Saturday, August 20, 2022

‘సత్యదర్శనం' - కావాలంటే మాయ నుండి బయటపడాలి

 ‘సత్యదర్శనం' - కావాలంటే మాయ నుండి బయటపడాలి
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

🌈 మాయలో ఉండబట్టే మానవులు సంసార జంజాటంలో పడి ఉంటున్నారని కూడా విజ్ఞులు చెబుతారు. కామం, క్రోధం, మోహం వంటివన్నీ మాయలో రకాలు. ఉన్నదానిని లేనట్టుగానూ లేని దానిని ఉన్నట్టుగానూ భ్రమించడమూ మాయే. తాత్కాలికంగా ఆవిర్భవించి శాశ్వతమైనదన్న భ్రమను కలిగించేదే మాయ అని కొందరు పేర్కొంటారు. మాయను ఒక అయోమయావస్థగా కొందరు వర్ణించారు.

🌈 భారత పురాణ కథలలో, గ్రంధాలలో మాయ అనే పదం పలు మార్లు వస్తుంటుంది. ఈ మాయ అనేది విజ్ఞతను కప్పివేస్తుంది. అయినప్పటికీ అదీ ఈశ్వర విభూతే. మాయ కూడా అమ్మవారి ఒక రూపమే. కొన్ని పురాణాలు వైష్ణవ గ్రంథాలు మాయను విష్ణువుకున్న తొమ్మిది శక్తులలో ఒకటని కూడా వర్ణించాయి. మాయ చాలా బలమైనది. ఎందరో మహానుభావులు కూడా దానికి లొంగిపోయారు. 

🌈 ఒక పర్యాయం చిరంజీవుడైన మార్కం డేయుడు విష్ణువుతో తాను మాయను అనుభూతి పొందాలని కోరినట్లు భాగవతంలో ఉంది. ఆ మేరకు విష్ణువు ప్రళయకాలాన్ని సృష్టించాడు ఒక ఆకుపై వటపత్ర శాయిగా బాలుని రూపంలో దర్శనమిచ్చాడు. ఆ రూపంలో ఉన్నవిష్ణువు మార్కండేయుణ్ని మింగేశాడు. ఆ విష్ణువు ఉదరం లోపల మార్కండేయుడు ఎన్నో లోకాలు చూశాడు. దానిలో ఈ లోకంలోని తన ఆశ్రమం వంటివన్నీ కనిపించాయి. మళ్లీ బయటకు వచ్చిన మార్కండేయుడు ఈ వటపత్రంపై తేలుతున్న బాలుణ్ని చూశాడు. అతన్ని ఎత్త్తుకుందామనుకున్నాడు. మరుక్షణం అంతా మాయమై మార్కండేయుడు మళ్లీ తన కుటీరంలో ఉన్నాడు. 

🌈 ఒక జల ప్రళయ కాలంలోనే విష్ణువు మార్కండేయునికి ఈ మాయ అనుభూతిని కలిగించాడని మరో కథ. 

🌈 విష్ణు మాయ గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నారదుడు ఒక సందర్భంలో విష్ణు మాయకు లోనై ఒక్క నిమిషంలోనే సంసార బాధలన్నీ చవిచూశాడనేది మరో కథ.

🌈 ఇక మాయ రకరకాలుగా ఉంటుంది. యశోదకు తన ఉదరంలో బ్రహ్మాండాలన్నిటినీ చూపిన శ్రీకృష్ణుడు ఆమెను మళ్లీ మాయతో కప్పివేశాడు. లేని పక్షంలో తన కుమారుడు ఆ మహావిష్ణువు అనే స్పృహలో ఉంటే ఆమె కృష్ణుని తన కుమారునిగా చూసేది కాదు. ఆ బాలకృష్ణుని చేష్టలకు ఆనందం పొందేది కాదు. ఆ స్థానంలో భయభక్తులు ప్రవేశించి ఉండేవి. 

🌈 ఇటువంటి మన ఊహకందని వాటినన్నిటినీ గుది గుచ్చి ఒక తెలుగు సినీ కవి ఒక పాటలో ‘కలయో, నిజమో, వైష్ణవ మాయయొ, తెలిసీ తెలియని అయోమయములో… అని తన బాణీలో రాశాడు. ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. మాయ గురించి ఎన్నో పురాణ కథల్లో ఉంది. అటువంటి వాటిలో అంతగా ప్రచారంలోలేని ఒక పురాణ కథ తెలుసుకుందాం.

🌈 పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుని ప్రస్తావన వినాయక చవితి కథలో కూడా ఉంటుంది. అయితే ఈ కథ వినాయక చవితి వ్రతకల్పంలోని కథకు భిన్నంగా ఉంటుంది. దానికి కల్ప భేదం కారణమని, ఒక్కో సంఘటన ఒక్కో కల్పంలో ఒక్కో విధంగా జరిగి ఉంటుందనేదే దీనికి విజ్ఞులు ఇచ్చే సమాధానం. 

🌈 గజాసురుడు చాలా కాలం దేవతలతో పోరాడేవాడు. అతను ఒక పర్యాయం శివునితో పోరాడడానికి బయలుదేరుతూ తనకు యుద్ధంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు విఘ్నాధిపతి అయిన వినాయకుని పూజించాలని నిర్ణయించాడు. ఇది శివునికి తెలిసింది. అసురుడు గణపతిని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించి తీరుతాడని భయపడ్డాడు. తన కుమారుడేమో భక్తితో పూజించిన వారిని అనుగ్రహించి తీరాలి. అందువల్ల తనకు సాయం చేయాలని ఆయన జగన్మాతను కోరాడు. నీవు నీ మాయారూపం పొంది ఆ రాక్షసుని మదిలో ప్రవేశించి అతను యుద్ధానికి ముందు గణేశ పూజ చేయకుండా అపమని కోరాడు. ఆమె అందుకు అంగీకరించి అతనిని కమ్మేసింది. గజాననుడు ఉదయాన్నే నదీ స్నానం చేసి గణేశారాధన చేయాలని నిర్ణయించుకున్నాడు. నదికి వెళ్లాడు. నీటిలోతన ప్రతిబింబం చూసుకున్నాడు. ‘ఆహా ఏమి నా రూపం. నేను కదిలితే భూమి కంపిస్తుంది. నేను కొడితే పర్వతాలు సైతం పిండి అవుతాయి. నేను తలెత్తి నిలబడితే మేఘాలు చిందర వందర అవుతాయి. త్రిలోకాలు నన్ను చూసి గడగడలాడతాయి. అటువంటి నేను ఒక గజముఖుడైన దేవుణ్ని అర్చించడం ఏమిటి అని గణేశ పూజ మానేశాడు. అహంకారంతో విర్రవీగుతూ యుద్ధానికి సిద్ధపడ్డాడు.

🌈 శివుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుని సంహరించాడు. అయితే ఈ విషయం విన్న గణేశుడు వచ్చి మాయా దేవితో తల్లీ! నీవు నా భక్తుడు ఒకరు నాకు పూజ చేయకుండా మనసు మార్చావు కనుక నీవు ఇకపై అజ్ఞానుల మనసుల్లో ఉండిపోవాలని శపించాడు. దానితో అజ్ఞానులను మాయ కప్పేస్తుంటుంది. విజ్ఞానులను ఆవరించినా వారు దాని నుంచి బయటపడాలి. అజ్ఞానం, మాయ అంటే ఏమిటో కాదు క్రోధం, లోభం, మదం, వ్యామోహం వంటివన్నీ వాటి ప్రభావాలే. అజ్ఞానానికి మాయకు గురై కోపం వంటి వాటికి ఒక క్షణం వశమైనా మనలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొలిపి బయటపడాలి.  

No comments:

Post a Comment