Monday, August 15, 2022

🌹. అహంకారం ఉన్నప్పుడే కాంక్షలు ఉంటాయి 🌹

 🌹. అహంకారం ఉన్నప్పుడే కాంక్షలు ఉంటాయి 🌹

వ్యక్తి మనసులో ఏ కాంక్షలు లేకుండా ఉండాలి. మనసు శూన్యంగా మారాలి. నిర్మలత్వంతో నిండిపోవాలి. అప్పుడు అతను అపూర్వ శక్తితో నిండిపోతాడు. అద్భుతమైన చైతన్యం అతన్ని ఆవహిస్తుంది. అతనికి ఆ స్పృహ ఉండదు. అప్పుడు అతనిలో ప్రతీదీ సహజంగా పరివర్తన చెందుతుంది. సూర్యోదయం జరిగినట్లు, చంద్రుడు 🌒 ఉదయించినట్లు, పూలు వికసించినట్లు, నది ప్రవహించినట్లు ప్రతీదీ అప్రయత్నంగా నిర్నిమిత్తంగా జరిగిపోతుంది. అక్కడ అన్ని చలనంలో ఉంటాయి. అన్ని సహజంగా జరుగుతాయి. కానీ వాటన్నిటినీ నిర్వహిస్తున్నాను అన్న అహంకారం అతనికి ఉండదు.

ఒక ప్రాచీన రోమన్ కథ ఉంది. అది గొప్ప కథ. గొప్ప సత్యాన్ని నిక్షిప్తం చేసుకున్న కథ. ఒక సన్యాసి ఉదాత్తమైన జీవితం గడిపాడు. అతనికి ఎలాంటి స్వార్థ చింతన లేదు. ఏ కోరికలూ లేవు. ఏదో సాదించేద్దాం అని అతను ఎప్పుడూ అనుకోలేదు. నిర్మలంగా , నిశ్చింతగా జీవించాడు. అతని సహజ జీవితం స్వర్గం దాకా వ్యాపించింది. అతను సాధారణంగా జీవించాడు. కానీ లోక దృష్టిలో అది అసాధారణం . కాంక్షలు లేని మనిషిని లోకం విచిత్రంగా చూస్తుంది. ఆ వ్యక్తి జౌన్నత్యానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. అటువంటి వ్యక్తి కోసం ఏమైనా చేయాలని సంకల్పించారు.

ఒక రోజు దేవతలు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. దేవతలను చూస్తూనే అతను భక్తితో, నమ్రతతో వాళ్ళకు ప్రణమిల్లాడు. “ నాలాంటి సామాన్యుడి పట్ల దయతో మీరు రావడం నా అదృష్టం . మీరు నన్ను ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి " అన్నాడు. దేవతలు " మేం నీకు ఆజ్ఞలివ్వడానికి, ఆదేశాలు జారీ చేయడానికి రాలేదు. నువ్వు నీదంటూ ఏమీ లేనివాడివి! నీ గురించి ఎప్పుడూ ఆలోచించని వాడివి. నిస్వార్థపరుడివి. నిరాడంబరుడివి. అలాంటి నీ కోసం ఏమైనా చేయాలనిపించి మేము వచ్చాం! నీకు ఇష్టమైన కోరికను కోరుకో. నువ్వు ఏమీ అడిగినా ఇస్తాం" అన్నారు దేవతలు!

దానికి ఆ సన్యాసి " మీరు నా పట్ల ఇంత దయగా ప్రవర్తించినందుకు ధన్యవాదాలు. నాకు సంబంధించిన కోరికలు అంటూ ఏమి లేవు. దైవం ఏది సంకల్పించిందో అదంతా యథాతథంగా జరుగుతోంది. మీరు ఇంతగా అడుగుతున్నారు. కాదంటే బాగుండదు. కానీ నాకు ఏమి అడగాలో తెలిడం లేదు. నేను ఊహించినవే కాదు. నేను ఊహించనవి కూడా దైవం నాకు ఇచ్చింది" అన్నాడు.

అతని వినమ్రతకు దేవతలు మరింతగా అతన్ని ఇష్టపడ్డారు. కారణం అతను కాంక్షా తీరానికి అతీతంగా ఉన్నాడన్న విషయం వాళ్ళకు తెలిసి వచ్చింది. కానీ అతనికి ఏదో చేయాలన్న తపన వాళ్ళలో పెరిగింది. " నువ్వు వద్దు అంటున్నావు. కానీ మాకు ఏదైనా నీ కోసం చేయాలని ఉంది. కాబట్టి దయచేసి ఏదైనా కోరుకో. మేం నీకు వరం ఇవ్వనిదే కదలం" అన్నారు.

సన్యాసి సంకటంలో పడ్డాడు.తప్పించుకునే వీలు లేదు. సరే! ఏం కోరాలో నాకయితే తెలియదు. మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ వరం ఇవ్వండి" అన్నాడు. దేవతలు అతను ఒప్పుకున్నందుకు సంతోషించి " నీకు గొప్ప వరం ఇస్తున్నాం . మరణించిన వారిని నువ్వు తాకితే వాళ్ళు బతికి లేచి కూర్చుంటారు" అన్నారు.! ఆ వరంతో సన్యాసి ఆలోచనలో పడ్డాడు. " మీరు అన్యదా భావించకండి. ఇలా చనిపోయిన వాళ్ళను బతికిస్తున్నాను అన్న స్పృహ ఉంటే నాలో అహంకారం పెరుగుతుంది. దయచేసి మీరు ఏ వరం ఇచ్చినా ఆ వరం యొక్క స్పృహ నాకు లేకుండా చేయండి" అని ప్రార్థించాడు.

ఆ మాటలు విని దేవతలు మరింతగా ఆనందించి " నీ నీడ ఎక్కడ పడినా అక్కడ చనిపోయిన అన్నీ తిరిగి బ్రతుకుతాయి" అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యారు.

వాళ్ళు వరం ఇచ్చారు.! ఆ వరం యొక్క స్పృహ ఆ సన్యాసికి లేదు. ఆయన తన పనుల్లో తాను ఉండేవాడు. ఆయన నీడ పడిన చోట ఎండిపోయిన పచ్చిక చిగురించేది. చనిపోయిన ప్రాణులు బ్రతికేవి. కానీ ఇదంతా ఆయనకు తెలిసేది కాదు. ఆయన తన దారంటే తాను వెళుతూ ఉండేవాడు. నీడ పడిన చోట నిత్యవసంతం ఉండేది. ఆ సన్యాసి మరణించి స్వర్గానికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవతల్తో మీరు ఎంతవరకూ పని చేసింది? అని అడిగాడు. అహంకారం ఉన్నప్పుడు కాంక్షలు ఉంటాయి. అవి ఏమీ లేనప్పుడు శూన్యంగా ఉంటాడు.
🌹 🌹 🌹 🌹 🌹

సేకరణ

No comments:

Post a Comment