింద సేదదీర్చుకునేవారు. పాతాళగంగ మాదిరిగా ఆయన ఎంతో మంది దప్పిక తీర్చారు. అంతేకాని వారిపై మూఢనమ్మకాన్ని రుద్ద లేదు. ఏ అతీత శక్తుల్నీ ప్రదర్శించలేదు.


తనను సమీపించి ప్రశ్నించిన వారిని “ముందు నిన్ను నీవు తెలుసుకో! తర్వాత అన్నీ తెలుస్తాయి” అనేవారు భగవాన్. పండితులు, పీఠాధిపతులు, మతాధిపతులు సామాన్యమైన ఆ సలహా, సూచన విని, “తమకు ఆ మాత్రం తెలియదా” అని కొందరు అహంకరించేవారు. తమకు సరిగ్గా సమాధానం చెప్పలేదని మరి కొందరు బాధపడేవారు. భగవాన్ తమను మూర్ఖులుగా భావించారని కొందరు ఆవేశపడేవారు. ఎందుకంటే, భగవాన్ సలహా, సూచన తమకు ఏనాడో తెలుసునని వారి భావన. అందుచేత తమసంగతి కాక, మరి ఏ సంగతి అయినా చెప్పమనేవారు. ఆ సంగతులు చాలా వరకు పునర్జన్మ, మృత్యువు తర్వాత ఏమిటి - మొదలైన విషయాలు.


కాని, గణపతిశాస్త్రిగారు భగవాన్ జీవిత చరిత్ర రాస్తూ, “భగవాన్ పుట్టినరోజు మానవాళికే మహనీయమైనది. అది చరిత్రలో మరపురాని రోజు. ఈ తరానికి భగవాన్, మహాప్రవక్త. బుద్ధుడు, శంకరాచార్యులు మొదలైన వారివలె, ముందు తాను బంధ విముక్తులై, తర్వాత యావత్ మానవాళిని ప్రేమతో విముక్తిపరచ యత్నించారు. ఆత్మశక్తితో ధర్మాన్ని స్థాపించారు. బుద్ధుని దీక్ష, దయ, ప్రేమ, సమత్వం శంకరాచార్యులవారి మేధాశక్తి, వితరణ, వివేకం, తాత్విక దృక్పథం కలిసి పుంజుకున్న పుణ్యమూర్తి భగవాన్.


“భగవాన్ తీక్షణమైన చూపు, సూర్యకాంతి వంటిది. దయకల ఆయన చిరునవ్వు, చంద్రకాంతివలె చల్లగా, హాయిగా, శాంతి నిచ్చేది.

మూర్తీభవించిన చిదానందమూర్తివలె కనుపిస్తారు భగవాన్,” అని వర్ణించారు.


 *ఓం అరుణాచలశివ* 

No comments:

Post a Comment