Wednesday, August 3, 2022

🔥🔥పుణ్యకార్యాలే చేయాలి!🔥🔥 🍒పాప, పుణ్యాల అనుభవం ఎంత కాలం?

 🔥🔥పుణ్యకార్యాలే చేయాలి!🔥🔥

🍒పాప, పుణ్యాల అనుభవం ఎంత కాలం?

🍒మానవజన్మ ఎలా పుడుతుంది? 

అన్నది ప్రశ్న అయితే....స్త్రీ, పురుషుల సంయోగమే.. మానవ జన్మకు మూలకారణం... అన్నది జవాబు.

అది భౌతిక పరమైన జవాబే కానీ., సరైన జవాబు అది కాదు.

🍒మరి ఏది సరైన జవాబు?

చేసుకున్న పాప, పుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన జవాబు.

అయితే... ఎంతకాలం ఈ అనుభవం? అనేదీ ప్రశ్నే. దానికీ జవాబు ఉంది.

🍒చేసిన పాప, పుణ్యాల గురించి ఈ లోకంలో తలచుకున్నంత కాలం... ఆ పాప, పుణ్య ఫలాన్ని అనుభవించ వలసిందే.

ఇదేం తీర్పు... దీనికేదైనా నిదర్శనముందా...అనే సందేహం కలగచ్చు.

🍒ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాభారతంలో ఉంది.

🍒ఆ కథ ఏమిటంటే....

కృతయుగకాలంలో., ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప దాత. దశమహాదానాలే కాక షోడశమహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల, అతను మరణించాక., దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు. ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ... ఆనందిస్తున్నాడు. అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు.

🍒ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూతలు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది. నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు.‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి... ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.‘నిరూపిస్తావా’ అని అడిగారు దేవదూతలు.‘నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.

🍒దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు.

ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసున్న వారెవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోకవాసులందరిలోకి అతివృద్ధుడు మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి..... దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.

🍒‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు.

🍒అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు.

 ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు.

అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు.

🍒 ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు నాళీజంఘుడు.అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.

🍒మీరెవరో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడంలోనూ మీరు చక్రవర్తే. ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం. దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనేకదా ఈ కొలను ఏర్పడింది. అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు. నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ..నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు.

🍒దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు. ఇదీ కథ.

🍒కనుక కలకాలం అందరూ చెప్పుకునే విధంగా పుణ్యకార్యాలే చెయ్యాలి.

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment